RSS
Facebook
Twitter

Thursday, 4 August 2011

కిశోర్ జీవనఝరి


నటుడు గాయకుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు ,వీటితో బాటు
హాసం ను ( అంటే హాస్యం + సంగీతాన్ని ) కలిపిన అసమాన కళా
కారుడు కిశోర్ కుమార్. కిశోర్ జీవితం లోని విశేషాలను పాఠకుల
ముందుకు అద్భుతంగా తీసుకొని వచ్చారు ప్రఖ్యాత రచయిత
కిశోర్ జీవనఝరి పేరిట వ్రాసిన పుస్తకంలో. శ్రీ ప్రసాద్ గారి ఈ రచన
లో కీశోర్ గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను అపురూపమైన
ఫోటోలతో పాఠకులకు అందించారు.
తెరపై ఎంతటి అల్లరి చేసేవాడో నిజ జీవితంలో కూడా అంతటి అల్లరి
చేసేవాడు కిశోర్. చాలా సార్లు చనిపోయినట్లు నటించి ఇంట్లో వాళ్ళని
హడలగోట్టించే వాడు. అలా ఒకసారి అతను పడిపొతే భార్య లీనా
ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. శ్వాస ఆడటంలేదు. చాతీ కేసి
చూస్తే కదలటం లేదు. డాక్టరుకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పింది.
"కిశోర్ సంగతి నీకు తెలియనిదేముంది. ఇది కూడా అల్లరే! నేను
హడావిడిగా అక్కడికి రావటం, అతను లేచి కూర్చొని హాహాఅని నవ్వడం
మామూలే!" అని డాక్టర్ అంటే "లేదు, నిజంగా సీరియస్ గానే వుంది.
ఆలస్యం చేయకుండా రండి" అని ఆమె అనగానే "ఐతే నే వచ్చేలోగా
ఇలా ఫస్టైడు చేయండి" అన్నాడు .డాక్టర్. లీనా నోట్ చేసుకోడానికి
పాడ్, పెన్నుకోసం పక్కకు తిరగ గానే ఓ చెయ్యి వాటిని అందించింది.
తల తిప్పి చూస్తే కిశోర్. అలా ఆమెను ఆట పట్టించాడు.

ఎమర్జన్సీ చీకటి రోజుల్లో ప్రభుత్వ పధకాలకు పబ్లిసిటీ కొసం తారలందరూ
పాల్గొనాలని అంటే కిశోర్ పాలకులను ధైర్యంగా ఎదిరించి ఆ కార్యక్రమాలలో
కిశోర్ మాత్రం పాల్గొనలేదు..అందుకు కోపగించిన ప్రభుత్వం రేడియో,టీవీ
లలో కీశోర్ పాటలు వినిపించ రాదనే ఆంక్షలు విధించారు.
కిశోర్ కుమార్, ఆశోక్ కుమార్, అనూప్ కుమార్ ఈ ముగ్గురు సోదరులు
కలసి నటించిన "చల్తీ కా నామ్ గాడీ" ఈ నాటికీ మేటి హాస్య చిత్రంగా
నిలచింది. మరెన్నో కిశోర్ జీవిత విశేషాలను తెలుసు కోవడానికి "హాసం"
ప్రచురించిన ఈ పుస్తకం కిశోర్ అభిమానులంతా తప్పక చదివి స్వంతం
చేసుకోవలసిన అపురూపమైన పుస్తకం. ఇందులో కిశోర్ పాడిన పాటలు
వాటి తెలుగు అర్ధం వివరించడం ప్రత్యేకత.ఈ పుస్తకం గురించి శ్రి వి ఏ కె.
రంగారావు గారు తన ముందు మాటలో ఇలా అంటారు. "యీ పుస్తకంలో
ఎక్కడా మనస్సు చివుక్కుమనిపించే మాటల్లేకపోవడం అందరినీ మెప్పిస్తుంది.
అలా అని కిశోర్ పిచ్చికళలు, పెళ్ళి చేష్టలు ( నాలుగు),వివాహనికి పూర్వమే
సహనివాసం చేయడం-ఏదీ దాచి పెట్టబడలేదు"

Wednesday, 3 August 2011


అప్పుమీద రమణగారి మరికొన్ని చమత్కారాలు అప్పుగా ఇస్తున్నాను. మీరు
మీకు తెలిసినవాళ్ళకి అప్పిచ్చేయండి.
"జీవితమే పెద్ద అప్పు"
" అప్పడక్క పోతే వాడేవడో మనమెవడో
అడిగితేనే ఇవ్వడం, ఇస్తేనే పుచ్చుకోవడం
పుచ్చుకుంటేనే మళ్ళీ ఇవ్వడం ఈ మూడూ
లేకపోతే జీవితం బోరు కొట్టెయ్యదూ "
<><><><><><><><>
"చంద్రుడు" సూర్యుడి దగ్గర నుంచి కాంతిని అప్పు తీసుకుంటాడు.
అందుకే ఋణ కిరణుడయ్యాడు. సూర్యుడు కాంతిని ఎక్కడా
అప్పుచ్చుకోలేదు. అందుకే అఋణకిరణుడయ్యాడు"
ఈ ప్రాధమిక సత్యంతో "ఋణానందలహరి" మొదలవుతుంది
మనం పంచతంత్రం కధలు, ఈసప్ కధలు చదివాం.రమణగారు తన
"ఋణానందలహరి"లో కాకుల చేత , చీమల చేత, పాములచేత వాళ్ల
భాషలోనే మాట్లాడించారు.కాకులవి కావు కేకలు,కావులింతలు,చీమలవి
చిమ చిమ నవ్వులు, ఇక పాములవి "దోబుస"లు, గాలి బోంచేసి "బుస్సు"న
తేన్చటాలు వినిపిస్తారు!! ఇక వీటికి తగ్గ సామెతలూ, మాటలూ చెప్పారు.
పాము: "కోటికి పడగెత్తి పుట్టింది
కాకులు: "రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళు
పెద్ద కాకి చిన్న కాకితో కోపంగా " కాకమ్మ కబుర్లు చెప్పొద్దు" అని
కావు కేకలు వేసింది.
ఈటీవీ శ్రీ బాపు దర్శకత్వంలో నిర్మాణం చేసిన శ్రీ భాగవతం లో రమణ గీతాలలో
కూడా రమణగారి మార్కు అగుపిస్తుంది. కార్తవీర్యుని జలక్రీడ ఘట్టానికి ఆయన
గీత రచన సొగసులు చూడండి.
గలగల పారెడు నది - యిది
కిల కిల నవ్వించు నది-ఈ
వలపుల కౌగిలి మ-నది
అలానే రామకధ దృశ్యాలలో
ఆ లంకలో నున్న వనము సుందరము
ఆ లంకలో సీత మనము సుందరము
ఆ వనములో హనుమ రణము సుందరము
మనిషి మంచి చెడ్డల గురించి బాపురమణలు తీసిన మొదటి సినిమా "సాక్షి" లో
హీరోయిన్ చుక్క చేత రమణగారు పలికించిన మేలుపలుకులు:
"మంచోళ్ళు సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు మావా! మంచి చెడ్డా
కలిస్తేనే మడిసి."
ఇందులో నేను మీకు చెప్పిన విశేషాలు అన్నీ రమణగారి పుస్తకాలనుంచి , కీ"శే"
ఎమ్వీయల్ ముళ్లపూడి సాహిత్యంపై "కానుక" పేరిట వ్రాసిన సమగ్ర పరిశోధనా
పుస్తకం నుంచి అప్పుతీసుకొని వ్రాసినవి. కాపీరైట్ మీద రమణగారు ఇలా అన్నారు.
"అసలు కాపిరైటు అన్న మాటలోనే కాపీ చాలా రైటన్నపని అనీన్నీ, కాపీ ఒక
రైటు (హక్కు) అనిన్నీ, తాత్పర్యాలు దాంకుని ఉన్నాయి అనీ, పెద్దల క్రిటికా
తాత్పర్యాలు ఘోషిస్తున్నాయి.అందువల్లనే ఇరుగు పొరుగు కధలూ పాటలూ
కాపీ కొట్టడం జరుగుతుంది.!"
అప్పారావు దొంగేడుపు కార్టూన్ కూడా బాపుగారి దగ్గర అప్పుతీసుకున్న
కాపీరైటు !! నా పేరే అప్పారావు.!!నా పేరు రమణగారు అప్పుతీసుకున్నారు!!

Tuesday, 2 August 2011

ఎన్నిసార్లు ముళ్లపూడి వెంకట రమణగారి మాటల నవ్వులాటలు చదివినా
తలపుకు వచ్చినా తనివితీరదు ! మరో సారి ఆయన మాటల చమత్కారాల
విందును ఆస్వాదిద్దాం!
ఆరుద్రగారు ఒక సారి ముళ్ళపూడివారితో "నేను సిగరెట్లు తాగడం
మానేశాను తెలుసాండి !" అన్నారు దర్పంగా.
"అదేం గొప్ప ! నేను అలా చాలా సార్లు మానేశాను" అన్నారు బుడుగు
రమణగారు.
<><><><><><><><><><><>
ఒకాయన ముళ్లపూడి వారి వద్దకు వచ్చాడు. ఆ మాటా ఈ మాటా
మాట్లాడుతూ " మద్రాసులో ఎక్కువ అరవవాళ్ళే వుంటారు కదా ?
వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా?" అన్నాడు.
రమణగారు ఆయనకు తన మార్కు జవాబిచ్చారు.
"ఏముందీ ? మీరు పేపరు కొని చదువుతుంటే, మధ్యలో ఆ
పేపర్ ఎవరు తీసుకుంటారో వాడే తెలుగువాడు!"
"ఋణానందలహరి" లోఅప్పారావు ఆకారం గురించి రమణాగారి వర్ణన:
అప్పారావు కొత్త రూపాయి నోటులా ఫెళఫెళ లాడుతూ ఉంటాడు.
కాల దోషం పట్టిన దస్తావేజులాంటి మాసిన గుడ్డలూ, బడి పంతులు
గారి చేబదుళ్ళలా (ఆ రోజుల్లో మాష్టార్లకు సరిగా జీతాలొచ్చేవు కావు)
చిందర వందరగా వుండే జుట్టూ, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా
మెరిసే పత్తికాయల్లాంటి కళ్ళూ, అప్పులివ్వగల వారందర్నీ చేపల్లా
ఆకర్షించగల యెదలాంటి చురుకైన చూపులూ- అతను బాకీల వాళ్ళకి
కోపిష్టి వాళ్ళ జవాబులా టూకీగా వుంటాడు.
ఇక ఆయన చెప్పిన అప్పుపమానాలు :)
"అప్పులు తీర్చేసిన వాడి మనసులా"
"అప్పుచేసిన డబ్బులా హడావిడిగా ఖర్చయి పోయింది"
అప్పు పై సూక్తులు :
" ఏ జేబులో ఏ అప్పుందో "
"లైఫే ఓ పెద్ద ట్రిక్కు-జీవితమే ఓ పెద్ద అప్పు"
"అడగ్గానే అప్పుదొరకా"
ఆయన డైలాగులు వ్రాసిన "ముత్యాలముగ్గు" ( రావు గోపాలరావు
డైలాగుల 45RPM రికార్డులు ఆ రోజుల్లో మొదటిసారిగా ఆంధ్ర
ప్రదేశ్ లో 10,000 అమ్ముడయ్యి రికార్డూ సృష్టించాయి! ముళ్ళపూడి
" హాల్లో నవ్వినంత మాత్రాన మంచి కామెడీ అని చెప్పలేం" అన్నతన
వ్యాసంలో ఇలా అంటారు.
" ఒక హాస్య సంఘటన బాగా రూపొందించాం అని ఎప్పుడు
అనిపిస్తుందంటే దాన్ని శ్రోత విని, మనసులో పెట్టుకొని
దాన్ని "రిపీట్" చేస్తే , అది హాస్యాన్ని ఉన్నత శిఖరాలకు
తీసుకు వెళ్ళినట్లు"
మరి కొన్ని రేపో ఎల్లుండో చెప్పుకుందామా మరి !!

Sunday, 31 July 2011



ఇంతకుముందు తెలుగులో కూడా నటులకు ( చిరంజీవి ) ప్రత్యేకంగా ఒక
పత్రిక కొతకాలం క్రితం వచ్చేది. ఇంగ్లీషులో ఇలా నటుల మీద, అలానే కొన్ని
సినిమాల మీద పత్రికలు వచ్చాయి. THE BEST OF STALLONE
పేర ఓ పత్రిక వెలువడింది. ఇందులో స్టాలోన్ నటించిన రాకీ , స్టేయింగ్
అలైవ్, రాంబో మొదలైన చిత్రాల లోని స్టిల్స్, చిత్ర నిర్మాణ విశేషాలు
ఉన్నాయి.

అలానే A VIEW TO A KILL జేమ్స్ బాండ్ సినిమా గురించి ఆ చిత్ర
విశేషాలతో, హీరో హీరోయిన్స్, సాంకేతిక నిపుణల గురించి కధనాలతో
ఓ పత్రిక వచ్చింది.ఈ సినిమాదృశ్యాల స్టోరీ బోర్డు (మన బాపు గారిలా)
ఇందులో వేశారు.
అఫీషియల్ మూవీ మాగజైన్ పేరిట STAR TREK IV the voyage
home పేరిట ఓ పత్రిక ఆ చిత్రం విడుదలైన రోజుల్లో వచ్చింది. ఆ చిత్రం
లోని అద్భుతమైన రంగుల ఫొటోలతోప్రతి పేజీ ఆకర్షనీయంగా తారల
చిత్ర పరిచయాలతొ వెలువరించారు
STAR TREK II, the wrath of khan చిత్రం ఫొటొ స్టోరీ పేరిట, ఫోటో
నావల్ పేరిట CLOSE ENCOUNTERS of the third kind చిత్రం
పాకెట్ పుస్తకాల రూపాన విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత ఈ పుస్తకాల్లో
ఆ చిత్రాల స్టిల్స్(ఫొటోలు) వరుసగా వేసి బొమ్మల కధలాగ ప్రచురించటం!.
ఇలాటి ప్రయత్నాన్ని మగధీర, శక్తి మొదలయిన తెలుగు చిత్రాలతో మన
నిర్మాతలు కూడా చేస్తే బాగుంటుంది.

Saturday, 30 July 2011

"రస హృదయ వశిష్టుడు" సినారె నిన్ననే ( 29 ) తేదిన 81 వ జన్మదినం
జరుపుకున్నారు.ఆచార్యుడు,ప్రముఖకవి,సినీ గేయ రచయిత శ్రీ సి.నారాయణ
రెడ్డిగారు తెలంగాణాలోని హనుమాజీపేట అనే చిన్న గ్రామంలో 1931లోజన్మించారు.
సినారెగా పేరు గాంచిన ఆయన హైదరాబదు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు
ప్రొఫెసరుగా పని చేస్తూనే తెలుగు సినీరంగంలోకి 1961లో గీత రచయితగా
ఎన్.టి.ఆర్ "గులేబకావళి కధ" తో ప్రవేశించారు. మద్రాసులో నివాసం వుండకుండా
హైదరాబాదులోనే వుంటూ శ్రీ శ్రీ, ఆత్రేయ, ఆరుద్ర లాంటి దిగ్గజాల మధ్య నిలబడి
పాటల రచయితగా అసమాన ఖ్యాతి పొందారంటే సామాన్య విషయం కాదు. సినారె
ప్రభంధక మాటలను తన సినీగేయ రచనలో పరిచయం చేశారు. ఆయన స్వయంగా
మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. "కర్పూర వసంతరాయలు"
ఆయన మధుర స్వరంతో ఆలపించగా అమెరికాలోని ఆయన అభిమానులద్వారా
లాంగ్ ప్లేయింగ్ రికార్డుగా అమెరికాలో తయారయి విడుదలచేయబడింది.ఆLP
రికార్డు స్లీవ్ మీద ఆయన ఆటోగ్రాఫు తీసుకొనే అదృష్టం నాకు కలిగింది.
సినారె లలిత గీతాలు, గేయ కావ్యాలు వ్రాశారు." ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
దాగెనో, "సాగుమా ఓ నీల మేఘమా" మొదలయిన గీతాలు సినిమాకోసం వ్రాసినవి
కావు. తరువాత వాటిని వివిధ సినిమాలలో ఉపయోగించడం జరిగింది. ఎన్.టి.ఆర్
ద్వారానే సినిమా గేయ రచనా వ్యాసంగంలోకి ప్రవేశం జరిగిందని సినారె అన్నారు.
1961లో "గులాబికావళి"చిత్రానికి అన్ని పాటలూ వ్రాశారు. శనివారం సాయంత్రం
హైదరాబాదు నుండి మద్రాసుకు బయలుదేరి పాటలు వ్రాసి సోమవారం ఉదయం
ఫ్లైట్ లోతిరిగి వచ్చి యునివర్సిటీలో ఆయన క్లాసులకు హాజరయ్యే వారంటే సినారె
కార్య దీక్షత, సమయ పాలన అర్ధం చేసుకోవచ్చు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు.
రచయిత గాయకుడే కాదు, మంచి వక్త. ఘజల్స్ అద్భుతంగా గానం చేసిన ఘనుడు.
మొదటిసారిగా " మాయదారి చిన్నోడు నామనసే లాగేసిండు" పాటలో తెలంగాణా
మాండలికాన్ని సినిమా గీతాలలో ప్రవేశపెట్టీ ప్రశంసలందుకున్నారు.


ఆయన రాసిన ప్రఖ్యాత కావ్యరచనలు "కర్ఫూర వసంతరాయలు", "నాగార్జునసాగరం",
"జాతిరత్నం", "ఋతుచక్రం" ,"విశ్వంభర", గేయ నాటికలు -"నవ్వని పువ్వు","అజంతా
సుందరి", "వెన్నెలవాడ" మొదలయినవి. జ్ఞానపీఠ ఎవార్డు, పద్మవిభూషన్ అందుకున్నారు.
సినారె చణుకులు
1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరంలో శ్రీ సినారెకి సన్మానంఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
"మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
సినారె !
మరొక చణుకు......
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
ప్రేమగా చలోక్తి విసిరారు.
ఒకటి పిడికిలెత్తేది !
సినారె కవితలు
ఉన్నాయి నాకు రెండు చేతులు
ఈ దేశంలో అందరికున్నట్లే
ఒకటి బిచ్చమెత్తేది
ఒకటి పిడికిలెత్తేది !
ఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
"మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
సినారె !
మరొక చణుకు......
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
ప్రేమగా చలోక్తి విసిరారు.
ఒకటి పిడికిలెత్తేది !
సినారె కవితలు
ఉన్నాయి నాకు రెండు చేతులు
ఈ దేశంలో అందరికున్నట్లే
ఒకటి బిచ్చమెత్తేది
ఒకటి పిడికిలెత్తేది !

  • Blogger news

  • Blogroll

  • About