RSS
Facebook
Twitter

Tuesday, 30 November 2010


1963 ప్రాంతాలలో ముళ్ళపూడి, బాపు, ఆరుద్ర, నండూరి రామమోహనరావు,
రావి కొండలరావు మొదలైన ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి"
మాస పత్రికలో ప్రతి పేజీ ఆణి ముత్యమే! అలాటి ముత్యాలను ఏర్చి కూర్చి
1964లో "రసికజన మనోభిరామము" అనే పుస్తకాన్ని జ్యోతి బుక్స్ వారు
ప్రచురించారు. సాధారణంగా ఆడవాళ్ళు కలిస్తె వాళ్ళ కబుర్లకు అంతే వుండదు.
ఆ విషయాన్ని " భామాకలాపం" పేరిట వచ్చినఆ సరదా కధనం చదవండి.
) <<<<<<<<<<<<<<‌>>>>>>>>>>>>>>>>>>>>(

రామారావుగారింటి గుమ్మంలో సంభాషణ : -
మగవారు :
"వెళ్ళొస్తాం రామారావుగారు !"
"ఉంటానండి సుబ్బారావుగరు !"
ఆడవారు :
"వెళ్ళొస్తాం సుబ్బాయమ్మగారు !"
"ఉంటానండి జానికమ్మగారు !"
"అప్పుడప్పుడు మా యింటి కొస్తూ వుండండి "
"తప్పకుండాను. మీరు వేరే చెప్పాలా ?"
"ఇహ వస్తానండి, బాహా పొద్దోయింది.ఇంకా వంట చేసుకోవాలి
ఇంటికి పోయి"
"మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ వుండండి జానికమ్మగారూ !"
" ఆ అలాగేనండి. ఇహ వెళ్ళొస్తాను."
" ఈసారి వచ్చేటప్పుడు మీ సరళనికూడా తీసుకురండి.ఛూసి చాలా
రోజులైంది"
"అలాగే, ఇవాళే తీసుకొచ్చేదాన్నిగాని,తల నొప్పిగా వుందంటూ
పడుకుంది"
"ఈసారి తప్పకుండా తీసుకురావాలి సుమాండీ"
" అలాగే, ఇహ వెడతానండి. ఆలస్యమైతే ఆయన మళ్ళీ కేక లేస్తారు.
అన్నట్టు మీ అబ్బాయికెక్కడన్నా ఉద్యోగమైందా?"
"ఏదండీ ! ఇంకాచూస్తున్నాడు.ఎవర్నడిగినా ఖాళీలు లేవనే మాటే"
"నెమ్మదిగా దొరుకుతుంది లెండి.కుర్రాడు బుద్ధిమంతుడు.తెలివైన
వాడు. ఆ.....వస్తున్నా, ఇహ వస్తానండి"
"అప్పుడప్పుడు వస్తూవుండండి"
"అలాగే, అబ్బాయికేమన్నా సంబంధాలొస్తున్నాయా సుబ్బాయమ్మగారూ !"
"ఏవో వస్తున్నాయి గానీండి......."
" మా సరళకీ చూస్తున్నాంగాని యేదీ నచ్చట్లేదు.ఒహటుంటే ఒహటుండదు.
ఇహ వస్తానండీ........."
"ఉంటానండి జానికమ్మగారూ ! ఈ సారి మీ సరళని తప్పకుండా తీసుకురండి"
"ఇవాళే తీసుకొచ్చేదాన్నిగాని...ఆ.... వచ్చె వచ్చే.....వెడతానండి.ఈసారి మీరూ
అన్నగారూ మాయింటికి భోజనానికి రావాలి"
"భోజనాని కేం భాగ్యంలెండి.అన్నట్టు సరళకి పద్ధెనిమిదోయేడు వెళ్ళిందా?"
""అబ్బే,పద్దెనిమిది దెక్కడండీ, ఇంకా పదిహేడు వెళ్ళందే."
"ఈసారి తప్పకుండా తీసుకురండి. చూసి చాలా రోజులైంది."
"అలాగేనండి.ఇహ వస్తాను. ఇంకా వంట చేసుకోవాలి పోయి. ఏమిటో సంబంధాలు
కుదరటమంటే మాటలా ?....."
"మరేనండి. ఈ కాలంలో......"
( శిష్యా ! ఇది అనంతం ! ) అంటూ ముగించారు రచయిత ?
అసలు ఇంత చక్కగా చెప్పిన ఈ కధనం రూపకర్త ఎవరో?! ఈసారి రమణగారిని
కలసినప్పుడు అడగాలి.
"జ్యోతి" సౌజన్యంతో

Monday, 29 November 2010

మీరూ బొమ్మలు గీయండి !!



మీరు పత్రికలలో కార్టున్లు చూసినప్పుడు నాకూ బొమ్మలు వేయటం
వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంటుంది కదూ? మీకు వచ్చినా బాపూ
గారిలా జీవం వుట్టిపడేటట్టు నా బొమ్మలూ లేవే అని అనిపుస్తూ వుండొచ్చు.
కార్టూను గీయాలనే ఆశక్తి వున్న చాలామంది కోసం బాపూగారు "బొమ్మలు
గీయండి" అనే సచిత్ర పుస్తకాన్ని వ్రాసారు. ఎమెస్కో విజయకుమార్ గారు
అందంగా ప్రచురించారు. కార్టూనిస్టులు, కార్టూన్ ఇస్టులూ తప్పక దగ్గర వుంచు
కోవలసిన మంచి పుస్తకం. ఎమెస్కో విజయకుమార్ గారు ఇలా అంటారు.
"ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపుగారికి
నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుంటారని
ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి
ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది"
గురువుగారు శ్రీ బాపు తన పుస్తకంలో ఇలా వ్రాసారు. "నా దగ్గర ఎప్పుడూ స్కెచింగ్
పుస్తకం వుండేది. బీచికి వెళ్ళినప్పుడు-కాలేజీకి వెళ్తున్నప్పుడు, ట్రాంబండిలోనూ-
ప్రతి వేసంగి శలవులకీ మా నాన్నగారు మా పల్లెటూరికి తీసుకొని వెళ్ళినప్పుడు
ప్రయాణం చేసే రైలులో మనుషుల్నీ కబుర్లు చెప్పుకునే వాళ్ళనీ,పై బెర్తు మీద
పడుకున్న వాళ్ళనీ ,కాలక్షేపం బఠానీలు అమ్ముకునే వాడినీ, నీలాటి రేవుల
వద్ద కూర్చొని నీళ్ళుతెచ్చుకునే ఇల్లాళ్ళను,అందంగా నడుం వంచి బిందె ఆనించి
తలమీంచి చెయ్యివేసి పైన పట్టుకునే సొగసూ, కాళ్ళ పారాణీ, పట్టాలు,కడియాలు,
లోలాకులు,జడగంటలూ ఇలా అన్నీ వేసుకునే వాణ్ణి. ఇవన్నీ దరిమిలా పత్రికలకు
బొమ్మలేసినపుడు పనికొచ్చేవి."
ఈ పుస్తకంలో బిల్ వాటర్సన్, పీటర్ ఆర్నో, అహ్మద్, గోపులు,,హోకూసాయ్,
డెడినీ, హైనెస్,.ఆర్కే లక్ష్మణ్, ఎడ్మండ్ డులాక్,,హెర్గే( టిన్ టిన్), హాగర్త్ (టార్జాన్)
మొదలైన ప్రముఖ దేశ్ విదేశీ చిత్రకారుల చిత్ర రచనా శైలిని, తన కుంచె తో వేసి
చూపించారు.ప్రతి పేజీ వెనుకవైపు ఆ బొమ్మలను టిన్ట్ లో ముద్రించి పెన్సిల్ తో
అభ్యాసం చేసుకోవడానికి వీలు కలగించారు. ఎమెస్కో విజయవాడ వారు
ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఈ రోజే సొంతం చేసుకోండి.

Sunday, 28 November 2010

బాపుగారి నుంచి మీకో మాట!


బాపూగారి అశేష అభిమానులతొ ఆయన రెండు మాటలు చెప్పడానికి
మీ ముందుకు వచ్చారు. అందమైన అమ్మాయిలకు అభిమానులు
పెట్టుకొన్న ముద్దు పేరు "బామ్మ"! అంటే "బా"పూ బొ"మ్మ" !! ఇక
ముక్కోటి దేవతలను వాళ్ళంతా" మేం ఇంత బా(పు)గుంటామా ? "అని
ఆశ్చర్యపడేటట్లు గీశారు.!!.
అమూల్యమైన ఆ బొమ్మలను కొంతమంది స్వార్ధ పరులు, కనీసం
ఆయన అనుమతి తీసుకోకుండా వుపయోగించడం మొదలెట్టారు.
మరికొందరు శుభలేఖలకు ఆయన బొమ్మలను వాడుతున్నారు.
మరొ వింతైన విషయమేమిటంటే పెద్దబాలశిక్ష అన్న ఓ పుస్తకాన్ని
ఓ ప్రచురుణకర్త దాదాపు ప్రతి పేజిలోను బాపుగారి బొమ్మలను
వేస్తూ, ఇందులోని రచనలు, బొమ్మలు ప్రచురుణ కర్త అనుమతిలేనిదే
వుపయోగించరాదు అంటూ ఓ హెచ్చరిక వేయడమే !!
బాపుగారి బొమ్మలను ఇంట్లో అలంకరించుకోవాలన్నా,మరే విధంగా
వాడుకోవాలన్నా www.bapuartcollections.com వెబ్సైట్ ద్వారా
కొనుక్కోవచ్చు. ఈ సైట్ లో వేలాది బాపుగారి తెలుపు నలుపు చిత్రాలతో
బాటు అందాల వర్ణ చిత్రాలులలో మనకు నచ్చినవి ఎన్నిక చేసుకోవచ్చు.
అభిమానులంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తాను.

Saturday, 27 November 2010






ఇక్కడ ఉన్న ఫొటోలలో ఉన్న మా చిన్నారి అమ్మాయిలు ఎడమ వైపు
బొమ్మ పట్టుకుని వున్నది పెద్దమ్మాయి మాధురి,ప్రక్కన చిన్నమ్మాయి మాధవి.
మాధురికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటమంటే చాలా ఇష్టం. ఓ సారి
సర్కస్ లో ఏనుగు శివలింగాన్ని పూజ చేయడం చూసి ఇంటికి రాగానే
తన పిగ్గీ బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లు , ఏనుగు పది పైసలు డిబ్బీలో
వేస్తున్నట్లు గీసింది. దాన్ని మా బ్యాంకు హెడ్డాఫీసుకు పంపితే బ్యాంకు
సర్కిల్ బులెటిన్ లో వేశారు. అత్తవారిళ్ళు మద్రాసుకు వెళ్ళాక ఆర్ట్ నేర్చు
కుంది. శెలవుల్లో మైలాపూర్ చుట్టుపక్కల ఇళ్ళల్లోని పిల్లలకు సరదాగా
బొమ్మలు గీయటం నేర్పుతున్నది. ఇక్కడ మాధురి చిన్నప్పుడు గీసిన
ఏనుగు బొమ్మ, పెద్దయ్యాక వేసిన పెయింటింగ్ చూపిస్తున్నాను. చిన్నమ్మాయి
మాధవి ( బొంబాయి) కూతురు జోషిత (6) బొమ్మలు బాగా వేస్తుంది.
చిన్నప్పుడు బొమ్మతో అమ్మ ఆటలు ఆడుకున్న మాధురి, పెద్దయ్యాక
నిజం అమ్మగా మారిన మాధురి ఫొటోలు ఆత్మీయులైన మీకు చూపిస్తున్నాను!

Friday, 26 November 2010



అద్భుత వర్ణ చిత్రకారుడిగా రాజా రవివర్మ పేరు తెలియని వారుండరు.
ఆయన చిత్రించిన దేవతా చిత్రాలు చూస్తుంటే తమ చిత్రాలను
చిత్రింపజేసుకోవడానికి ముక్కోటి దేవతలు దిగివచ్చి అయన ముందు
నిలిచారేమోనని అనిపిస్తుంది. రాజా రవి వర్మ ఏప్రియల్ 29, 1848లో
కేరళలోని ట్రావెన్కోర్, కిల్లిమానూర్ లో జన్మించారు. ఆయన తండ్రి ఎజు
మవలి భట్టటిరిపాడ్, తల్లి ఉమాయాంబ తంపురాట్టి. ఆమె మంచి కవయిత్రి.
ఆమె రచించిన "పార్వతి స్వయంవరం" గ్రంధాన్ని రవి వర్మ పుస్తకరూపం
లోకి తెచ్చాడు. ఆయన తన బంధువు మహారాజా అయ్ల్యం తిరునాళ్ దగ్గర
చిత్రరచనను అభ్యసించారు. పాతికేళ్ళ వయసునాటికే ఆయన వియన్నాలో
జరిగిన చిత్ర ప్రదర్శనలో పాల్గొని బహుమతిని సాధించాడు. దేశమంతా
పర్యటించి వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు, నిసితంగా పరిశీలించి
సజీవ చిత్రాలుగా రూపొందించాడు. ఉత్తరాదిలో పర్యటించినప్పుడు, "శకుంతల
దుష్యంతులు", "నలదమయంతి" కధలలోని దృశ్యాలను వర్ణచిత్రాలుగా
అపురూపంగా చిత్రించాడు.
1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ రవివర్మ పర్తిభను గుర్తించి
"రాజా" అన్న బిరుదును ప్రదానం చేశాడు. ఆనాటినుంచి రవివర్మ పేరుకు
ముందు రాజా అన్న బిరుదు స్ఠిర పడింది.
ఆయన కుంచె నుంచి వెలువడిన చిత్రాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి.
ఈ నాడు అందమైన అమ్మాయిని బాపూ బొమ్మ అని ఎట్లా అంటున్నామో
ఆనాడు అందమైన స్త్రీని రవివర్మ బొమ్మగా వర్ణించే వారు. కేరళ ప్రభుత్వం
"రవి వర్మ పురస్కారం" పేరిట లబ్ద ప్రతిశ్ఠులైన చిత్రకారులను ప్రతి ఏట
సత్కరిస్తున్నది.
ఈ వర్ణ చిత్ర మాంత్రికుడు 2, 1906 లో తన 58 వ ఏట కీర్తిశేషు
డయ్యారు.

Thursday, 18 November 2010

పాటల రికార్డులు

ఇప్పుడైతే కాసెట్స్, ఆడియో సిడీలు వచ్చాయి కాని దాదాపు
1983 వరకు పాటలు వినాలంటే వినైల్లో తయారయిన LP
( 33 RPM Long Playing Records), SP (Standard
play ) రికార్డులే వుండేవి. అంతకు ముందు 78 RPM ఒక
రకం మట్టి,లక్క ఉపయోగించి చేసిన రికార్డులు వచ్చేవి. వీటి
లో ఒక వైపు ఒక పాట, రెండో వైపు మరొ పాట వుండేది. యల్ఫీ
రికార్డుల్లో దాదాపు రెండు వైపులా కలిపి డజను దాకా పాటలు
వినే వీలుండేది. యస్పీ రికార్డుల్లో నాలుగు పాటలకు చోటుంటుంది.
నా ఫిలిప్స్ రెకార్డు ప్లేయర్లో అక్కినేని సినిమాల్లోని హిట్ పాటల
వాయిద్య సంగీతాన్ని కొంచెం మీకు వినిపించే ప్రయత్నం చేశాను..

Wednesday, 17 November 2010

మేలుపలుకుల మేలుకొలుపులు



శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపుగారి వర్ణ చిత్రాలతో
తమిళం లో వున్న తిరుప్పావై దివ్యప్రబంధం తెలుగులోనికి
అందంగా తెనిగించారు. ఆ అందాల మేలుకొలుపులో సిరినోము
అనే ముందు మాటలో రమణ గారు వ్రాసిన కొన్ని మాటలను
మీ ముందు వుంచుతున్నాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"కొండంత దేవుడికి గోరంత పత్రి చాలు - అది భక్తితో ఇస్తేనే.
వేదవేదాంతాలు అర్ధపరమార్ధాలూ మంత్ర తంత్రాలూ తెలిసిన
ఎంత జ్ఞాని అయినా భక్తి లేకుండా కొండంత పత్రీ పూలూ
గుమ్మరించినా అవి గోరంత కూడా స్వామికి చేరవు-చాలవు.
ఈశ్వర స్పృహలేని జ్ఞానం మేఘాలమధ్య ఇరుక్కున్న సూర్య
చంద్రుల వంటివి.కొరగాని వెలుగు, అట్టి జ్ఞానానికి అహంకారమనే
చత్వారం వస్తుంది".
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
కలియుగంలోని శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి-ద్వాపరంలోని
రేపల్లె గొల్లభామగా తనని తాను భావించుకుంది. తమ మధ్యనే
తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం,రాత్రి
వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన
భావరాగానురాగాల పారిజాతాల మాల ఈ తిరిప్పావై.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రమణగారు ఇంకా ఇలా అంటారు, "ప్రసిద్ధగాయని ఎం.ఎల్.
వసంతకుమారి ఈ పాశురాలను గ్రామఫోను రికార్డులుగా
ఇచ్చారు ( 78 ఆర్.పి.యం).అప్పట్లో ఈపి,ఎల్పీ (ఎక్స్ టెండెడ్ ప్లే,
లాంగ్ ప్లే} రికార్డులు కూడా రాలేదు.టేపులు అంతకన్నా లేవు.
మైలాపూరులో బాపు ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి
కోవెల దగ్గరకు తెల్లవారు జామున నాలుగింటికి వెళ్ళి నిలబడితే
ఈ పాశురాలు నాలుగైదు (న్యాయంగా రోజుకు ఒకటే) పెట్టేవారు.
హాయిగా మెత్తగా స్తోత్రగానం లాగ వుండేది ఆవిడ పాట. నేను
అనుకున్న అల్లరి తనం లేకున్నా- ఏదో గొప్ప పాట వింటున్నా
మన్న ఆనందంతో భక్తితో అవి విని వెళ్ళిపోయేవాడిని. పాటలో
సంగతికీ పాటల సంగతికీ కొంతయినా పొంతన కుదిరేది"
ఆ పాటల మీద ఇష్టం,ఆయన చేత తేట తెలుగులో మనకు
ఆ పాశురాలు అందటం మనం చేసుకొన్న అదృష్ఠం.
చివరిగా శ్రీ ముళ్లపూడి ఇలా అంటారు:
" ఇదీ జరిగింది-ఇది నేను వ్రాసిందికాదు-
శ్రీ అండాళ్ తల్లి అనుగ్రహించింది,ధన్యోస్మి"
ప్రతి ఒక్కరు చదివి స్వంతం చేసుకోవలసిన ఈ అందాల
పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్, విజయవాడ వారు ప్రచురించారు.
వివరాలకు:e-mail: emescobooks@yahoo.com
web:emescobooks.com

Tuesday, 16 November 2010

మన పత్రికలు


ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని 1956 లో చేసినా ,ప్రెస్ కౌన్సిల్
నిజానికి మొదలయింది నవంబరు 16,1966. అందుకే
ఈ రోజును నేషనల్ ప్రెస్ డే గా జరుపుకుంటున్నాం.
కొంతవరకైనా ప్రజాప్రతినిధులు భయపడుతున్నారంటే
దానికి కారణం మన పత్రికలే! ఆనాటి బోఫర్స్ కుంభ
కోణం నుంచి ఈ నాటి కామన్వెల్త్ గేమ్స్ వరకు పత్రికలు
ఎన్నెన్నో చీకటి విషయాలు ప్రజల ముందు ఉంచాయి.
ఏదైనా ఒక దేశంలో ప్రజాసామ్య వ్యవస్త ఎట్లా పనిచేస్తుందో
తెలియాలంటే పత్రికలదే ప్రధాన పాత్ర. అందుకే ఎమర్జన్సీ
చీకటి రోజుల్లొ పత్రికల గొంతు నొక్కేయటానికి అప్పటి
ప్రభుత్వం చేయరాని ప్రయత్నం లేదు. అట్లాఅని పత్రికా
స్వాతంత్ర్యాన్ని దుర్నియోగం చేసిన సంధర్భాలూ కొన్ని
వుండొచ్చు. అందుకే ప్రెస్ కౌన్సిల్ ఏర్పడింది. స్వాతంత్ర
ఉద్యమంలో ఆంధ్రపత్రిక లాంటి పత్రికలు పోషించిన ప్రముఖ
పాత్ర ఎట్లా మరచిపోగలం? ఆ రోజుల్లో నాయకులు పత్రికలలో
తమపై వచ్చే విమర్శలను,అభిప్రాయాల గురించి విజ్ఞతతో
ఆలొచించే వారు. జవహరలాల్ నెహ్రూజీ శంకర్శ్ వీక్లీలో
శ్రీ శంకర్ వారం వారం తనపై వేసే కార్టూన్లను చూసి
అమితంగా ఆనందించే వారట! ఒక వేళ ఏ వారమైనా తనపై
కార్టూన్ లేక పోతే శంకర్ గారికి ఫోన్ చేసేవారట! విచిత్ర మేమంటే
ఆయన కుమార్తె రోజులొచ్చేటప్పటికి ఆ మంచి పత్రిక మూల
పడింది. అంతెందుకు, మన రాష్ట్రం లోనే ఒక ముఖ్యమంత్రి దిన
పత్రికలలో వచ్చిన కార్టూన్లను చూసి అసెంబ్లీలోనే తన అసహనాన్ని
వెలిబుచ్చడం మనం అందరం చూశాము కదా!
పండిట్ నెహ్రూ పత్రికలు మన సమాజానికి కళ్ళూ,నోరు
అని అనే వారు. మహత్మా గాంధీ సంపాదకత్వంలో "యంగ్ ఇండియా",
"హరిజన్" పత్రికలను నడిపే వారు. "నేషనల్ హెరాల్డ్" పత్రికను
నెహ్రూజీ స్థాపించారు. తిలక్, లాలా లజ్పతి రాయ్ పత్రికలను
స్థాపించారు. ముట్నూరి కృష్ణారావు "కృష్ణాపత్రిక", విశ్వదాత
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు "ఆంధ్ర పత్రిక" నడిపారు.
ఆ నాటి "ఆంధ్రపత్రిక", ఆంధ్ర సచిత్రవార పత్రిక విశేషాలు, శ్రీ కాశీనాధుని
నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకోడానికి "ఆంధ్రపత్రిక" చరిత్ర
అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైద్రాబాదు వారు
పచురించారు. ప్రతి తెలుగు వారు తప్పక చదవవలసిన పుస్తకం.

Monday, 15 November 2010

కూరలకు కోరలొచ్చాయి !!


కన్నీళ్ళు తిరుగుతున్నాయి ; ఉల్లినే కాదు ఏ కూర తరిగినా!
జేబులో డబ్బులూ తరుగుతున్నాయి !!
వెజిట "బుల్స్" కు కొమ్ములొచ్చి జనాన్ని కుమ్ముతున్నాయి !!
ధరల కోరలు పెంచి నాన్ వెజులుగా మారి జనాల్ని కొరొక్కుతింటున్నాయి !!

వానల్లు కురవాల, వరి చేలు పండాల అని పాడుకొనేవారు. కానీ
ఇప్పుడు వానలు తెగ కురిసి వరిచేల్లు , కూరల మడులు తమతో బాటు
తమ రైతుల్నీ ముంచేశాయి. ఇక కూరలకు కోరలొచ్చి వండకుండానే,
(కొన్ని చోట్ల గాస్ కూ కొరత వుందని వాటికీ తెలిసింది కాబోలు) మండి
పోతున్నాయి. విస్తారంగా పంటలు కూరగాయలు పండే మా తూ.గో లోనే
ఇలా వుంటే మరి ఇతర చొట్ల ఎంత కూరగాయాలు చేస్తున్నాయో మరి!!

Sunday, 14 November 2010

బాలల దినోత్సవం ఈ రొజే!!


నవంబరు పద్నాలుగో తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది బాలల
పండుగ, జవహర్ లాల్ నెహ్రూ !! కాని బాలల కోసం అహర్నిసలూ
కృషి చేసినతెలుగు వ్యక్తులను మన తెలుగు వాళ్ళు ఎంతమంది గుర్తు
చేసుకుంటున్నారు. ఈ నాటి యువతరానికి, వాళ్ళ పిల్లలకు అలాటి
గొప్ప వ్యక్తుల గురించి చెప్పవలసిన భాధ్యత మనందరి పైనా వుంది.
వారే బాలన్నయ్య,బాలక్కయ్యలుగా ఆనాటి బాలల మనసు దోచుకొన్న
శ్రీ న్యాయపతి రాఘవరావు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి. మా చిన్న
తనంలో ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వాళ్ళం. ఆనాడు వచ్చే
పిల్లల కార్యక్రమం కోసం రేడియో ముందుఆతృతగా కూర్చొనేవాళ్ళం. చుట్టు
ప్రక్కల ఇళ్ళల్లోని పిల్లలూ ఠంచనుగా ఆ సమయానికి వచ్చేవారు. వాళ్ళకోసం
మా అమ్మగారు, చేగోడీలు, కారంపూసా రెడీగా వుంచేవారు ఇప్పటికీ పిల్లల
కార్యక్రమం ముందు వచ్చే ఆ పాట నా చెవుల్లో వినిపిస్తూనే వుంటుంది

రారె చిన్ని పిల్లలార
రారె చిట్టి తల్లులార
ఆటపాటలన్ని చేరి
ఆడికూడి పాడుదాం-ఆడుదాం
దాచుకోండి పుస్తకాలు
పాఠములిక చాలు చాలు
చేయి చేయి కలిపి-చెంగు
చెంగున పరుగెత్తుదాము.
ఈ క్షణం విన్నదే మర్చిపోతున్ననాకు దాదాపు అరవైఐదుఏళ్ళనాటి
పాట నాకింకా గుర్తుంది! 1940 లో బాలన్నయ్య,బాలక్కయ్యగార్లు
బాలానందం సంఘం స్థాపించి పిల్లల వినోద, వికాసాలకోసం ఎనలేని
కృషి చేసారు. 1945 లో "బాల" పేరిట తెలుగులో పిల్లలకు మొదటి
మాస పత్రికను ప్రారంభించారు. 1959 వరకు ఆ పత్రిక ప్రచురించ
బడింది. ఏప్రియల్ 2005 లో రచన శాయి గారు నాలుగు వాల్యూములుగా
బాల సంచికలను ప్రచురించారు మద్రాసు నుంచి హైద్రాబాదుకు మారాక
ఈ పుణ్యదంపతులు నారాయణగూడాలోని తమ ఇంటిని బాలానంద
సంఘానికి వ్రాసి ఇచ్చారు. పిల్లలు లేని ఆ దంపతులు భావితరంలోని
పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేసారు మన భాపు,రమణ
గార్ల రచనా వ్యాసంగం "బాల"తోనే మొదలయింది."కోతికొమ్మచ్చి"లో
రమణగారు ఇలా అన్నారు."బాలలోనే బాపు బొమ్మ, నా కధలూ,పద్యాలూ
అచ్చు అయ్యాయి. ఆయన మా ఇద్దర్నీ మౌంట్ రోడ్ లోని హిగిన్బాతమ్స్
బుక్ షాపుకు తీసుకెళ్ళి డ్రాయింగ్ పేపరూ,ఇండియన్ యింకూ,బ్రష్ లూ,
బొమ్మలున్నకధల పుస్తకాలు కొనిపెట్టేవారు" శ్రీ బాలన్నయ్య "అంతా ఒక్కటే
మనమంతా ఒక్కటే" అనే గీతాన్ని రచించారు.

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
తెలంగాణము రాయలసీమయు
కోస్తా ప్రాంతపు తెలుగు దేశము "అంతా"
ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి ఐనా గుజరాతైనా
పంజాబైనా బాంగ్లా ఐనా "అంతా"
భాషలు వేరైనాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్
జాతులు మతములు వేర్వేరైనా
నీతులు అన్నీ ఒకటేనోయ్ "అంతా"
దేశాలన్నీ ఒకటే ఐతే
ద్వేషాలేవీ ఉండవుగా
బాల ప్రపంచం భావి ప్రపంచం
భావి భారత వారసులం "అంతా"
ఈ గీతం ఈ నాటి బాలలకు స్ఫూర్తిదాయకం. బాలల పండుగ రోజున
బాలన్నయ్య,బాలక్కయ్యలకు బాలందరి తర్ఫున నివాళులు.

( శ్రీ బాపు గీసిన పై చిత్రం వాహిని బుక్ట్రస్ట్, హైద్రాబాదు వారి సౌజన్యంతో)

Saturday, 13 November 2010

గానరసలీల సుశీల


గాన కోకిల సుశీల
పాడేది వీణ పాటయినా
వాన పాటయినా! ఏదైనా
ఆమెకు అవలీల!!
ఆమె గానం సుగంధాల మరువం !
ఆ స్వరం కలకాలం మరువగలమా మనం!!
==========సురేఖ
శ్రీమతి పి.సుశీలమ్మకు 75 వ పుట్టిన రోజు
శుభాకాంక్షలు

Tuesday, 9 November 2010

పుస్తకాలయం

నాకు లాగానే మా మితృలు శ్రీ జోశ్యుల రామశర్మగారు
(జోరాశర్మ) పుస్తక ప్రియులు. కవితలూ వ్రాస్తారు. బియస్
యన్ ఎల్ లో ఉన్నత ఉద్యోగి. ఆయన పుస్తకాలమీద గల
అపారమైన ప్రేమాభిమానాలతో " మా ఇంటి పుస్తకాలయం"
పేరిట ఓ కవితను వ్రాశారు. నాకు నచ్చిన ఆ కవితను మీ
అందరి ముందు వుంచుతున్నాను.
<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>
మా ఇంటి పుస్తకాలయం
మా ఇంటి షోకేసు
బొమ్మల కొలువు కాదు
పుస్తకాలకు నెలవు,
పేరేడ్ గ్రౌండు____
ఆ అలమరా దగ్గర నడుస్తుంటే
సుశిక్షిత సైనికులు నిటారుగా నిలబడి
కవాతు చేస్తున్నట్లుంటుంది
ఒక కొనగోటి సైగకు
ఒక పుస్తక సైనికుడు ముందుకొచ్చి
నాకు సైనిక వందనం చేస్తాడు.
అనాఘ్రాత పుష్పంలా
అట్ట నలగని పుస్తకం అందంగా
కనిపిస్తుంది నాకు
కొత్త పుస్తకం దొరికితే
ఇవాళ కొత్త మితృడు మా యింటికొచ్చినట్లే!
ఆత్మీయతా సరాగాల
చిరు సంతకాలతో
కవిమిత్రులిచ్చిన పుస్తకాలు
పుస్తకం తెరవగానే సంతకం కింది తేదీనాటి
జ్ఞాపకాల్లోకి లాక్కెళతాయి
పుస్తకం మూసేసినా
ఆ పరిమళాలు వెంటాడుతుంటాయి!
నే కూడ బెట్టుకొన్న పుస్తకాల ఆస్తి
నే ఋణపడి కట్టుకొన్న ఇంటి కన్నా గొప్పది.
ఇంకా చెప్పాలంటే
నన్ను కొనుక్కున్న ఆలికన్నా గొప్పది___
నిజం చెబుతున్నాను
నేను చాలా పుస్తకాలు వాయిదాల పద్ధతిలొ కొనుక్కున్నాను
కనీసం వాయిదా పద్ధతిలో అయినా
చదవ లేక పోతున్నాను___
కొని చదవకుండా దాచుకొన్న పుస్తకాలు
నిజాం నవాబు కట్టుకొని ఉంచిన
అంత:పుర బురఖా స్త్రీల్లా కనిపిస్తాయి
అందుకే ఓ బెంగ నన్నెప్పుడూ
వెంటాడుతుంది
దానికి మా ఆవిడ తోడవుతుంది
"ఇవన్నీ ఇంకెప్పుడు చదువుతారు?"
అని ఓ తుపాకీ ప్రశ్న గురిపెడుతుంది
పుస్తకాల్ని విసుక్కుంటే
నా ప్రాణం విలవిల లాడుతుంది
అడ్డం వచ్చిన పుస్తకాలన్నీ
అటకెక్కించమంటే
మా ఆవిడే నాకుఅడ్డమని పిస్తుంది
పుస్తకానికి అమర్యాద జరిగితే
నే సహించలేను
"ఓసి అమాయకురాలా!
పుస్తకం
నీ పుస్తెల తాడంత పవిత్రమే!"
అని దెబ్బలాడాలనిపిస్తుంది___
ఇవ్వాళ టీవీ వచ్చి
పుస్తకానికి సవతై కూర్చుంది
నా షోకేసు పక్కన టీవీ
పవిత్రాలయం పక్కన
బార్ అండ్ రెస్టారెంట్ లా తగలడింది
దీని "ఠీవీ" మండ
ఇంటిల్లి పాదినీ
కంట్రోలు చేస్తుంది____
నా చేతికొచ్చిన సమీక్షా గ్రంధం
నా ఆశీస్సులు కోరే
దీర్ఘ సుమంగళి__
నేను పుస్తక ప్రియుల్ని ప్రేమిస్తాను
చిలకాగోరింకాల్లా మెలిగే భార్యాభర్తల్ని
"పెన్నూ పుస్తకంలా కలిసి పొండర్రా" అంటూ
ఓ మంచి పుస్తకం బహుకరిస్తాను.
వాళ్ళ ముందు గది
సద్గ్రంధాల జీవనది కావాలని
ఆశిర్వదిస్తాను_________ జోరాశర్మ
ఆ పుస్తకాల ముందు గది నాది. రోజూ పుస్తకాల
దుమ్మును దులుపుతూ, నా కెక్కడ డస్ట్ ఎలర్జీ
వస్తుందోనని జాగ్రత్త తీసుకొంటున్న మా శ్రీమతి
పద్మకు, ఈ కవితను నా బ్లాగులో
వుంచడానికి పెద్ద మనసుతో అంగీకరించిన మితృలు
జోరాశర్మ గారికి కృతజ్ఞతలు.

Sunday, 7 November 2010

ఎడా పెడార్ధాలమాటలు!!



కొన్ని మాటలకు ,అడిగే ప్రశ్నలకు అర్ధాలూ, పెడార్ధాలూ
వుంటుంటాయి. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఏ
షాపింగ్ మాల్లోనో కుటుంబ సమేతంగా అగుపించాడను
కోండి. వెంటనే మన నోటి నుంచి వచ్చే ప్రశ్న"కులాసాగా
వున్నారా?!" అనడుగుతాం.
కులాసాగా లేకపోతే అలా సంతోషంగా షాపింగ్కు పిల్లా పాపల్తో
రాడుకదా? ఇక సినిమాకు వెడితే ఇంటర్మిషన్ లో తెలిసిన
వ్యక్తి మనని చూడగానే "సినిమాకు వచ్చారా?" అని తప్పక
అడుగుతాడు. "కాదు, ఇంటర్వెల్ ల్లో టీలమ్ముకుందామని"
అని జవాబివ్వాలని మనసులో అనిపించినా,ఓ పిచ్చి నవ్వు
నవ్వి "ఆ, మీరూ సినిమాకు వచ్చారా?" తెలియకుండానే
అనేస్తాం! ఇక రైల్వే స్టేషన్లో కనిపించగానే "ఊరికేనా?" అని
అడిగితే "అవును, ఊరికే, కాని ఊరికే కాదు, డబ్బిచ్చి టిక్కెట్టు
కొనే" అని జవాబివ్వొచ్చు!
ఇక కొందరు సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తరచు
వాడే మాట "ఇక పోతే" "భలానా అప్పారావుగారు చాలాగొప్ప
వారు. వారు, ఇక పోతే, ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు.ఇక
పోతే....." ఇలా పోతే అలా సాగిపోతుంది.
కొన్ని మాటలకు అర్ధాలూ వేరుగా వుంటుంటాయి.
" మీ ఇంట్లో కూరేంచేశారు?" అనడిగితే ఓ కొంటెమ్మగారు "ఏం
చేస్తాం.బోల్డు డబ్బేట్టికొన్నవి.తిన్నాం" అని జవాబిస్తుంది!
"మీ కార్టూన్లేవైనా పడుతుంటాయా?" అని కార్టూనిస్టునడిగితే
" తిప్పి పంపినవి మా పోస్ట్మాన్ విసిరితే మా హల్లో పడుతుంటాయి"
అని జవాబుతో నవ్వించొచ్చు. అలాటి మాటలనుంచే కార్టూన్లకు
ఐడియాలు పుట్టుకొస్తుంటాయి. "మావారు రోజూ టయరయి పోయి
ఆఫీసు నుంచొస్తారు" అని నా శ్రీమతితో స్నేహితురాలు చెబుతుంటే
"టైరయి" పోయి రావడం మీద ఐడియా వచ్చి ఓ మనిషికి తల
బదులు కారు టయర్ వేసి కార్టూన్ గీస్తే అది చాలా ఏళ్ళ క్రితం
"స్వాతి"లో పడింది.కాదు కాదు అచ్చయింది. ఇంకొందరు ప్రతి మాట
ముందు "పాపం" అని వాడుతుంటారు. "పాపం వాళ్ళమ్మాయికి,
పెళ్ళి కుదిరింది, పాపం ఆవిడకు బాబు పుట్టాడు" ఇలాఅన్నమాట!
ఇంకొకరు ప్రతి విషయానికి "మీ దయవల్ల" అనటం అలవాటు.కాని
కొన్ని సందర్భాలలో ఆ మాట ఉపయోగించడం కొంచెం ఎబ్బెట్టుగా
ఇబ్బందిగా వుంటుంది. వాళ్ళకు మంచి ఉద్యోగమొచ్చినా,అబ్బాయి
పుట్టినా "అంతా మీ దయవల్ల" అంటుంటారు. మరొకరు మంచికీ
చెడుకీ "దిక్కుమాలిన" అనే మాటను వాళ్లకు అదేం దిక్కుమాలిన
అలవాటోగాని ప్రయోగిస్తుంటారు. "దిక్కుమాలిన సినిమాకు టిక్కెట్లు
దొరకవేమో అనుకున్నామా, దిక్కుమాలింది మా ఆవిడకు తెలిసిన
ఆవిడ టిక్కెట్లు ఇచ్చింది.దిక్కుమాలింది ,ఆ సినిమా బాగావుందండోయ్"
అంటారు. ఇలా ఎడా పెడార్ధాల మాటలు మాట్లాడే ఆడవారి,మొగవారి
మాటలకు అర్ధాలే వేరులే!!
.
.

Saturday, 6 November 2010





చూపులకు పొట్టివాడైనా కవితా రచనలో బహు గట్టివాడు
దాశరధి. చిన్ననాటే నిజాంపాలన నియంతృత్వంపై తిరుగు
బాటు చేసి విప్లవ సమరం చేసిన ధైర్యశాలి.తన జీవితాన్ని
కవితకే అంకితం చేసి కవిగానే 1987 నవంబరు 5 తేదీన
కీర్తిశేషుడైన దాశరధి పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్య.
ఆయన సంస్కృతం,తెలుగు,ఉర్దూ భాషలలో కవితారచన
చేయగల ప్రతిభాశాలి. ఆచార్య ఆత్రేయ సారధ్యంలో నిర్మించిన
"వాగ్దానం": చిత్రంతో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది.
"నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాలు గెలవ నీరా"
అనే పాటతో దాశరధి సినీకవిత మొదలయింది."ఏ దివిలో
విరిసిన పారిజాతమో,ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో",
"నడిరేయి ఏ జాములో" అంటూ ఏడుకొండలస్వామి పై వ్రాసిన
పాట మరువలేనివి.తెరపై కూడా శ్రీ దాశరధి "చదువుకున్న
అమ్మాయిలు,"శభాష్ పాపన్న" చిత్రాలలో అగిపించారు. ఆయన
కలం నుంచి వెలువడిన చిత్రగీతాలలో, "రాము" చిత్రంలోని
"రారా క్రిష్ణయ్యా రారా క్రిష్ణయ్యా,దీనుల కాపాడా రారాక్రిష్ణయ్యా",
"లేతమనసులు" చిత్రంలోని "అందాల ఓ చిలుకా అందుకో నా
లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాల నీ దాకా", "మూగ
నోము" లోని "నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే,పగలైనా
రేయైనా ఎడారిలో ఒకటేలే","మేనకోడలు" లోని "తిరుమల
మందిర సుందరా సుమధుర కరుణా సాగరా","ఒకేకుటుంబం"
లోని "మంచినిమరచీ వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడూ"
సినీసాహిత్యంలో చిరకాలం వాడిపోని అద్భుత కవితాకుసుమాలు
దాశరధి మిర్జాఅసదుల్లాఖాన్ గాలిబ్ ఉరుదూ గీతాలను
గాలిబ్ గీతాలు పేరిట అనువందించారు "గాలిబ్ గీతాలు" శ్రీ బాపు
రెఖాచిత్రాలతో పుస్తకరూపంలో వెలువడింది.
"ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతో దుష్కరము సుమ్ము"
అని అనువదించారు దాశరధి. ఈ ప్రపంచంలో చాలా సులభంగా
జరగవలసిన పని కూడా చాలా కష్టంమీద జరుగుతుంది.అలానే
మనిషి మనిషిగా మారటం కూడా చాల కష్టమే అన్న గాలిబ్
రచన సులువుగా అర్ధమయేటట్లు చెప్పారు దాశరధి. మరో చోట
ఆయన అంటారు. "అన్ని రోగములకు నౌషధం బుండియు ప్రణయ
రోగమునకు కనము మందు".ఇలా సాగిపోతుంది కవితాప్రవాహం.
తన గాలిబ్ గీతాలను అక్కినేనికి అంకితమిస్తూ ఆయన ఇలా
అంటారు...
"మైత్రి యనెడి దివ్య సూత్రమ్ము బంధించె
నిన్ను నన్ను, మిన్ను మన్ను వోలె.
తారకా పధాల దనరు నీ చేయూత
ధరణి పైని నాకు దొరుక జాలె......ఇలా వ్రాస్తూ

నీ గళాన సమర్పింప నిమ్ము నన్ను
మేలి గాలిబు గీతాల పూలమాల" అంటూ
ముగిస్తారు. ఎమెస్కో బుక్స్ ,విజయవాడ వారు ప్రచురించిన ఈ
పుస్తకంలో కవితతో బాటు బాపుగారి బొమ్మలు అలరిస్తాయి.

Friday, 5 November 2010



"చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ!
అందాల ప్రమిదల, ఆనందజ్యోతుల ఆశల వెలిగించు దీపాలవెల్లి"
ఆత్రేయ
ఈ చిరుదివ్వెల దీపావళి నవ్య వెలుగులు నింపాలని,
మనాసారా కోరుకుంటూ..
మీ
సురేఖ

Thursday, 4 November 2010

షడ్రుచులు-2







జ్యోతి గారికి పోటిగా నేను షడ్రుచులు వ్రాయటం మొదలెట్టాననినిమీరను
కుంటె మీరు ప(త)ప్పులోకాలేసినట్టే!.నాకు వండిన వంటలు ఆరగించడంలో
ప్రావీణ్యం వుందిగానీ తయారుచేయడంలో ఏ మాత్రం అనుభవంలేదు.
కానీ కూరలను తరగడంలో నేను చాలా నేర్పరిని. నా శ్రీమతికి కత్తిపీటతో
తప్ప చాకుతో తరగడం రాదు. కాని నాకు మాత్రం చాకుతో అన్ని
రకాల కూరలను తరగడమంటే చాలా ఇష్టం.అందుకే ప్రతి రోజుకూరలను
తరిగి వంటలో సాయం చేస్తాను. తరగందే కూరలు వండటం కుదరదు
కనుక, ఏ కూరైనా బాగుందంటే నేనే మూలకారకుణ్ణి అని అంటుంటాను.
నాకు వంటరాదు కాని చాలా మంది మగవాళ్ళు వంట చేయడంలో
అనుభవజ్ఞులే. అందుకే కదా "నలభీమ పాకం" అని అంటారు కాని,నిజంగా
రోజూ వంట వార్పూతో కష్టించే ఆడవాళ్ళ పేరుతో ఏ పాకం పేరుపొందలెదు!
బాపుగారికార్టూన్లలో చాలామంది మొగవాళ్ళు ఇంట్లో వంట చేసి నవ్విస్తుంటారు.
అప్పుడప్పుడూ ఇంట్లో మగవాళ్ళకు వంట చేయవలసివచ్చినప్పుడు వంట
చేశాము అని చెప్పకుండా ,ఈ రోజు చెయ్యికాల్చుకున్నాని చెబుతారు!
ఏమైనా ఈ రోజుల్లో వంట చాలా సులువైపోయింది. రోట్లో పచ్చల్లు, పప్పులు
రుబ్బవలసిన పనే లేదు. అన్నిటికీ మిక్సీలొచ్చాయి. రోట్లో రుబ్బిన కంది
పచ్చడి రుచి మిక్సీలో చేస్తే చస్తే రాదు. ఇప్పుడు కారం కూడా రెడీమేడ్ గా
దొరుకుతున్నది. పూర్వం ఆవకాయల కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో
రోకళ్ళ చప్పుళ్ళు వినిపించేవి. రెండు రోకళ్ళు ఒక దాని తరువాత ఒకటి
తగలకుండా రొట్లో పైకి క్రిందికీ రైథమ్ గా కదులుతుంటే మాకది వింతగా
తోచేది. కారం కోరొస్తున్నా అక్కడే కూర్చొని చూసేవాళ్ళం. ఆ కాలంలో
వంటలు వండటం కూడా భారీగా వుండేది. ఫెళ్ళిళ్లకు, మరేకార్యానికైనా
గాడిపొయ్యి త్రవ్వేవాళ్ళు. ఒకే సారి నాలుగైదు పెద్ద గుండిగలు పెట్టి
వంటలు చేసేవారు.ఇంటి పెరట్లో ఖాళీ స్థలం వుండేది కనుక మట్టిని
తవ్వి గాడిపొయ్యి ఏర్పాటుచేయడానికి వీలుండేది. వంటశాల
భలే సందడిగా వుండేది. ఇప్పుడేమో కాటరింగ్ వచ్చేసింది. ఎవరెవరో
ఎక్కడెక్కడొ చేసి తీసుకువస్తున్నారు. పచ్చని అరటి ఆకులు బదులు,
మెరుపు కాగితాలు అతికించిన అట్ట కంచాలొచ్చాయి.హాయిగా బంతిలో
కూర్చొని విందు చేయడం కాకుండా కంచాలు పట్టుకొని క్యూలో నిలబడి
జైళ్ళల్లో ఖైదీల్లా వేయించుకోవడం.! రాబోయే కాలం లో పొట్లాలు కట్టి
వరద భాధితులకు పంచినట్లు పంచినా ఆశ్చర్యపడనవసరం లెదు.
ఇకతిండి మీద జోకులూ ,సామెతలూ,ప్రభోదాలు మన తెలుగులో
చాలా వున్నాయి...
* తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు
* కూటికోసమే కోటి విద్యలు
* అప్పుచేసి పప్పు కూడు
* ఇంగువ కట్టిన గుడ్డ
*అన్నం చొరవే గాని అక్షరం చొరవలేదు
*అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది; ఏమీలేని విస్తరి
ఎగిరెగిరి పడుతుంది
*అన్నమైతేనేమిరా? సున్నమైతే నేమిరా ? ఈ పాడు పొట్టకు
అన్నమే వేతామురా
*పప్పుచారు అడుగుది - పరమాన్నం పైపైది రుచి..ఇలా ఎన్నో
గురజాడ అప్పారావు గారన్నారు,"తిండిగలిగితె కండగలదోయ్"
ఇంగ్లీష్ లోకూడా ఓ మంచి మాట ఉంది;
EAT TO LIVE BUT NOT LIVE TO EAT.
తిండికీ మరో అర్ధం మన వాళ్ళు చెప్పారు. లంచాలు బొక్కేవాళ్ళను
"వాడు చాలా తినమరిగాడు" అని!
ముక్తాయింపుగా ముళ్లపూడి వారి జోకులు!నవ్వితే నవ్వండి!
(మాకభ్యంతరం లేదు)
*చిరాగ్గా వున్న భర్తని పరాగ్గా వున్న భార్య పిలిచి
"ఈపూట అరటికాయొండనా,వంకాయొండనా?" అంది.
" నా తలకాయ వండు."
" ఆవపెట్టి వండనా? వేయించమంటారా?"
>>>>>>>>>>>>>>>>>>>>>
* సుబ్బారావుగారు పకపక నవ్వి"ఏమయ్యా,ఇదెప్పట్నించి?
నీ కంచం నువ్వే కడుక్కోడం?"అన్నాడు.
"అబ్బే ఎన్నడూ లేదు!" అన్నాడు చక్రవర్తి.
"ఆ, ఇందాక నా కళ్లతో నేను చూస్తినే"
"పిచ్చివాడా, అది నాది కాదోయ్, మా ఆవిడ తిన్న కంచం"
అన్నాడు చక్రవర్తి విరగబడి నవ్వుతూ.
<<<<<<<<<<<<<<<<<<<<<<<
కూరల చిట్కా: (కొనే టప్పుడు,వండే టప్పుడు కాదు):ఈ సారి మాల్ లో కూరలు
తీసుకొనేటప్పుడు, ప్లాస్టిక్ కవరును చేతికి గ్లవ్ లాగ తొడుక్కొని పచ్చి మిరప
లాంటివి గుప్పిడిలో తీసుకొని తిరిగి కవరును రివర్స్ చేస్తే అవన్నీ కవరులోకి
చేరతాయి! మీ చేతికి మట్టంటకుండాఓ పనై పోతుంది,బాబూ!!
ఇక్కడ నవ్విస్తున్న కార్టూన్లు ఇంకెవ్వరివి? మిమ్మల్ని నవ్వించి
కవ్వించే శ్రీ బాపు గారి "బాపు కార్టూన్లు ,సంపుటి ఒకటి లోనివి!
మా బాపుగారికి కృతజ్ఞలతో... ..


  • Blogger news

  • Blogroll

  • About