"మిధునం" కద చదివిన అశేష పాఠకులకు ఆ కధతో బాటు కలకాలం
గుర్తుండిపోయే రచయిత శ్రీరమణ. ఒకసారి బాపుగారి బొమ్మల
పుస్తకం అవిష్కరణోత్సవంలో ప్రముఖ రచయిత, సినీ హాస్య నటులు
రావి కొండలరావుగారు సరదాగా శ్రీరమణగారి గురించి ఇలా అన్నారు,
"అతనెవరూ, శ్రీరమణా...ఆ(...శ్రీరమణ అతని చమత్కారం ఒకటి !
సైలెన్స్ ! తన పేరు ముందు ఎవడైనా శ్రీ పెడతాడో పెట్టడో అని ముందే
తగిలించేసుకున్నాడు.’శ్రీరమణ’అని". శ్రీ రమణగారి రచనలన్నీ నాకు
శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారిని గుర్తు చేస్తుంటాయి, ఆయన ఆంధ్ర
జ్యొతి దినపత్రికలో 1977-80 మధ్య వ్రాసిన వివిధ విషయాలపై వ్రాసిన
రచనలు "రంగులరాట్నం" పేరిట నవోదయపబ్లికేషన్స్ వారు జనవరి
1990లో మొదటిసారి ప్రచురించారు. అందులోని ప్రతి రచనా అట్టమీద
వ్రాసినట్లు చమత్కారాలూ , మిరియాలూ, అల్లం బెల్లం మురబ్బాలే !
ఐ.వెంకట్రావు గారి సారధ్యంలో వెలువడిన "పత్రిక"-మన మాసపత్రికలో
గౌరవసంపాదకులుగా పని చేసిన కాలం లో ఆయన వ్రాసిన హాస్య
వ్యంగ్య వ్యాసాలను "గుత్తొంకాయ కూర-మానవ సంబంధాలు" పేరిట
మౌనికా బుక్స్ వారు ప్రచురించారు ఇందులో శ్రీరమణ గుత్తోంకాయ
రుచిని మొదట చూపించి చివరకు ప్రజాసేవతో మనల్ని కవ్వించి
నవ్వించి ఆలోచింపజేస్తారు
ఇక "మిధునం" అనే కధ చదివని తెలుగు వారుంటారని నేనుకోను.
ఇంకా ఈ కధని చదవని తెలుగువాళ్ళెవరైనా వుంటే దయచేసి
ఒకసారి కొని చదవండి. మీరే పదిసార్లు తనివితీరా చదువుతారు
శ్రీరమణ అంటారు." చాలా రోజులుగా మనసులో మెదుల్తున్న కధ
రాశాను. మనసు కొంచెం తేలిక పడింది" . శ్రీరమణ బాపు గారికి
ముళ్ళపూడి వెంకటరమణగారికిఈ కదను ఇచ్చి అభిప్రాయం చెప్ప
మంటే తెల్లారి ఉదయం బాపు గారు ఏమీ మాట్లాడకుండా ఆయన
శ్రీరమణ చేతిలో కవరొకటి పెట్టారట. కవరు తీసి చూసిన శ్రీరమణ
28 పేజీలతో బాపుగారి దస్తూరితో "మిధునం’ కధ ! ,ఆశ్చర్యంగా
"ఏమిటిది సార్"అని అంటే బాపు గారి పద్ధతిలో "ఒకసారి వ్రాస్తే బాగా
అర్ధమవుతుందని వ్రాశాను" అన్నారట ! ఈ కధకు అలా శ్రీ బాపు
దస్తూరీ తిలకం దిద్దారు. ఆమాటే పుస్తకం కవరు మీద మనకు
అగుపిస్తుంది. మచ్చుకి మొదటి పేజీ ని చూడండి! రచన శాయిగారు
వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా ఈ అందమైనకధను అందంగా పాఠకులకు
అందించారు. రూ.40/ ఈ పుస్తకం పదికాపీలు తెప్పించుకొంటే
రూ.300/-కే మీ ఇంటికి వస్తాయి. మితృలకు కానుకగా ఇవ్వండి.
ఈ కధను లాగే మిమ్మల్నీ కలకాలం గుర్తుంచుకుంటారు. వాళ్ళూ
తమ మితృలకు ఇవ్వటానికి మళ్ళీ మళ్ళీ కొంటారు.
శ్రీరమణ నా సురేఖార్టూన్స్ బుక్ లో ముళ్లఫూడి వెంకట రమణగారి
ముందు మాట చూసి నాకు వ్రాసిన ఉత్తరంలో ఇలా అన్నారు........
" 1975 లో బాపు రమణలు విజయవాడలో మా ఆఫీసుకి (ఆంధ్రజ్యోతి)
వచ్చారు. నండూరి రామమోహనరావుగారు స్వయాన రమణగారి బావ
గారు. వీళ్ళు ముగ్గురు( బాపు రమణ నండూరి) మద్రాసు ఆంధ్రపత్రిక
రోజుల్లో మంచి మితృలు. నండూరి తనకోసమే అనుకున్నారు. తీరా
వచ్చాక సరాసరి నా టేబుల్ దగ్గరకు వచ్చారు. "నా కార్టూన్లు మొదటి
సారిగా పుస్తకరూపంలో వస్తున్నాయి.మీరు ముందు మాట రాస్తే
సంతోషిస్తా.మిమ్మల్ని కలిసి request చేద్దామని వచ్చాం" అన్నారు
బాపు. "తప్పకుండా.."అన్నాను. ఏ మాత్రం మొహమాటం పడకుండా.
ఎప్పటిలోగా ఇవ్వాలి అన్నాను ఆదుర్దా పడుతూ"." కంగారేమీ లేదు.
Take your own time" అన్నారు బాపు నవ్వుతూ. నాకప్పుడు 23,
24 ఏళ్ళుంటాయి. నిజానికి అలా అనకూడదుకదా.అవతల నండూరి
పురాణంలాంటి హేమా హేమీలుండగా నేను అడిగిందే తడావుగా
తలూపడం! "నా నృషిహిం : కురితే కార్టూన్" అని పేరు పెట్టి పీఠిక
వ్రాశాను. బాపు రమణ చాలా సంతోషించారు."నేనైతే యింత బాగా
వ్రాయలేను" అంటూ నండూరి నాకు ధూపం వేశారు. జీవితంలో నేను
సాధించిన గొప్ప అవార్డుగా దీన్ని నేను యిప్పటికీ భావిస్తాను."
శ్రీరమణ గారు ఇలా నాకు ఈ అమూల్యమైన ఉత్తరం వ్రాయటానికి
నా కార్టూన్ పుస్తకానికి ముందుమాట వ్రాసిన ముళ్లపూడి వారే !
నేను మరో సారి ఈ కొత్త సంవత్సరంలో అదృష్టవంతునయ్యాను.
శ్రీరమణ బాపు గారి కార్టూన్ పుస్తకం ముందుమాట లో ఇలా
మొదలెడతారు. "నాచేతిలో అధికారం లేదుగాని, వుంటే కరెన్సీ
నోట్ల మీద బాపుగారి కార్టూన్లు అచ్చు వేయించి వుందును. పడి
పోతున్న ఇండియన్ కరెన్సీ విలువ పెంచడానికి యిదొక చక్కని
చిట్కా అని మనస్పూర్తిగా అనుకుంటున్నాను. దీని వల్ల సమకూరే
అదనపు సౌకర్యాలు బాపు కార్టున్లలాగ చాలా వున్నాయి ఇన్కమ్
టక్సును కలవారు నవ్వేస్తూ చెల్లించే అవకాశం వుంది. డాక్టర్లకు
లాయర్లకు నవ్వుల్లో పెట్టి ఫీజు యిచ్చుకుంటారు పేషెంట్లు,పార్టీలు.
.
బాగుందండీ మిధునం పైన మీ అభిప్రాయాలు...దీనిని గురించి చదివిన తరువాత వెంటనే చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా పుస్తకం అందనంత దూరంలో ఉండిపోవటం వల్ల దొరకలేదు...త్వరలో చదివే భాగ్యం ప్రసాదిస్తున్నది ఓ స్నేహం...
ReplyDeleteసరిగ్గా పది రోజుల క్రితం కారా మాష్టారు
ReplyDelete"ఓ పది మిధునం కాపీలను నీ దగ్గర
ఉంచు నాన్నా ఎవరికైనా ఇవ్వటానికి
పనికొస్తుంది" అని అనటం ఈ పోస్ట్
ద్వారా మీరిలా అనటం యాదృశ్చికం
ఈ బ్లాగుని ఇప్పుడే చూస్తున్నా ! ఎం.వి.అప్పారావు గారు ఫేస్ బుక్ లో "లింక్ అడ్రస్" ఇచ్చారు. "చందమామ శంకర్ గారి " రామాయణ చిత్ర కావ్యం గురించి చెప్తూ...
ReplyDeleteఇంకా విశిదంగా చూడాలి. " చాలా బాగుంది " అని చెప్పటానికి "ఒక్క మెతుకు పట్టుకుంటే " సరిపోదూ.....మరీ బడాయి గాని...
దేవులపల్లి శ్రీనివాస మూర్తి: రామవరప్పాడు (పో): విజయవాడ