మా "హాసం క్లబ్" వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి శుభాకాంక్షలు
ఓ హాసం క్లబ్బూ !
పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి
నవ్వులు గుబాళించే హహహహ ! హమామ్ సబ్బూ !
ను - వ్వొస్తానంటే
న - వ్విస్తానంటే
నేనొద్దాంటానా !
ఆకూవక్కా సున్నంలాగే
జోకూ నేనూ నువ్వూ కలిస్తే
నవ్వుల తాంబూలం !
అది నే వద్దంటానా ?
కాని - ఐతే- నువ్వు మాత్రం హాయిగా నవ్వక పోయావో
భకరా ( అను భమిడిపాటి కామేశ్వరరావు గారు )
పబ్లిగ్గా పగలబడి నవ్వినంతొట్టు
ఆంధ్రుల్లో ఐకమత్యం కాలరెత్తుకున్నంత ఒట్టు
గిరీశం మధుర వాణికి తాళి కట్టినంత ఒట్టు
గంగా కావేరి నదులు
కాశీ రామేస్రాల్లో సరిగంగా స్తానాలు చేసినంత ఒట్టు
శివుడి తలమీద గంగ కూర్చుందని
గౌరి కంటనీరు పెడితే
శివ శివా! గంగ నా శిరసున కాదే !
నీ కళ్లలోనే తిరుగుతోందే చూస్కో
అని శివుడు నవ్వించి నవ్వినంత ఒట్టు
హాసం క్లబ్ ! హాపీబర్త్ డే ! !
---శ్రీ ముళ్లపూడి వెంకట రమణ (చెన్నై)
శ్రీ రమణ గారు నాపై ఎంతో ప్రేమతో , నే కోరిన వెంటనే మా "హాసం క్లబ్" ను
ఆశీర్వదిస్తూ వ్రాసి పంపారు. మీతో ఆ నవ్వుల దీవెనలను పంచుకోవాలనిపించింది.
అన్నట్టు ఈ రోజు నా పుట్టిన రోజు ( మే 28 ) సరిగ్గా ఓ నెల రోజుల తరువాత జూన్
28 న ముళ్లపూడి మా రాజమండ్రి ,ఆల్కాట్ గార్దెన్స్ లోని లూధరన్ హాస్పటల్లో
నవ్వుతూ, నవ్విస్తూ పుట్టారు !! అన్నట్టు మరచే పోయా. ఈ రోజుతో 70 లోకి
అడుగు పెడుతున్న నాకు మతిమరపు సహజమేగా ! ఈ రోజు మహానటుడు ,నటరత్న
యంటీఆర్ జయంతి.. తెలుగువాళ్ళ ఉనికిని దేశానికి చాటిన ఆ మహవ్యక్తి కి తెలుగు
జనాలందరి తరఫున జోహార్లు.