RSS
Facebook
Twitter

Tuesday, 1 February 2011


గిన్నెస్ బుక్కు పైకెక్కిన మన బ్రహ్మానందంగారి పుట్టిన రోజు ఈ వేళ!
ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2003లో " హాసం"
సంగీత హాస్యపత్రికలో " ప్రముఖాముఖి " పేరిట ప్రముఖ హాస్య నటులు
ఆయనతో చేసిన ముఖాముఖిని "హాసం" సౌజన్యంతో మీకోసం, క్లుప్తంగా. .
<><><><><><><><><><><><>
ఎల్బీ శ్రీరాం :మొన్నా మధ్య ఓ షూటింగులో ఎనభైఏళ్ళ పెద్దాయన "నువ్వు
తెనాలి రామలింగడి వంటివాడవయ్యా" అని అభినందించినప్పుడు మీ అనుభవం
ఏమిటి?
జవాబు: ఎం.ఏ. తెలుగు లిటరేచర్ చదివి లెక్చరర్ గా పనిచేసిన నాకు ఆ మాట
వినగానే గుండెల్లో చక్కిలిగిలి పెట్టినట్టినిపించింది.
ఎమ్.ఎస్.నారాయణ: ఉదయంనుండి రాత్రి వరకు ఎప్పుడు చూసినా మీరు ఏవో
జోకులు వేస్తూ సూక్తులు చెబుతూ, అందర్నీ అలరిస్తూ నాన్ స్టాప్ గా గొంతుకి
విశ్రాంతి లేకుండా మాట్లాడుతూనే వుంటారు.ఇన్నేళ్ళ నా పరిశీలనలో ఒక్క
రోజు కూడా మీకు వాయిస్ ట్రబులిచ్చిందనిగాని, డబ్బింగ్ మీ కారణంగా
పోస్ట్పోన్ అయిందని గానీ నేను వినలేదు. ఈ విజయ రహస్యం ఏమిటి?
జవాబు: ఇది నన్నిడిగితే నేనేం చెప్తాను? గొంతు నాది కానీ, ట్రబులివ్వడం
ఇవ్వకపోవడం నా చేతిలో ఏం వుంది? నన్ను ఏ డాక్టరు దగ్గరకైనా తీసుకెళ్ళి
టెస్ట్ చేయిస్తే ఆయనైనా ఏమైనా చేస్తాడేమో!? సరదాగా..మనలో మాటగా
చెప్పుకోవాలంటే నాకు గొంతెమ్మ కోరికలేవీ లేవుగా...అంచేతైవుండొచ్చు.
భరణి: మళ్ళీ జన్మలో పక్షిగా పుట్టాల్సి వస్తే ఏ పక్షిగా పుడదామనుకుంటున్నారు?
ఎందుకు?
జవాబు: ఏ పక్షైనా గూడు కట్టుకొనే స్వభావం వుంటుంది.జన హృదయంలో శాంతికి
నిర్వచనంగా శాశ్వతమైన గూడును కట్టుకున్న పావురాయి జన్మంటే నాకిష్టం.
(మనలో మన మాట...అక్కుపక్షి, దిక్కుమాలిన పక్షి, శకున పక్షి లాంటి జన్మలు
అసలొద్దు బాబోయ్ )
ఏ.వి.యస్: తెలుగులో వున్నంత మంది కమేడియన్స్ ఇంకెక్కడా లేరంటారు.
ఇది అడ్వాంటేజా? డిస్ అడ్వాంటేజా?
జవాబు : తెలుగు,హిందీ,తమిళం,మలయాళం అనే కాకుండా అన్ని భాషల్లోనూ
ఎంత ఎక్కువమంది కమెడియన్స్ వుంటే అంత మంచిది. దాని రిజల్టు కూడా
అంత బావుంటుంది. ఎవరికి తోచిన రీతిలో వారు నవ్విస్తారు. టోటల్ గా ప్రేక్షకులంతా
నవ్వుతారు. ప్రేక్షకులంతా నవ్వుతూ వుండాలనే ఏ కమెడియనైనా సరే కోరుకోవాలి.
కనుక ఎక్కువమంది ఉండటం అడ్వాంటేజే !
ఆలీ : లైఫ్ లో ఎదురయ్యే అప్స్ అండ్ డౌన్స్ తట్టుకుంటూ ఇంత బాలన్స్ ఆఫ్
మైండ్ తో ఉండటం మీకెలా వచ్చింది?
జవాబు: లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్...జీవితాన్ని జీవిస్తూ "ఈ అప్స్ అండ్ డౌన్స్"
ఏంటి అని అనుకుంటే ఎలా ?! అంచేత సుఖమైనా కష్టమైనా ఒకేలా స్వీకరించగల
సాధనను మనసుకి అలవాటు చేయ్యాలి. ఆ అలవాటు బాలన్స్ ఆఫ్ మైండ్ రావటానికి
తోడ్పడుతుంది. " లైఫ్ ని ఈజీగా తీసుకుంటేనే ఇంత డిఫికల్ట్ గాఉందే...సీరియస్ గా
తీసుకుంటే ఇంకెంత దారుణంగా వుంటుందో " అని దర్శకులు రాఘవేంద్రరావు గారు
ఓసారన్నారు. ఆ మాటల్లో ఎంత డెప్త్ ఉంది !? ఇవన్నీ మెంటల్ బాలెన్స్ రావటానికి
ఉపయోగపడతాయి.
కోట : బ్రహ్మయ్యా !
నీకు నిండు నూరేళ్ళయ్యా...
హాస్యానికే బాసికం కట్టేశావయ్యా !
ఇలాగే కంటిన్యూ అయిపో అయ్యా....
గాడ్ బ్లెస్యూ అయ్యా....
మరి నా గురించేంటయ్యా...
కొంచెం చెప్పయ్యా....
జవాబు: కోటయ్యా...
నీది ఎవరూ అనుసరించలేని రూటయ్యా
నీకు నువ్వే సూటయ్యా
అందుకే నువ్వెప్పుడూ గ్రేటయ్యా..
oOooOooOo

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About