RSS
Facebook
Twitter

Thursday, 24 February 2011

కోటి అందాల కోనసీమ



కోనసీమ అందాలను ఎన్నో తెలుగు సినిమాలలో ఆదుర్తి, బాపు, విశ్వనాధ్
మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఓ వైపున సముద్రకెరటాల సవ్వడి,
మూడు వైపుల గోదావరి పాయల గలగలలు, మధ్యన ఆకుపచ్చచీర కట్టినట్లు
చూడచక్కని పంట పొలాలు, ఇరువైపుల బారులు తీరిన కొబ్బరి చెట్లు, ఆహా
ఇంతటి అందాల పకృతిలో జీవించడమంటే అదో చెప్పలేని మధురానుభూతి.
పకృతి అందాలే కాదు ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు, ప్రశిద్ధదేవాలయాలలకు
కొనసీమకు కొదువలేదు.మూడు ప్రక్కల గోదావరి పాయలతో త్రిభుజాకారంలో
కోనసీమ దీవి వుంది. ఇందులో నగరందీవి, ఐ. పోలవరం మండలం దీవి అనే
రెండు దీవులు ఉన్నాయి. కాలక్రమాన గోదావరీ పాయలపై వంతెనలు వచ్చి
రహదారులుగా కోనసీమ దీవులంతా ఒకటిగా మారాయి. వశిష్థ, వైనతేయ,
గౌతమీ నదుల పాయలు కోనసీమలో ప్రవహిస్తున్నాయి. మూడు నదుల
సంగమమైన పవిత్ర జలధారలతో కోనసీమ సస్యశ్యామలమయింది. ఇక
అపారమైన కొబ్బరితోటలకు కొదవే లేదు. కొబ్బరి ఆకుల మధ్య నుండి తన
కిరణాలను పచ్చని చేలపై కురిపిస్తున్న ఆ సూర్యభగవానుని అందాలను
మీరు ఎన్నో సినిమాలలో చూసే వుంటారు. కాలువల వెంబడి చేసే పడవ
ప్రయాణం ఊహించుకొంటేనే ఎంతో మనోహరంగా వుంటుంది. 50 కిలోమీటర్లు
పైగా విస్తరించిన సముద్రతీరం కోనసీమలో పర్యాటకులను విశేషంగా అలరిస్తుంది.
కేశనపల్లి,అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం ( ఇక్కడ స్టేట్ బ్యాంకులో
బ్రాంచి మేనేజరుగా పనిచేసే సదవకాశం నాకు కలిగింది) గ్రామాల్లో సముద్ర
తీరాలు చూడచక్కగా వుంటాయి. వైనతీయనది పై పి.గన్నవరంలో నిర్మించిన
అక్విడెక్టు, వృద్ధగౌతమి మీద ఎదుర్లంక వద్ద నిర్మించిన బాలయోగి ( ఈయన
పార్లమెంట్ స్పీకరుగా పనిచేశారు) వారధి , ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ
దిండి-చించినాడ వద్ద వశిష్ఠ నదిపై నిర్మించిన వంతెనలు ఆ నదీపాయలకు
అమరిన అందాల వడ్డాణాల లాగ వుంటాయి. ఓఎన్జీసీ కోనసీమలో పెద్ద ఎత్తున
చమురు నిక్షేపాల కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. "రవ్వ" చమురు క్షేత్రం
ముంబాయి హై తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగివుంది. కోనసీమలో
అచ్చమైన గ్రామ వాతావరణం అగుపిస్తుంది. వేదపండితులెందరో ఈ నేలను
పావనం చేశారు. అంతర్వేదిలో నున్న లక్ష్మీనర్శింహస్వామి దేవాలయం ఎంతో
ప్రశిద్ధి చెందింది. అంతర్వేది అనగానే బాపు రమణల గార్ల "ముత్యాలముగ్గు"
సినిమాలోని రావు గోపాలరావు డైలాగు " అల్లుడుగారిది అంతర్వేది కాదు,
అమెరికా!" గుర్తోంచ్చిందికదూ! అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, అయినవల్లి
లోని శ్రి సిద్ధివినాయక ఆలయం రాష్ట్రవ్యాప్త ప్రాచూర్యాన్ని పొందాయి. ఆత్రేయపుర
మండలం ర్యాలిలో వేంవేసివున్న జగన్మోహినీ కేశవస్వామి ఆలయం లోని జగన్మోహిని
విగ్రహ శిల్ప సౌందర్యం చూసితీరవలసిందే!

2 comments:

  1. హెల్లో , విశ్వనాధ్ గారి మూవీస్ స్వాతిముత్యం లో కనపడే దేవాలయం ఎక్కడిది? కోనసీమ అని తెలుసు...కాని ఎక్కడో తెలియదు..మీకు తెలిస్తే చెప్పరూ ప్లీజ్ ..పట్టిసీమా? గోదావరి మధ్య లో వుంటుంది దేవాలయం.

    ReplyDelete
  2. మా కోనసీమను కళ్ల ముందుంచారు. ధన్యవాదాలు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About