RSS
Facebook
Twitter

Thursday, 24 February 2011

నేనంటే మీకెంత ప్రేమండి ?!




గతనెల జనవరి 26 న ఆయన పెళ్ళిరోజుకు శుభాకాంక్షలు పంపితే
వెంటనే ఫొను చేసి ఆయన అన్న మాట " నేనంటే మీకెంత ప్రేమండి"
అదే ఆయన దగ్గరనుంచి వచ్చే ఆఖరి ఫోనని నేననుకోలేదు. బాపురమణ
లంటె కవలలుకాని కవలలు. ఏ పని చేసినా ఇద్దరూ చేయవలసినదే.
ఓ పెర్సనల్ పని పై రాజమండ్రి వచ్చి మేం ఫలానాచోట వున్నాం అంటూ
ఆప్యాయతగా ఫోను చేసేవారు. ఈ ఉదయాన్నే బి.విజయవర్ధన్ గారి
మెయిల్ చూడగానే పెద్దగా ఏడ్చేశాను. భగవంతుడు ఇలా ఎందుకు
చేశాడా అనిపించింది. ఈ రోజు నేను కోటిఅందాల కోనసీమ గురించి
నా బ్లాగులో వ్రాస్తూ అంతర్వేది అన్న మాట రాగానే ముత్యాలముగ్గులో
కాంట్రాక్టరుకు ఆయన వ్రాసిన డైలాగు గుర్తువచ్చింది.
ఆయన ఇంటికి వెళ్ళితే ఆయన చూపే ఆప్యాయత ఎలా మర్చిపోగలను.
నాకు కానుకగా ఇచ్చే ఏ పుస్తకాన్నైనా బాపుగారు సంతకంచేసి, రమణ
గారిని సంతకం చేయమనేవారు. మొదటిసారి బాపురమణ గార్లను కలసి
నప్పుడు ఆయన సాహితీసర్వస్వం పుస్తకం పై సంతకం చేసి, క్రింద
బాపు సంతకంకూడా ఆయనే చేసి బ్రాకెట్లో ఆధరైజ్డు ఫోర్జరీ అని వ్రాసారు.
తరువాత ఆ పుస్తకాన్ని పోగొట్టుకున్నాను. ఆ విషయం ఆయనకు చెబితే
వెంటనే కోరియర్లో సంతకంచేసి మరోటి పంపిచారు. ఫోను చేయగానే ఆయనే
ముందు నమస్కారమండీ అంటు పలకరిస్తుంటే చాలా ఇబ్బందికరంగా
వుండేది.
.నా కార్టూన్ పుస్తకానికి ముందుమాట వ్రాయమని కోరగానే వ్రాసి పంపి.,
అది అంత తృప్తిగా లేదంటూ మరోటి వ్రాసి పంపిన రమణగారి మంచి మనసును
నాలాటి సామాన్యుడు ఎలా వర్ణించగలడు. భాపుగారికి ఆ శ్రీరాముడు ఈ విషాదాన్ని
తట్టుకొనే శక్తినిచ్చి మాలాటి అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ, రమణగారి
కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను
అవును రమణ గారూ, మేమంటే మీకెంత ప్రేమండీ ? !
.అశృధారలతో, మీ అభిమాన అభిమాని అప్పారావు ( మీరు సృష్టించిన పాత్ర పేరు
కూడా అప్పారావే అవడం నే చేసుకొన్న అదృష్టం!) రమణగారు ఇక మన మధ్యలేరు
అన్నమాటను వ్రాయలేక ఈ రచన మొదలు పెట్టినప్పుడు నా చేతులు వ్రాయలేక
పోయాయి. ఆయన రచనలు చదివినప్పుడు ప్రతిసారి, నవ్వితేనవ్వండిలోని జోకులు
గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మన చెంతనే వుంటారు.

1 comment:

  1. ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
    ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
    కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
    విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

    http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post_24.html

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About