ఆమాయకరావు వాస్తు శాస్త్ర ప్రవీణ జంబుకశాస్త్రి ఇంటికి వచ్చి
"నమస్కారం, జాతకరత్న, వాస్తుబ్రహ్మ జంబుక శాస్త్రి గారూ"అని
పలకరించగానే, " రండి, రండి అంటూ ఆహ్వానించాడు జంబుక
శాస్త్రి.
"గురువు గారు, నిన్న మీరు మా ఇల్లు పావనం చేసి మా ఇంటికి
వాస్తు దోషాలేమైనా వున్నాయేమోనని చూశారుగా. కొంపదీసి
మార్పు లేమైనా చేయాలని చెప్పరు కదా" అని భయం భయంగా
అడిగాడు. " అదేమిటి అమాయకరావు గారు, కొంపదీసి అంటారేం?
వాస్తు అంటేనే కొంపలు తీయటం ! మీ ఇంటికి మార్పు అవసరం
లేదు. ఆ వీధిలోనే , అక్కడే , అదే చోట , అవే పేర్లతో గదులుంటాయి."
చెప్పాడు జంబుక శాస్త్రి. అమాయకరావు ముఖారవిందం ఆనందంతో
ఇంతయింది. " బ్రతికించారు, ఇంకేం చెబుతారోనని మా భార్యాభర్తలిద్దరం
తెల్లవార్లూ నిద్దర పోకుండా రామ్ గోపాలవర్మ హర్రర్ సినిమా చూసి
వచ్చినట్లు హడలి భయపడిపోయాము" అన్నాడు.
అలా అనగానే జంబుకశాస్త్రి , "మీరేం పడకండి. పడవల్సింది మీ ఇంటి
గోడలే ! మార్చాల్సింది ఇంటి పునాదులే !! ఇంతసేపు సంతోషపడ్డ
అమాయకరావు " గదులు మార్చనవసరం లేదని ఈ కధ ప్రారంభంలో
శెలవిచ్చారు, మళ్ళీ ఇక్కడకు వచ్చేటప్పటికి పునాదులంటున్నారు"
అన్నాడు భయంగా. అందుకు జంబుకశాస్త్రి " ఏవిటీ, పెడర్ధాలు తీస్తున్నావు.
గదులు మార్చక్కరలేదని మరోసారి చెబుతున్నాను.ఎలాగంటే, వంట ఇల్లు,
పదగ్గది,బాతు రూము కొంగ గదీ ,అదేనయ్యా స్నానాల గదీ , హాలూ వాటి
పేర్లు మారవు. అవే పేర్లతో ఇప్పుడున్న చోట కాకుండా మరో వైపుకు
మారతాయన్నమాట. ఒకే చోట వుంటే పాపం వాటికి మాత్రం బోరు కొట్టదూ !"
అన్నాడు ఈనాటి సినిమాల్లో హాస్యంలా జోకేసానని గర్వంగా.. " బాబోయ్,
నిజంగా మీరు నా కొంప ముంచారు. కొంపతీసి మళ్లి కట్టడానికి నా దగ్గర అంత
డబ్బు లేదు." అన్నాడు అమాయకరావు. " డబ్బు లేదా? ఎలా వుంటుంది ?
మీ కొంపకు వాస్తు దోషముంటే ! ఆకస్మిక ధనలాభం కలిగే సులభ మార్గం
నే చెబుతా గదా " అని జంబుకశాస్త్రి అనగానే " ఏం చేయా"లని ఆతృతగా
అడిగాడు అమాయకరావు. " చాలా సులువయ్యా, సింపుల్ గా నెలకు ఓ
ఐదు వేలు ఓ 24 నెలలు సింపుల్ ఇన్స్టాల్ మెంట్స్ లో నాకందజేశావనుకో,
నేను నెలనెలా స్పెషల్ పూజ చేసిన చక్రం ఇస్తా ! దాంతో ఆకస్మిక ధన లాభం
తప్పక కలుగుతుంది. నిజం.నువ్వు నా మాట నమ్మాలి" అన్నాడు జంబుకం.
ఎందుకో అమాయకరావుకు మాయలు తొలగటం మొదలయింది. "ఆకస్మిక
ధన లాభం నాకేమోగాని, మీకు మాత్రం తప్పక కలౌగుతుంది, ఇది కూడా
నిజం" జవాబిచ్చాడు అమాయకరావు.
"ఛూశావా, ఇంకా మొదటి వాయిదా కట్టకుండానే, పూజ మొదలు పెట్టకుండానే
వాస్తు దోషం తగ్గుతూ నీ రోజులు దగ్గరపడ్డాయి. తెలివి వచ్చేస్తున్నది" అన్నాడు
జంబుకశాస్త్రి. " అలానేనండి, ఈ లోగా నాగురించి, నా భార్య గురించి
కొంచెం చెబుతారా? అంటూ అడిగాడు అమాయకరావు. వెంటనే జంబుకశాస్త్రి
దానికేం భాగ్యం ! నేను ఇప్పుడు చెప్పే జోస్యం వల్ల నీకు నా మీద ,వాస్తు మీద
పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. "నీ భార్య ఇప్పుడు సుమంగళి. నువ్వు బ్రతికున్నంత
వరకూ ఆమె మాంగాళ్యానికి ఢోకాలేదు" అంటూ వెకిలి నవ్వు నవ్వాడు.
వివేకరావుకు ఆ ఇంటీ గుమ్మం దిగగానే పూర్తి జ్ణాణోదయమయి, వివేకరావుగా
మారి తన పాత ఇంట్లోనే హాయిగా పిల్లా జెల్లాటొ ఉంటున్నాడు.
( ప్రతి నెలా మూడో ఆదివారం జరిగే మా "హాసం క్లబ్ " కోసం నే వ్రాసిన స్కిట్ కు
కధారూపం .).
0 comments:
Post a Comment