RSS
Facebook
Twitter

Tuesday, 31 August 2010



ప్రాసానంద మహర్షి ఆరుద్ర
ఆంధ్రుల అభిమాన రచయిత ఆరుద్ర !
ఆయన కూనలమ్మపదాలు అభిమానులపై వేశాయి చెరగని ముద్ర !
ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు
అలరించాయి పాఠకుల హృదయ సామ్రాజ్యాలు !!
భాగవతుల శివ శంకర శాస్త్రి అనే ఆరుద్ర 1925 ఆగష్టు 31 వ తేదీన
విశాఖపట్టణంలో జన్మించారు. కవితలే కాదు, అపరాధ పరిశోధన కధలు
నవలలు, రాముడికి సీత ఏమవుతుంది లాటి విమర్శనా గ్రంధాలు వ్రాసారు.
ఆయన కలం నుంచి జాలువారిన కూనలమ్మ పదాలు, అమెరికా ఇంటింటి
పజ్యాలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. విజయవాడలో బాపు,
రమణ, నండూరి రామ్మోహనరావు, రావి కొండలరావు, లతో కలసి "జ్యోతి"
మాస పత్రికకు సారధ్యం వహిస్తూ ఆయన కూనలమ్మపదాలు వ్రాసారు.
కూనలమ్మ పదాలు '64లో పుస్తకరూపంలో వెలువడినప్పుడు శ్రీ ముళ్లపూడి
కి పెళ్ళి కానుకగా అందించారు.
తాగుచుండే బుడ్డి
తరగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మా
******
మితృడు బాపుని,
" కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మా" అంటూ పలకిరించారు.
ఇక ఆయన వ్రాసిన అమెరికా ఇంటింటి పజ్యాలలో అమెరికాలో వున్నా
తెలుగు వాళ్ళకు ఐకమత్యం వుండదని చెబుతూ ఇలా వ్రాసారు !
అట్టేకాలం నిలిచేది కాదు ఆంధ్రులలో ఐకమత్యం
ఇట్టే ఋజువు చేయవచ్చునంటారు ఇందులో సత్యం
ఇద్దరు తెలుగువాళ్ళున్నచోట మూడు సంఘాలు
విడివిడిగా ఉండాలి వాళ్ళవాళ్ళ రంగాలు
ఒకటి సాగుతూ ఉంటే సవ్యంగా
ఇంకోటి పుట్టుకు రావాలి నవ్యంగా
అధికస్య అధికం ఫలం
అందరూ ఎక్కొచ్చు అందలం
ఆయన వ్రాసిన మంచి సినిమా పాటల్లో ఎన్నని చెప్పగలం?
ఉయ్యాల జంపాల చిత్రం లోని ఈ పాట సాహిత్యం చూడండి.

కొండగాలి తిరిగింది గుండె వూసు లాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది "
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది "
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది "
పడుచు దనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవసాగి పోయింది "
ప్రేమికుల గుండెల లోతులను తెలిసిన వారు శ్రీ ఆరుద్ర.. ఆత్మగౌరవం
సినిమాలో "ప్రేమించి పెళ్ళి చేసుకో-నీ మనసంతా హాయి నింపుకో"
అనే పాటతో ప్రేమ వివాహాలను ప్రోత్సహించారు ఇలా ఎన్నేన్నో!
ఆరుద్ర సహిత్యలోకంలో చిరంజీవి. ఈనాడు అయన 85వ జయంతి!
* * * * * * *
ఆరుద్రా
శక్తి సముద్రా!
చైతన్యానికి వ్రాలుముద్రా!
సాహిత్య ఋషి
నీ కలం పేరు కృషి
నీ బలం పేరు కుషి
జోహార్
వ్యాసానందా
వాక్యాక్షర శబ్ద భావ-వి-న్యాసానందా
ప్రాసానందా
అంత్య ప్రాసాంతకానందా
జోహార్...........శ్రీ బాపు రమణ

Monday, 30 August 2010

లటుకు-చిటుకు


లటుకు - చిటుకు

ఇంతకీ ఎవరీ లటుకు, చిటుకులు ? 1945 లో
న్యాపతి రాఘవరావు గారు, న్యాపతి కామేశ్వరి
గారు పిల్లల కోసం " బాల " అనే పత్రికను ప్రారం
భించారు. అంటే చందమామ కన్నా రెండేళ్ళు
ముందన్న మాట ! ఆ దంపతులిద్దరికీ పిల్లలంటె
అమిత ప్రేమ. ఆలిండియా మద్రాసు కేంద్రం నుంచి
బాలానందం అనే పిల్లల ప్రోగ్రాము నిర్వహించే
వారు. పిల్లందరికీ ఆ ఇద్దరూ రేడియో అన్నయ్య
అక్కయ్యగా ప్రీతిపాతృలయ్యారు. ఆది వారం
మధ్యాహ్నం అయిందంటే పిల్లలమందరం రేడియో
ముందు చేరేవాళ్ళం. పొట్టిబావ-చిట్టిమరదలు,
మొద్దబ్బాయి మొదలైన కార్యక్రమాలు ఎంతో
అలరించేవి. "బాల" పత్రికలో మొట్టమొదటి సారిగా
బాపు, ముళ్ళపూడి చిన్నారి చిత్రకారుడిగా,రచయితగా
పరిచయమయ్యారు. చందమామ ముఖచిత్రాలను
వేసిన వడ్డాది పాపయ్య గారు కూడా " బాల"కు
ముఖచిత్రాలు, శీర్షికలకు బొమ్మలూ వేశారు. ఇక్కడ
మీరు చూస్తున్న లటుకు-చిటుకు శీర్షికకు బొమ్మ
వడ్డాది గీసినదే ! ఆ శీర్షికలో నెలనెలా పాఠకులు
ఆ పాత్రలకు నవ్వుల సంభాషణలు వ్రాసే వారు.
1951 మే సంచికలో పడిన లటుకు-చిటుకుల
కబుర్లు ఇలా వుంటాయి.

లటుకు : ఒరేయ్, నాకు రూపాయి దొరికిందిరా !
చిటుకు : అలాగా ! నాదొక రూపాయి ఎక్కడో పోయిందిరా !
బహుశ : నీకు దొరికినది నా రూపాయే గాబోలు !
లటుకు : నీ రూపాయే అని రుజువు ఏమిటి ? ఎలాగుంటుందొ
చెప్పు .
చిటుకు : తెల్లగా, గుండ్రంగా, ఒక వైపు అక్షరాలు, ఒక వైపు
బొమ్మ-చాలా గట్టి రూపాయి ! అసలు సిసలురూపాయి!
లటుకు : అయితే నాకు దొరికినది నీది కాదు.నాకు రెండు
అర్ధరూపాయలు దొరికాయి తెలుసా ?
చిటుకు : అదే ! అదే ! నా రూపాయే ! జేబులో నుంచి కింద
పడి రెండు ముక్కలయిపోయి వుంటుంది !
---K.V.సుగుణ నీలరావు ( కాళహస్తి )
ఇలా ఆనాటి "బాల"లో ఎన్నెన్నో పాటలు, బొమ్మలు,కధలు
వుండేవి. 1945 నుంచి 1959 భాల ప్రచురించబడిన వరకు
నాలుగు వాల్యూములుగా అప్పటి "బాల" ఎలా వుండేదొ అలానే
వాహిని బుక్ ట్రస్ట్,1.9.286/3, విద్యానగర్, హైద్రాబాద్-500044
ప్రచురించారు. పిల్లలున్న ప్రతి తెలుగింటిలో ఈ పుస్తకం తప్పక
వుండాలి. చిన్నారి బాపు ఆ నాటి బాలలో వేసిన కార్టూన్ కూడా
మీరిక్కడ చూడొచ్చు.!

Sunday, 29 August 2010

ఉయ్యార్ టెల్గూస్ !!



ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం!
తెలుగు భాషను వ్రాయాలన్నా, మాట్లాడాలన్నా
చాలామంది తెలుగు వాళ్ళకి నామోషీ!. మారుతున్న
కాలంతో బాటు మన పిల్లలకు ఇంగ్లీషు చదువు
నేర్పాల్సిందే ! అందుకు తప్పులేదు. కాని కనీసం
పిల్లలు ఇంటికి వచ్చాకనైనా వాళ్లకి తెలుగులో
మాట్లాడటం, వ్రాయడం నేర్పాలి. అమ్మను, నాన్నను
అలానే పిలవడం నేర్పించాలి. పిల్లలకు తెలుగు కధలను
చెప్పాలి. కధలంటే హారీపోటర్స్ కధలే అనుకొనే
ఆలోచనకు అమ్మా,నాన్న స్వస్తి చెప్పాలి. ఈసప్
కధల వంటి మంచి కధలు మనకు పంచతంత్రం
కధల ద్వారా ఏనాడొ అందాయి. "బాల" లాంటి ఆనాటి
పిల్లల పత్రికలో మన పిల్లలకు పనికి వచ్చే ఎన్నో
ఆటలు, పాటలు వేశారు.ఆ నాటి "బాల" పత్రికల
సంపుటాలు ఈనాడూ వాహినీ బుక్ ట్రస్టు ద్వారా
దొరికే అవకాశం వుంది కనుక పిల్లలకు కొని
చదివే అలవాటును చేయండి. అప్పుడే, వ్యవహారిక
భాషగా వున్న తె నిజమైన నివాళి !
:**************************
తెలుగు భాషంటే ఎందుకో కొందరికి చులకన !
తెలుగువాడంటే తెలుగోడికే పలుచన !
కష్టమనుకొనే తెనుగుకు సులువు పదాలు నేర్పారు గిడుగు !!
ఇక మమ్మీలకు దూరమై తెలుగు అమ్మ వైపు వేద్దాం అడుగు !!
* సురేఖ *
బాపుగారి కార్టూను స్వాతి సౌజన్యంతో

Saturday, 28 August 2010

భలే భలే వెన్నముద్దలు !

జనార్దన మహర్షి గారి వెన్నముద్దలు రుచి చూశారా?
ఈ వెన్నముద్దలు పుస్తకం చదువుతుంటే ఆ నాటి
చిన్నికృష్ణుడు వెన్నముద్దలంటె ఇందుకే అంత ఇష్ట
పడ్డాడేమో అనిపిస్తుంది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ
ఓ ఆణి ముత్యమే. పుస్తకం తెరవగానే ఏ ఒక్క పేజీ
చదవకుండానే జనార్దన మహర్షి గారి ఆలోచనకు
అభిరుచికికి అభినందించకుండా వుండలేము.
. ప్రతి పేజీ పైన కుడి వైపున వివిధ రచయితలను
ఫొటోలను వుంచారు. ఇక మొదటి పేజీ నుంచి చివరి
పేజీ వరకు వదలకుండా చదివిస్తుంది. మచ్చుకు కొన్ని,
మధురాతిమధురమైన
వెన్నముద్దలు రుచి చూడండి.
మా అమ్మ
మా ఆవిడ
నా రెండుకళ్ళు
........
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు.
- - - - -
అతను ప్రతిదీ
వెంట్రుక ముక్కలా
తీసి పారేస్తాడు.
.........
చిన్నతనంలోనే
బట్టతల వచ్చింది
- - - - -
ప్రేయసిగా ఉన్నప్పుడు
గంట గడపటానికి గగనమయ్యేది
పెళ్ళాం అయ్యాక
గంట భరించడం భారంగా వుంది.
- - - -
ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట.
పక్కింటోడు
ఎదిగిపోయాడట.
-- - - -
చదివారుగా, ఇవి సాంపిలు మాత్రమే.ఇలాఎన్నెన్నో
ప్రతి పేజీలోనూ మిమ్మల్ని అలరిస్తాయి.ఆలోచింప
చేస్తాయి!
ఎమెస్కో బుక్స్ విజయవాడ వారి దగ్గర ఈ పుస్తకం
దొరుకుతుంది.దొరకడం అంటె ఇంత మంచి పుస్తకం
ఎవ్వరూ పారేసుకోరు కాబట్టి కనుక్కుని కొనుక్కోవాలన్న
మాట !!


Friday, 27 August 2010


1963లో జ్యోతి బుక్స్ వారు విడుదల చేసిన "రసికజన మనోభిరామము"
అను N2O లో ముళ్లపూడి బృందం వారు జ్యోతి మాసపత్రికలో పాఠకులతో
నవ్వులాటలు ఆడుకున్న మంచి జ్యోకులను ఏర్చి కూర్చారు. ఆ కాలం లో
మన ఆంధ్ర ప్రదేశ్ ఇంత మంది(దు) బాబులను తయారు చేయలేదు కాబట్టి
" మద్య ప్రదేశ్ " శీర్షిక పేరిట కొన్ని మందు జోకులను ' పంచా' రు.వాటిల్లో
కొన్ని పుచ్చుకొనండి.
మద్యప్రదేశ్ రాజధానిలో ఇద్దరు తాగుబోతులు తూలుకుంటూ వస్తు
న్నారు. రోడ్డు ప్రక్కన వెలుగుతున్న మెర్కురీలైటుని చూసి అది
చంద్రుడని ఒకడు, కాదు సూర్యుడని మరొకడు వాదులాడుకొంటు
న్నారు. ఇంతలో ఆ దారిని ఒక పెద్దమనిషి రావటం చూసి " మీరు
చెప్పండి సార్, అది చందురుడా, సూరీడా ?" అని అడిగారు.
" నాకూ తెలవదయ్యా, నే నీవూరికి కొత్తగా వచ్చాను" అని
అతగాడు తూలుకుంటూ వెళ్ళి పోయాడు.
* * * * * * * * *
మందు వల్ల ఇంటా బయటా కష్టాలెక్కువయ్యాయి. ఆ కష్టాలు మరచి పోడానికి
ప్రభుత్వం బారులుగా బారులు ఏర్పరిచింది. మా రాజమండ్రి లో ఓ ఫాక్టరీ
ఎదురుగా అమృతం పంచే భవనాన్ని ఏర్పరిచింది. డబ్బుకు ఇబ్బంది లేకుండా
ఎదురుగా ఏటియం కూడా వుండేటట్లు సదుపాయం కలిగించింది. ఇన్ని మంచి
పనులు చేసినా అదేమిటో ఈ జనాలకు తృప్తి లేదు. ఓ పార్టీ వాళ్ళైతే గమ్మత్తుగా
తిడతారు. మళ్ళీ వీళ్ళే ఆ ప్రభుత్వం పడిపోకుండా మేము చూస్తామంటారు.
జనాలకు ఇంత కంటే గ "మ్మత్తు " ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.
ఘనత వహించిన ప్రభుత్వం వారు " రండి , సారా మనసారా తాగండి"
అంటారు. ఈ అధిక ధరలు, రేపులూ, కిడ్నాపులు, దోపి " డీలు " అన్నీ
మర్చిపోవాలంటే జనాలకి మందే దారి. కొత్తలో గొంతు మండినా ,మండి పోయే
ధరల ముందు అన్నీ మరపుకొస్తాయి ! మరో మంచి( దు) జోకు, ఇదీ రమణ
గారిదే !
తలలో పేలుపడితే అవి పోవడానికి అద్భుతమైన మార్గం కనిపెట్టాడొకాయన.
ఆయన చెప్పినది :
" ఏం లేదు సార్, మంచి విస్కీగాని, బ్రాందీ గాని ఓ పురిషెడు తీసుకొని
నెత్తికి రాసుకోవాలి. ఆ పైన ఓ గుప్పెడు గండ్ర ఇసుక జుట్టు నిండా
జల్లు కోవాలి. ఓ గంటయే సరికి తలలోని పేలు మద్యం తాగి కైపెక్కి
అందుబాటులో వున్న రాళ్ళతో ( ఇసుక రేణువులతో ) ఒక దాన్నొకటి
కొట్టూకొని చస్తాయి."
ఎలా వున్నాయి ఈ ముళ్లపూడి వారి గ మ్మత్తులు
చివరిగా, స్వామీ జిన్మయానంద , క బీరు దాసుతో ఇలా అన్నారు,
" పత్యానికి బీరకాయ, మద్యానికి బీరుకాయ !"

Thursday, 26 August 2010


మరో ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ దార్. ఆయన 1960 లో
కార్టూనింగ్ మొదలుపెట్టి STATESMAN పత్రికలో సైలెంట్
కార్టూనులు గీయడం ప్రారంభించారు. అంతకుముందు AIR
లో బ్రాడ్కాస్టర్గానూ, అటుతరువాత AIR INDIA సంస్ఠలో
SALES PROMOTION శాఖలోనూ పనిచేశారు. 1967లో
HINDUSTAN TIMES పత్రికలో "THIS IS IT " పేరిట
పాకెట్ కార్టూనులు దాదాపు రెండు దశాబ్దాలపాటు వేసారు.
అటుతరువాత POINEER పత్రికలో ఏడు సంవత్సరాలు
పని చేసి తరువాత DELHI TIMES లో చేరారు. సుధీర్ దార్
కార్టూనులు అంతర్జాతీయ పత్రికలైన NEWYORK TIMES,
the WASHINGTON POST, SATURDAY REVIEW లలో
ప్రచురించ బడ్డాయి.
శ్రీ సుధీర్ దార్ ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచు
కున్నారు.1970 లో లండన్ లో జరిగిన అంతర్జాతీయ కార్టూనిస్టుల
సమావేశంలో పాల్గొన్నారు. ఆయన గీసిన ఒరిజినల్ కార్టూనులు
ఎలిజబెత్ రాణి, రిచర్డ్ అటెన్బరో,హెన్రీ కిసింగర్ లాంటి ప్రముఖుల
వద్ద వున్నాయంటే ఆయన ఎంతటి కళాకారుడొ అర్ధమవుతుంది.
సుధీర్ దార్ కార్టున్లు The Best of Sudhir Dar, Out Of My
Mind, This Is It, Out of My Mind Again, The Best Of
This Is It పేరిట పెంగ్విన్ బుక్స్ ప్రచురించారు.

Wednesday, 25 August 2010

అధిరోహిణి అను నిచ్చెన కధ !



మనం పైకి ,అదేనండి ఎత్తైన చోట్లకు వెళ్ళాలంటె ఒక్కొక్క మెట్టు
ఎక్కుతూ పైకి వెళ్ళాలి. చదువైనా , ఉద్యోగమయినా ఒక్కొ మెట్టు
అందుకుంటూ ఉన్నత స్థానాలకు చేరవలసివుంటుంది .మామూలుగా
ఎత్తుకు తీసుకు వెళ్ళే సాధనంనిచ్చెనే.పాత రోజుల్లో ప్రతి ఇంట్లో ఓ
నిచ్చెన తప్పక వుండెది. పాత సామాను, బామ్మలు మడిగా పెట్టే
ఆవకాయ జాడీలు , పెద్ద బోషాణాలు అటక మీదే వుండేవి. వాటిని
తీసుకోవడానికి ఓ నిచ్చెన అవసరం కనుక ఆ రోజుల్లో నిచ్చెన ఓ
నెచ్చెలిలా నిత్యావసర వస్తువయింది. మరో గమ్మత్తైన విషయం,
అటక అంటె గుర్తొచ్చింది. ఇంగ్లీష్ లో ATTIC అంటే అటక అనే
అర్ధం. ఈ రెండు భాషలకు సామీప్యం భలే గా వుంటుంది కదండీ !
గోడలకు సున్నాలు వేయాలన్నా నిచ్చెనే ఆధారం. ఇప్పుడు కూడా
ఇళ్ళల్లో అటకలు వున్నా చాలా అందంగా ఫాషన్గా వుంటున్నాయి.
వాటిని అందుకోడానికి ఫాష నబుల్ ఫోల్డింగ్ స్టెప్ లాడర్లు వచ్చాయి.
ఫుర్వం కాలంలో కూడా మన పౌరాణికాల్లో శశిరేఖను మేడమీద
నుంచి రహస్యంగా క్రిందికి దింపడానికి అభిమన్యుడు బాణాలతో
నిచ్చెన కట్టడం మీరు మాయాబజారులో చూశారుగా ! షిర్దీ సాయి
బాబా సచ్చరిత్రలో కూడా బాబా ఓ నిచ్చెన తెప్పించి ఒక ఇంటి మీద
ఎక్కి మరో ఇంటి పై నుంచి క్రిందికి దిగిన లీల కూడా మీరు చదివే
వుంటారు. అలా నిచ్చెన కు ప్రతి సంధర్భంలోనూ ప్రాముఖ్యత వుంటూ
వస్తున్నది. ఇందాకే మా హాసం మితృడు హనుమంతరావు మాటల
సంధర్భంలో చెప్పారు. నిచ్చెన , ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు ఒకటె
అని. ఎలా అంటే నిచ్చెన పాపం అక్కడే వుండి మనని పైకి తీసుకొని
వెల్తుంది. మాస్టారు కూడా మనని ఒకటో క్లాసునుంచి రెండో క్లాసుకి
చేర్చి ఆయన మాత్రం ఒకటో క్లాసులోనే ఉంటాడట. నిచ్చెనలపై
కార్టూనులు కూడా చాలానే వచ్చాయి. శ్రి బాపు నిచ్చెన మీద చాలా
మంచి కార్టూనులు వేశారు. నేను BLITZ NEWS WEEKLY లో
WORD PLAY శీర్షిక లో నిచ్చెన పై 1977 , MAY 7th సంచికలో
కార్టూన్ వేశాను. ఈ బొమ్మలో LADDER అనె ఇంగ్లీష్ అక్షరాలు
అగుపిస్తాయి. 1983 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో కూడా ఓ కార్టూన్
నిచ్చెనపై , అదేనండి "నిచ్చెన" సబ్జెక్ట్ పైన వేశాను. ఇప్పటికీ సినీమా
పోస్టర్లను అంటించే ( అశ్లీల పోస్ట్ర్లను మహిళా సంఘాలు కూడా మరోలా
అంటిస్తారనుకోండి) కుర్రాళ్ళు సైకిల్ మీద పొడవైన నిచ్చెనను పెట్టుకొని
బయలుదేరుతారు. మా చిన్నప్పుడు ఇలా రాత్రిపూట పోస్ట్ర్లను అంటించడం
ప్రారంభీచగానే అక్కయ్య చెవులకు జిగురు గమ్ము బకెట్ చప్పుడు ఎలా
విన్బడేదో నన్ను నిద్ర లేపేసేది. మేడ మీద నుంచి చూచే వాళ్ళం ఏ దో
వింతగా. నిచ్చెన ఆటల్లో కూడా కనిపిస్తుంది. వైకుంఠపాళీ లో పాములూ
నిచ్చెనలూ వుంటాయి. ఆ ఆటనే SNAKES & LADDERS అని
అంటారు. మన పాత కాలం సినిమాల్లో నిచ్చెన స్టంట్ సీన్లలో ముఖ్యపాత్ర
వహించిన విషయం కొందరికైనా గుర్తుండే వుంటుంది. విలన్ మెడకు
నిచ్చెన ఓ చివర వుంచి హీరో స్టంట్ చేయడం అదో వెరైటీ ! ఇక కరెంట్
స్ధంబాలపై ఎక్కి రెపరు చేయడానికి కూడా నిచ్చెనే. పెద్ద ఊర్లలో ఆ నిచ్చెనలు
అమర్చిన వెహికల్స్ వుంటాయి. అంటె మన నిచ్చెనకు కూడా వాహన
యోగం కలిగిందన్న మాట !!

Tuesday, 24 August 2010



రాజకీయనేతగా మారిన కార్టూనిస్ట్ ,బాల్ ధాకరే

నా దగ్గర చాల మంది ప్రముఖ కార్టూనిస్టుల కార్టూన్ పుస్తకాలు
ఉన్నాయి. కాని శివసేన నేత బాల్ ధాకరే కార్టూను పుస్తకం లేదు.
chitrachalanam.blogspot.com విజయవర్ధన్ గారు ఆ పుస్తకం
నా కలెక్షన్లలొ లేదని తెలిసి నాకు కానుకగా పంపించారు. శ్రి విజయ
వర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజెస్తున్నాను. Laughter Lines
అనే 210 పేజీల ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు శ్రీ యం.వీ.
కామత్ వాఖ్యానం వ్రాసారు. ఈ పుస్తకంలో శ్రీ ఆర్కే లక్ష్మణ్ గారి
కార్టూన్లతో బాటు 1946 లో FREE PRESS JOURNAL లొ
కార్టూనిస్ట్ గా పనిచేసిన శ్రీ బాల్ ధాకరే గారి కార్టూన్లు కూడా వున్నాయి.
ఆర్కే లక్ష్మణ్ , బాల్ ధాకరేలు కార్టూనిస్టులుగా ఆ పత్రికలో పని చేసిన
సమయంలొ శ్రి యమ్వీ కామత్ రిపోర్టర్ గా పనిచేసారట. అందరూ ఆ చివర
నుంచి ఈ చివరకు వుండే పెద్ద హాల్లొ ఆ ఇద్దరు కార్టూనిస్టుల సీట్లు హాలుకు
ఆ చివరగా వుండటం వల్ల కామత్ గారికి వాళ్లని కలసే అవకాశం వుండేదే
కాదట. శ్రి ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్ గా తన జీవితాన్ని ఈ నాటి వరకు
గడుపుతుంటే , ధాకరే మాత్రం శివసేన నేతగా ఎదిగిపోయారు. ఇక్కడ
మీరు బాల్ ధాకరే గీసిన ఓ కార్టూన్ ,
, The Cartoon Craft of R K Laxman & Bal Thackeray,
పుస్తకం చిత్రాన్ని చూస్తారు.

Monday, 23 August 2010

మరొ మంచి పుస్తకం :: జరుక్ శాస్త్రి పేరడీలు

జరుక్ శాస్త్రి అనే జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి గారు చాలా
కలం పేర్లు పెట్టుకున్నారు. వాటిలో కొన్ని తమాషాగా అని
పిస్తాయి. జయంతి కుమారస్వామి, వెల్లటూరి సోమనాధం,
చలికాలం మార్తాండరావు, ఇలాటివన్నమాట ! శ్రీ రుక్మిణీ
నాధశాస్త్రి గారు 1914 సెప్టెంబరు 7న జన్మించారు. 1968
జూలై 20వ తేదీన పరమందించారు. ఈ పుస్తకంలో శ్రీ శ్రీ
మొదలైన వారి రచనలకు అందమైన పేరడీలే కాకుండా
ఆయన కలం నుండి వెలువడిన కవితలు కూడా చోటు చేసు
కున్నాయి. శ్రీ బాపు గీసిన ముఖచిత్రంతో బాటు లోపల బాపు
మార్కు బొమ్మలు అలరిస్తాయి. మచ్చుకు కొన్ని పారడీలను
పరికించండి.
సరదా పాట శిర్షికలొ
మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయి పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారాకిల్లీ
సామానోయ్ సరదా పాటకు.
ఇక "విశిష్టాద్వైతం" పేరుతో మరో పేరడీ

ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం

C,a, t - కేటువి నీవై
R, a , t -రేటుని నేనై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై......ఇలా సాగిపోతుంది.

ఈ పుస్తకంలోని జరుక్ శాస్త్రిగారి పారడీలను,కవితలను
ఆస్వాదించాలంటే నవోదయా పబ్లిషర్సు, విజయవాడ
వారు ( శ్రీ ముళ్లపూడి వారు లోగడ ఈ ప్రచురణ సంస్థ పేరును
"నవ్వోదయ" అని చమత్కరించారు ) ప్రచురించిన పుస్తకాన్ని
నేడే సంపాదించు " కొనండి "

Sunday, 22 August 2010

అంతర్వేది ఆలయం


" అల్లుడు గారిది అంతర్వేది కాదు, అమెరికా ! " ఈ డయలాగు
మీకు గుర్తుందా ? కాంట్రాక్టర్ పాత్రలో రావు గోపాలరావుతో
శ్రీ ముళ్లపూడి పలికించిన ,శ్రీ బాపూ గారి "ముత్యాలముగ్గు"
సినిమాలోనిదని మీరీపాటికి గుర్తించే వుంటారు. అసలు ఈ
అంతర్వేది ఎక్కడ వుంది , ఆ కధా కమామిషు ఈ రోజు
చెప్పుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అంతర్వేది
దేవాలయ గోపురం.
తూర్పుగోదావరీ మండలంలోని ఆలయాలలో అంతర్వేది
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాచీనమైనది. ఈ క్షేత్రానికి
దక్షిణకాశి అనే ప్రశస్తి వుంది. అంతర్వేది నరసాపురానికి 10
కిలోమీటర్ల దూరంలో, గోదావరి ఏడు పాయల్లో ఒకటైన వసిష్ట
గోదావరీ తీరంలో వుంది. వషిస్టుని కోరికపై విష్ణువు రక్తవిలో
చనుని సంహరించిన ప్రదేశమే అంతర్వేది అంటారు. అంతేకాక
నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపి అంతర్వేదిలో పడవేశాడని
అంటారు "వేది" అంటే యజ్ఞాదులు చేసేందుకు ఏర్పరచిన
చతురస్రమైన తిన్నె. అంతర్వేది అంటే లోపలివైపుగా ఏర్పరిచిన
యజ్ఞవేది అని అర్ధం. నీలకంఠేశ్వరుడు క్షేత్రపాలకుడిగా కృత
యుగంలో ఇక్కడ బ్రహ్మ 100 సంవత్సరాలు రుద్రయాగం చేసి
నీలకంఠేశ్వరస్వామి ప్రతిష్ట చేశాడట.బ్రహ్మ చేత యజ్ఞశాలగా
ఉపయోగించబడింది కనుక ఈ ప్రదేశానికి అంతర్వేదిగా పేరు
సార్ధకమైంది.శ్రీ రామచంద్రుడు రావణ సంహారం తరువాత ఈ
స్థలానికే వచ్చి శివ పూజ ఛేశాడని అంటారు. లక్ష్మీనరసింహ
కళ్యాణం మాఘశుద్ధ దశమినాడు జరుగుతుంది. ఇక్కడ
నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి ముఖ్యమైన ఉత్సవాలు.
ఇక్కడి ఆలయంలో చీకటి అలముకొన్నప్పటికీ సాయం
సూర్య కిరణాలు నృసింహస్వామి వక్ష స్థలంపై ప్రసరిస్తాయట.
మాఘశుద్ధ దశమి వెళ్ళిన మరునాడు, అనగా ఏకాదశినాడు
రధోత్సవం జరుగుతుంది. ఈ క్షేత్రం లో పకృతి దృశ్యాలు
కమనీయం గా వుంటాయి.

Saturday, 21 August 2010

రికార్డులకు మళ్ళీ మంచి రోజులొస్తున్నాయ్

గత వారం ముంబాయి నుంచి మా అబ్బాయి "ఫోను చేసి
నాన్నారూ, మీకో శుభవార్త !. మీరు ఇష్టపడే యల్పీ రికార్డులు
మళ్ళీ వస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆర్టికల్ పడింది.
కోరియర్లో ఈ రోజే "ఆ పేపర్ పంపుతున్నాను" అని చెప్పాడు. నిజంగా
నాకది శుభవార్తే !. ఎందుకో గాని యల్పీ రికార్డులు స్టీరియో
ప్లేయర్ మీద వింటున్న తృప్తి నాకు మ్యూజిక్ సిస్టమ్ పై సీడీల్లో
విన్నప్పుడు కలగనే కలగదు. చక్కగా నల్లగా మెరిసిపోతూ ,
రంగు రంగుల స్లీవులతొ , గాయకుల గురించి, వాయిద్య కారుల
గురించి వాటి పై వివరంగా వ్రాసిన ఆ రికార్డుల అందమే అందం.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్రాసిన కొన్ని విశేషాలను యధాతధంగా
సంక్షిప్తం గా ఇస్తున్నాను.
The LP is back in the stores.so bring out the turn
table and play it again.

Back in the 1970s, upper middle-class drawingrooms
in India were considered incomplete without a record
player and a cache of albums to its side.That was a
timesongs could'n't be downloaded by pushing a button
in a retail store or on a computer keyboard.Albums
were like friends for every occation.There was no greater
joy than placing an LP gently on the turntable, watching
the needle settle in the groove and letting the sound of
music take over.

From last October, EMI Music India has released more
than 125 titles at retail outlets in Chennai, Bangalore,
Kochi, Hyderabad,Mumbai and Gurgaon .The new old
LPs start at Rs.695/- Pink Floyd's "Dark side of The Moon"
comes with posters and stickers, which are not available
with the CD format.
Yet hope floats on the "hardware" front too with retail stores
planning to sell turntables soon. "We have ordered turntables
from Austria.The shipment to arrive mid August. Infact we
have already booked 10 orders in Bangalore" says Shinde.
They will cost anywhere between Rs.19,500 and Rs..99,000/-
-----From SUNDAY TIMES OF INDIA, BOMBAY
August 8, 2010.
అమెరికన్ గాయకుడు జాన్ హిగిన్స్ పాడిన దక్షిణ భారత క్లాసికల్ పాటల
LP రికార్డు మన మితృలు ఎవరి దగ్గరైనా వుంటే తెలియజేస్తారా !

Friday, 20 August 2010

నవ్వుకుందాం ! రండి !!


డాక్టర్ -పేషెంట్
ముక్కుతూ మూలుగుతూ రోగేస్వరరావు డాక్టర్ ధన వంతరి హాస్పటలుకు
వచ్చాడు.
డా"ధనవంతరి: రారా! రోగేస్వరరావ్, బాగున్నావా ?
రోగేస్వర్రావ్: బాగుంటే మీ దగ్గరకెందుకు వస్తా ! వళ్ళంతా భరించలేని నొప్పి.
ఈ వేలుంది చూసారా, దీనితో తలమీద, చేతి మీద, కాలిమీద,
పొట్టమీద, నడుం మీద ఎక్కడ నొక్కినా భరించలేని నొప్పేనొప్పి.
ఇంతకన్నా చావే నయమనిపిస్తున్నది !
డాక్టర్ : నా దగ్గర కొచ్చావుగా, ఇక ఆ విషయం నే చూసుకొంటానుగా !
ఏదీ , ముందు నీ వేలు చూడనీ ! ( వేలును నొక్కి చూస్తాడు)
రోగ్ : ఐబాబోయ్ ! చచ్చాన్రోయ్!
డాక్టర్: అంత తొందరేం, నేనింకా వైద్యం మొదలెట్టనిదే !
రోగ్: ఐతే ఇప్పుడు నా వేలికి కూడా రోగం పాకిందన్నమాట! నేనేం
చెయ్యన్రోయ్ !
డక్టర్: నీ వంటికి జబ్బేమీ లేదు. జబ్బల్లా వేలికే ! వేలు బెణికింది.
అందువల్లే ఈ వేలితో ఎక్కద నొక్కినా నొప్పెడుతుంది.ఇంతకీ నీ
చెవినొప్పెలా వుంది. నే నిచ్చిన మాత్రలేసుకున్నావా?
రోగ్: చెప్పటం మర్చేపోయా. మీరిచ్చిన మూడు మాత్రలు మూడు
పూట్లా వేసుకున్నా. ఐనానొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది.
డాక్టర్: నొప్పి తగ్గలేదా?! ఏదీ చెవిని చూడనీ, ఏవిటీ చెవిలో మాత్రలున్నాయి!
రోగ్: మీరే కదా చెవి నొప్పికి మాత్రలిచ్చారు.మీరు చెప్పినట్లే మూడు పూటలా
చెవిలో మాత్రలేసుకున్నాను.
డాక్టర్: ఏవిటీ ! చెవిలో వేసుకున్నావా? నోట్లో వేసుకోవాలయ్యా !!
రోగ్: భలే వారే ! ఆ మధ్య నోరు పూసిందంటే మీరు మాత్రలిస్తే నోట్లో వేసుకుంటే
తగ్గింది కదా, ఇప్పుడు చెవినొప్పికి చెవులో కాక నోట్లో ఎలా వేసుకుంటాను?
డాక్టర్: సరే నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తాను.
రోగ్: డక్టర్ గారు, మీ దగ్గర ఇంజక్షన్ చేయించుకోవడం ఇదే మొదటి సారి. నొప్పి
లేకుండా చేస్తారుగా.
డక్టర్: భలే వాడివే ! నే పాతికేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా తెలుసుగా ?!
రోగ్: అయ్యబాబోయ్ ! ఇంజక్షన్ చేయడం పాతికేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే
మీ కింకా చేయడం బాగ రాదన్నమాట. మాత్రలే ఇవ్వండి. ఈ సారి నోట్లోనే
వేసుకుంటాను. పత్యమేమైనా వుందా/ వంకాయ, టొమాటా తినొచ్చా?
డాక్టర్: బ్రహ్మాండంగా తినొచ్చు.
రోగ్: బెండకాయ, దొండకాయ, దోసకాయ ?
డాక్టర్: (విసుగ్గా) అన్నీ తినొచ్చు
రోగ్: కోప్పడకండి, బలానికి జీడిపప్పు, బాదంపప్పు?
డాక్టర్: గన్నేరుపప్పు తప్ప అన్నీ తినొచ్చాయ్యా, చూడు ఎంత మంది పేషెంట్లు బయట
వైట్ చేస్తున్నారో.
రోగ్: ఊరుకోండి! నవ్విపోతారు, వాళ్ళంతా మీ పేషేంట్లు కారండి. నాతో తోడుగా
వచ్చిన నా ఫ్రెండ్ర్స్!! ఇంతకీ ఈ మాత్రలు కాఫీ తో వేసుకోవాలో, టీతో వేసుకోవాలో
చెప్పారుకాదు.
డాక్టర్: (తల పట్టుకుంటూ) సారా తో తప్ప దేనితోనైనా వేసుకోవయ్యా!! ఆగాగు ఫీజు ఏదీ?
క్రితం సారి కీళ్ళనొప్పుల ట్రీట్మెంట్ కు నువ్విచ్చిన చెక్కు తిరిగొచ్చింది !
రోగ్: అలానాండీ ! మీరు వైద్యం చేసిన కీళ్ళనొప్పీ నాకు తిరిగొచ్చింది! సరికి సరి !!
( మా " హాసం క్లబ్ " కార్యక్రమం లో నేనూ, మితృడు ఖాదర్ ఖాన్ ప్రదర్శించిన స్కిట్)
  • Blogger news

  • Blogroll

  • About