RSS
Facebook
Twitter

Thursday, 30 September 2010




ఈ రోజుతో నా బ్లాగు మొదలుపెట్టి ఏడాది పూర్తయింది.
నా బ్లాగు ఇంతకాలం విజయవంతంగా నిర్వహించడానికి
సాయం చేసినముగ్గురు త్రిమూర్తులకు నా ధన్యవాదాలు
తెలియజేయడంనా కనీస ధర్మం.
పూనాలో నివాసముంటున్న శ్రీ భమిడిపాటి ఫణిబాబు,
శ్రీమతి లక్ష్మి దంపతులు.కొంతకాలం గోదావరీ తీరంలో
(వారిది మా గోదావరి జిల్లాయే) గడపాలనే సదుద్దేశంతో
రాజమండ్రి వచ్చి ఇటీవలే తిరిగి పూనా వెళ్ళారు. ఇక్కడ
వుండగా ఓ మూడో ఆదివారం మా "హాసం క్లబ్" కు నవ్వులు
పంచుకోడానికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా పుస్తకాలు,
అలనాటి చందమామలు, గ్రామఫోన్ రికార్డులు చూసి అమితంగా
ముచ్చట పడటమే కాకుండా నన్నో బ్లాగు ప్రారంభించమని
ప్రోత్సహించారు. కంప్యూటర్లో ఈ మైల్ ఇవ్వడ తప్ప నాకు
మరేమీ తెలియదు మహప్రభో అంటే వినకుండా వారింటికి
వెళ్ళినప్పుడు బ్లాగులో నా ఖాతా తెరిచి జ్యోతి గారికి( గారు
అంటే మా చి"సౌ"జ్యోతికి మా చెడ్డ కోపం వస్తుంది) పరిచయం
చేశారు. నేను బొమ్మలు,ఫొటోలు, కధనాల్ని మైల్ చేస్తే జ్యొతి
గారు, సారీ అమ్మాయి జ్యోతి అందంగా నా బ్లాగులో వుంచేవారు.
సాహిత్య అభిమాని,మన తెలుగు చందమామ బ్లాగులను
అద్భుతంగా నిర్వహించే శ్రీ శివరామప్రసాద్ గారు బెంగళూర్ నుండి
విజయవాడ వస్తూ నన్ను కలవడానికి జనవరి 17 వ తేదీన
రాజమండ్రి వచ్చారు. నా కీ గ్రామఫోన్ ఫొటో తీసి నా చేత ఆ
రోజు బ్లాగును పోస్ట్ చేయించారు.అలా ఆయనా నా గురువు
గారే! తరువాత కూడా ధైర్యం చాలక బ్లాగు మేటర్ చి.జ్యోతికి
మెయిల్ చేస్తుండేవాడిని. ఒక రోజు ధైర్యం చేసి నేనే పోస్ట్
చేయడం ప్రారంభించా. నా బ్లాగు ప్రారంభించాక ఎందరో
బ్లాగర్లు మితృలయ్యారు. వారిలో "చిత్రచలనం" బ్లాగును
నిర్వహించే శ్రీ బి.విజయవర్ధన్ ఒకరు. నాకు పుస్తకాలు
కార్టూన్లంటే ఇష్టమని The cartoon Craft of R.K.Laxman
and Bal Thakeray అనే పుస్తకాన్ని కానుకగా పంపించారు.
ఈ పుట్టిన రోజు సంధర్భంగా దేశవిదేశాల్లో వున్న బ్లాగర్
మితృలందరికీ నా శుభాభినందనలు.
ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు మా ఇద్దరమ్మాయిలు
చి.సౌ.మాధురి,చి.సౌ.మాధవి, దేముడిచ్చిన మా మూడో
అమ్మాయి చి.సౌ.జ్యోతి.వి ( ఓ సారి మీకు శ్రమిస్తున్నాను
అని వ్రాస్తే "అలా ఐతే నే వ్రాయనంతే" అంటూ మా అమ్మాయిలను
గుర్తుచేసారు). మిగిలిన రెండు ఫొటోలు శ్రీ భమిడిపాటి దంపతులు,
శ్రీ శివరామప్రసాద్ మా ఇంటికి వచ్చినప్పటి తీపి గుర్తులు!

Wednesday, 29 September 2010

సినేమా కధలు



ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావు గోపాలరావు
అన్న డయలాగు గుర్తొచ్చింది కదూ! ఇప్పుడు మనం నిజం గా
సినిమా కధలే చెప్పుకుందాం. ఇప్పట్లా సినిమాలు రాక ముందు
జనానికి నాటకాలు, హరి కధలూ ,తోలుబొమ్మలాటలు కాలక్షేపం.
సినిమాలొచ్చి వాటన్నిటినీ వెనక్కు తోసేశాయి.ఆ సినిమాలకు
పోటీగా టివీలొచ్చాయి. మన దేశంలో కంటే విదేశాల్లో ఇంకా
ముందరే వచ్చేసి సినిమాలకు పోటీగా నిలిచాయి. ఆ పోటీని
తట్టుకోవడానికి రంగులు, సినిమా స్కోపు, సెవెన్టీ ఎమ్మెమ్ము,
అంతకు ముందే 3D సినిమాలు వచ్చాయి. నే కాలేజీలో చదివే
రొజుల్లో విజయవాడ వెళ్ళి "మెకన్నాస్ గోల్డ్" సినిమాను 70 MM
లో చూశాను. 3D సినిమా, మా రాజమండ్రిలో రామాటాకీస్ లో
స్కూళ్ళో చదివే రోజుల్లో మానాన్న గారితో "హౌస్ ఆఫ్ వాక్స్"
చూశాను. కళ్లజోడు పెట్టుకొని చూస్తుంటే ఆ సినిమాలో ఓ సీన్లో
కుర్చీలు విసురుతుంటే తెర బయటకు వచ్చి హల్ సీలింగ్ మీద
ఎగిరి పడుతున్నట్లు చూడటం అదో ధ్రిల్లు! తరువాత వాసన వచ్చేవి
(స్మెల్లీస్), తెర మీద కాఫీ కప్పు కనబడగానే కాఫీ వాసన, పూల
తోట ఐతే పూల వాసన వచ్చేటట్లు కనుక్కున్నారట గాని ఆ
ప్రయోగం సఫలమైనట్లు అగుపించలే. ఈ వార్త విన్నఒకాయన
మన సినిమాలు కొన్ని ఎప్పటినుంచో కంపు కొట్టడం ప్రారంభించాయి
కదా అని చమత్కరించారట. ఇప్పుడు ధియేటర్లు మారిపోయాయి.
పూర్వం చిన్న ఊర్లలో టూరింగ్ టాకీసులుండేవి. ఇప్పుడేమో చిన్న
ఊర్లలో కూడా DTS ధియేటర్లు వచ్చాయి. ప్రతి సినిమా ఇప్పుడు
రంగుల్లోనే తీస్తున్నారు. మొదట మన తెలుగు సినిమాలు (తమిళ,
హిందీ సినిమాలు రంగుల్లో రావటం మొదలయ్యక కూడా) తెలుపు
నలుపుల్లోనె వచ్చేవి. తమిళ సినిమాలకు శ్రీలంక, మలేసియా మొii
దేశాల్లో మార్కెట్ వుండటం చేత కలర్ ఫిల్మ్ దిగుమతికి అనుమతి
దొరకటమే అందుకు కారణం. మా చిన్నప్పుడు సినిమాలలో కొన్ని సీన్లకు
హండ్ కలరు వేసి విడుదలచేసేవారు. అటు తరువాత కొన్ని పాటల
దృశ్యాలను కలరులో చిత్రీకరించడం మొదలయింది. ఆ సినిమాల
టైటిల్ క్రింద partly color అని వ్రాసేవారు. పూర్తి రంగుల్లో స్కోప్
లో తీస్తున్న కొత్తలో SCOPE & COLOR అని వేయడం మీరు
గమనించే వుంటారు ఇక పేర్లలో కూడా అప్పటికి ఇప్పటికి పెను
మార్పులొచ్చాయి ఒక నాడు మంచివాడు,కలసి వుంటే కలదు
సుఖం,మంచిమనిషి,మంచిమనసులు,బంగారుబాబు లాటిపేర్లు
వుంటే ఈనాడు, బద్మాష్,కేడీ, రాస్కేల్,లాంటి పేర్లు వుంటున్నాయి.
ఆ రోజుల్లోను శ్రీలక్ష్మమ్మ లాంటి చిత్రాల్లో కస్తూరి శివరావు చేత
అప్పడాలకర్ర అనే అసభ్య పాటను పాడించినా ఆ తరువాత తొల
గించారు.ఇటీవలి చిత్రాల్లోని హాస్యంఅంతకంటే వెగటు పుట్టిస్తున్నది.
అన్నట్లు గురుదత్ నిర్మించిన "కాగజ్ కా ఫూల్" బ్లాక్ అండ్
వైట్ లో తీసిన మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం. చివరిగా ఓ
సినిమా జోకు..... " సినిమా కధ"
ఒక నిర్మాత కధల కోసం ప్రకటన చేశాడు. ఒక రచయిత
కధ యిచ్చాడు.
"అద్భుతంగా ఉంది.కొత్తగా ఉంది.ఉషారుగా ఉంది." అన్నాడు
నిర్మాత అది చదివి.
"అయితే మీ పిక్చరుకి దీన్ని తీసుకుంటారా?"
"అబ్బే వొద్దండి.ఇంతవరకూ ఇలాటి కధ ఎక్కడా రాలేదు.
ఎవరూ పిక్చరు తియ్యలేదు !"
( ముళ్లపూడి వారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో)
1960 సంII వరకు రాజమండ్రిలో హిందీ సినిమాలకు హాల్లో
ఓ మనిషి డైలాగులకు తన స్వంత కవిత్వం జోడించి తెలుగులో
చెప్పేవాడు. మైకు లేకుండా గట్టిగా ఎలా మాట్లాడే వాడో అదో
చిత్రం ఆ రోజుల్లో! అటుతరువాత ఈ అనువాదం పద్ధతి తీసేసారు.
అటు తరువాత పరభాషా చిత్రాలను తెలుగులో డబ్ చేయడం
మొదలయింది. రాజ్ కపూర్ నిర్మించిన "ఆహ్" చిత్రాన్ని "ప్రేమ
లేఖలు" పేరిట తెలుగులో డబ్ చేశారు. మాతృకలో విషాదాంతం
అయిన ఈ కధను తెలుగులో సుఖాంతం చేశారు. తెలుగు
సంభాషణలనుపాటలను ఆరుద్ర వ్రాశారు. పాటలను ఎయమ్.
రాజా ,జిక్కీ పాడారు. పందిట్లో పెళ్ళవుతుంది, ఘల్లుఘల్లు
గజ్జెల సంగీతం, పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముఛ్ఛటలోయి పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

Friday, 24 September 2010


హేమంత్ కుమార్ పేరు వినగానే మనకు "బీస్ సాల్
బాద్." "కొహ్రా" లాంటి హర్రర్ సినిమాలు గుర్తుకొస్తాయి.
"బీస్ సాల్ బాద్" చిత్రంలోని లతా పాడిన "కహీ దీప్ చలే"
పాట, దర్శకుడు బిరేన్ నాగ్ తన కళాదర్శకత్వ అనుభవంతో
రాత్రి వేళ దృశ్యాలతో అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులను
హడలగొట్టాడు. హేమంత్ కుమార్ కు డిటెక్టివ్ నవలలంటే
అమిత ఇష్టం. "బీస్ సాల్ బాద్" సినిమా ముందు ఎన్నో
డిటెక్టివ్ సినిమాలొచ్చినా, ఈ చిత్రంలో పాడుబడిన మేడ,
గెడ్డంతో ఓ నౌకరు, నిలువెత్తు రెల్లుగడ్డి, దీపం పట్టుకొని
పాటపాడుతూ తిరిగే అమ్మాయి జన్నాల్ని భయపెట్టాయి,
భయపడుతూనే సినిమాను విపరీతంగా చూశారు. ఇక
"కొహ్రా" సినిమా కూడా అంతటి విజయాన్ని సాధించింది.
మా రాజమండ్రి ,శ్రీ కృష్ణా టాకీస్ లో ఏకధాటిన 100 రోజులు
ఆడిన మొదటి హిందీ సినిమా!! వారణాసిలో జూన్ 16,1900
లో పుట్టిన హేమంత్కుమార్ పూర్తి పేరు హేమంత్కుమార్
ముక్తోపాధ్యాయ. ఆయన కెరియర్ గాయకుడిగానే మొదలు
పెట్టారు. తొలి రికార్డు 1937లో విడుదలయింది.1947నుంచి
సంగీతదర్శకుడుగా మారారు. జాగృతి,నాగిన్,, మిస్ మేరీ,
బీస్ సాల్ బాద్,,సాహిబ్ బీబీ ఔర్ గులామ్,కొహ్రా, దో దిల్,
అనుపమా,ఖామోషీ లాంటి హిట్ చిత్రాలకు సంగీతం
అందించారు. బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ కు ప్లేబాక్
పాడారు. హేమంత్ కుమార్, సంధ్యాముఖర్జీ యుగళ గీతాలంటే
బెంగాలీలు , మన ఘంటసాల,సుశీల పాటలలాగ అభిమానిస్తారు.
ఎన్నో మధుర గీతాలకు సంగీతం అందించిన హేమంత్ కుమార్
సెప్టెంబరు 26, 1989 లో స్వర్గస్తుడయ్యారు.

Thursday, 23 September 2010

సాక్షి


కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు
1913 లొ కొంతకాలం అటుతరువాత 1920 లో
"సాక్షి" పేరిట వ్యాసాలను "ఆంధ్రపత్రిక" సారస్వ
తానుబంధంలో ప్రతి వారం ప్రచురించేవారు.
అవన్నీ సంపుటాల రూపం లో సుప్రసిద్ధ
ప్రచురుణ సంస్ఠ వావిళ్ల రామస్వామి శాస్త్రులు
వారి ద్వారా ప్రకటించబడ్డాక,, విజయవాడ,
అభినందన పబ్లిషర్స్ వారిచే 2006లో 265
పేజీలతో ఒకే వాల్యూమ్ గా బాపు గారు గీసిన
ముఖ చిత్రం తో వెలువడింది. ఆనాడు శ్రీ పానుగంటి
తమ "సాక్షి" వ్యాస పరంపరలో చెప్పిన వ్యంగ్య
భరితమైన విషయాలన్నీ ఈ నాటి కాలానికీ వర్తిస్తాయి!
ఆ కాలంలోనే తెలుగు మాట్లాడటానికి ఇష్ట పడని
వారిని ఆయన "సాక్షి" లో ఉతికి ఆరేసారు. ఆయన
ఏమన్నారో చూడండి.
"మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన
నున్నదా?...ఈతరాని కప్ప ఏ దేశమందైనా
నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ
చచ్చినదనుట కేమైనా సందేహమా? ఆంధ్ర
దేశమున బుట్టిన పక్షులైన నవవరతశ్రవణమున
నాంధ్రమున మాటలాడుచుండగా-అయ్యయో
మనుజుడే అంత మనుజుడే-ఆంధ్రమాతాపితలకు
బుట్టిన వాడే-ఆంధ్రదేశీయవాయు నీరాహార
పారణ మొనర్చినవాడే-అధమాధమాఱు
సంవత్సరముల యీడు వఱకైన ఆంధ్రమున
మాట లాడినవాడే-అట్టివా డాంగ్లేయ భాష
నభ్యసించినంత మాత్రమున నిప్పుడాంధ్రమున
మాటలాడ లేకుండునా-" అని:
"సాక్షి" లో "జంఘాల శాస్త్రి" అనే పాత్ర ద్వారా సంఘ
దురాచారాలమీద,అనాచారాలమీద,మూఢ విశ్వా
సాల మీద విమర్శలు చేయించారు.
కొంచెం గ్రాంధికంలో వున్న ఈ "సాక్షి" అద్భుత
వ్యాసాల్ని ఈ కాలం యువ పాఠకులకోసం ఇప్పటి
తెలుగు లో సంక్షీప్తకరించి ప్రచురిస్తే మరింత ప్రాచూర్యం
పొందుతుందని తలుస్తాను. ప్రతి పుస్తక ప్రియుడు
తప్పక తీసు"కొని" చదువ వలసిన మంచి పుస్తకం
ఈ "సాక్షి".

Wednesday, 22 September 2010

స్వరస్రవంతి లతామంగేష్కర్




లత స్వరం విని పులకించని వారెవరు ? 68 వసంతాల
పైగా ఆమె తన స్వరంతో సంగీత ప్రేమికులను అలరిస్తున్నారు.
"లత పాటలు పాడకుంటే నే సంగీత దర్శకత్వం వహించిన
"గైడ్" ద్వారా ఇంత ఉన్నత శిఖరాలను అధిగమించలేక పోయే
వాడిని" అన్నారు స్వర్గీయ యస్.డి.బర్మన్. అనిల్ బిశ్వాస్,
"మా సంగీత దర్శకులకు లత దేముడిచ్చిన ఒక వరం" అన్నారు.
ఇక నౌషాద్ "లత అంటే లతే" అని కితాబిచ్చారు. లత సెప్టెంబరు
1929, 20 వ తేదీ, శనివారం రాత్రి ఇందోర్ లో దీనానాధ్
దంపతులకు ప్రధమ పుత్రికగా జన్మించింది. దీనానాధ్ గాయకుడే
కనుక లతకు ఐదేళ్ల వయసుకే సంగీతం వంటబట్టింది. తండ్రి
లతకు సంగీతమే కాదు క్రమశిక్షణ నేర్పారు. ఒక సారి చిన్నతనంలో
వినాయక చవితి పండుగకు ఇంట్లో సామాను శుభ్రపరుస్తున్న
సమయంలో పొరబాటున ఓ ఎలుక చనిపోయింది. గణనాధుని
పండుగలో ఆయన వాహనమైన ఎలుకను చంపానని లత
ఆ రోజంతా తల్లడిల్లి పోయిందట. సంస్కృతం,మరాఠీ,పంజాబీ,
బెంగాలీ,అస్సామీ,హిందీ, వ్రజ,,అవధీ,భోజ్ పురీ,గుజరాతీ,మైధిలీ,
ఒరియా,నేపాలీ, కన్నడ,తెలుగు,సింహళ, ఉర్దూ,మార్వారీ,తమిళ,
కొంకణి భాషలలో పాడిన లతను భారతప్రభుత్వం 1969 లో
"పద్మభూషణ్" బిరుదుతో సత్కరించింది. 2009 సంవత్సరానికి
అక్కినేని ఫౌమ్డేషన్ ఎవార్డు తో శ్రీ నాగేశ్వరరావు లతను సత్కరించారు.
ఈ ఇద్దరి పుట్టిన రోజులూ సెప్టెంబరు 20 యే కావడం విశేషం!
అక్కినేని లాగానే ఆమె స్వరం కూడా నిత్యయవ్వనంగానే వుంటుంది,
అక్కినేని హీరోగా నటించిన "సంతానం" చిత్రం లో "నిదురపోరా
తమ్ముడా" అన్నపాటను లత సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం
(1955) లో పాడారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వం లో
వచ్చిన "సువర్ణసుందరి" పాటలు విని ఆ చిత్రం హిందీ వర్షన్ కు
తక్కువ పారితోషికం తీసుకొని పాటలు పాడిన మంచి మనసున్న
మనిషి లత. లత ఇలాటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని
కోరుతూ..
లత కారికేచర్ శ్రీ ఆర్కే లక్ష్మణ్ చిత్రించినది.( టైమ్స్ ఆఫ్ ఇండియా
సౌజన్యంతో)

Tuesday, 21 September 2010





దేశమును ప్రేమించుమన్నా-మంచి అన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టి పెట్టోయ్-గట్టిమేల్ తలపెట్టవోయి !
తిండి కలిగితె కండ కలదోయ్ -కండకల వాడేను మనిషోయి !
ఈసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోయి
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !!
ఇంతటి మంచి ప్రొబోధ గీతాన్ని అందించిన మహరచయిత
శ్రీ గురజాడ 149వ జయంతి ఈ రోజే! ఆయన కలం నుండి
జాలువారిన ప్రసిద్ధ నాటిక కన్యాశుల్కం, పూర్ణమ్మ కధలు
విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. శ్రీ గురజాడకు
అంజలి ఘటిస్తూ., "కన్యాశుల్కం" చిత్రంలోని రెండు ఫొటోలు
మీకోసం. ఈ చిత్రంలో మధురవాణి పాత్ర మహానటి సావిత్రి
అత్యంత అద్భుతంగా నటించింది.

Monday, 20 September 2010

అ ఆ ల అక్కినేని



అ క్కినేని నాగేశ్వరరావు,
ఆ యన వయస్సు ఈ రోజుతో దాటుతుంది ఎనభై ఆరు!
ఇ లా చెబితే నమ్ముతారా ఆయన వయసు యనభైఆరని!!
ఈ లేస్తూ ఇంకా హుషారుగా కనిపించే యంగ్ బాయే!!
ఉ రుకుల పరుగులతో యువకుడిగా అక్కినేని వయసు
పరుగులు పెడుతున్నది!
ఊ రూరా ఆయనంటే ఇంకా అభిమానం !
ఎ యన్నార్ ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్!!
ఏ నాటికీ తెలుగు చిత్రసీమలో నటనాగ్రన్ !
ఐ నా తానింకా నేర్వవలసింది చాలా వుందంటాడు ఈ
"పద్మభూషణ్"!
ఓ నమాల నటనాక్షరాలు ఇంకా దిద్దుతున్నానంటాడు
ఈ "వినయభూషన్"
ఔ రా! ఏమా వినయం !!
అం దుకే ఈ నాటికీ ఈవయసుకీ ఆంధ్రుల "అందాలరాముడు"
ఆః వయసు మరచిన ఈ చిన్నారి బాలుడు !!
*************
అక్కినేనికి అమెరికా ప్రభుత్వ ఆహ్వాన లేఖను (1963)
అందజేస్తున్న ప్రతినిధి (ఫొటో కర్టెసీ USIS)
అక్కినేనికి జన్మదిన శుభాకాంక్షలు


Sunday, 19 September 2010

కార్ట్యూనులు !

ఈ "మాస్"ఏజ్ లో
ఉత్తరాల పలకరింపులు లేవు!
అన్నీ మెసేజ్ లే !!
అక్షరాల కత్తిరింపులతో
స్పెల్లింగ్ కిల్లింగులతో
అన్నీ భాషను ఖూనీ చేసే డామేజీలే !!
అనుబంధాలను అందించే ఉత్తరం
నేడెంతో దూరం !
ఇక రావు కదా
గుండె చప్పుళ్ళను అక్షరాలతో నింపి
రాసే ఉత్తరాలు !!
పోస్ట్ మాన్ రాక తెలిపే
గేటు చప్పుళ్ళు ఇక వినిపించవు కదా!!

Saturday, 18 September 2010





దామెర్ల రామారావు, అడవి బాపిరాజు,వరదా వెంకటరత్నం,
అంకాల వెంకట సుబ్బారావు,కె.వేణుగోపాలరావు వంటి
కళాకారులెందరో తెలుగు చిత్ర కళకు ఎనలేని పేరు
ప్రఖ్యాతులు తెచ్చారు. ఇలానే శ్రీకాకుళం లో సెప్టెంబరు
10,1921 లో జన్మించిన శ్రీ వడ్డాది పాపయ్య ప్రముఖ
వర్ణచిత్ర కళాకారుడు. మన బ్లాగులో ఈయన గురించి
ఒక సారి చెప్పుకున్నాం .మరో సారి ఆయనను స్మరించు
కోవడం తెలుగు వారిగా మన ధర్మం. చందమామ
పత్రిక ముఖచిత్రాలుగా ఈ నాటికీ ఆయన చిత్రాలు చూసే
అదృష్టం కలుగుతున్నది. ఆనాటి "యువ" మాస పత్రిక
ముఖచిత్రాలుగా, అట్ట లోపలి పేజీలలోను వడ్డాది చిత్రాలు
కనుల పండుగ చేసేవి. యువ దీపావళి సంచికల ముఖ
చిత్రాలు మరీ ప్రత్యెకం. ఇక్కడ మీరు ఆ నాటి ముఖచిత్రాలను
కొన్నిటిని చూపించడానికి ప్రయత్నించాను.

Friday, 17 September 2010

జయదేవుని కార్టూనిష్టపదులు




ఈ నెల 13 న పుట్టిన రోజు జరుపుకున్న మితృలు
డాక్టర్ జయదేవ్ బాబు గారికి ఆయన అశేష అభిమానుల
తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నలభై
ఎనిమేదేళ్లకు పైగా వేలాది కార్టూన్లు గీసిన ఈ మంచి
మనసున్న తెలుగు వెలుగు మన జయదేవ్ బాబు గారు.
బెల్జియం దేశం వాళ్ళు నాక్ హీస్ట్ లో నిర్వహించే అంతర్జాతీయ
పోటిలకు పదేళ్ళు వరుసగా కార్టూన్లు పంపి, ప్రశంసలందుకోవడమే
కాకుండా, చివరకు ఆ కార్టూన్ పోటీలకు జడ్జి గా నియమింప బడ్డ
తెలుగు తేజం మన జయదేవ్. ఆయన గీతలు ఎన్ని సార్లు చూసినా
తనివి తీరదు. ఆ గొప్ప వ్యక్తి నాకూ ఆత్మీయుడయినందుకు ఆ
భగవానునికి నమోవాకాలర్పిస్తూ ఆయన గీసిన అద్భుత కార్టూన్లు
కొన్ని మీ కోసం. ఈ కార్టున్లను నా బ్లాగులో ఉంచడానికి పెద్ద
మనసుతో అనుమతించిన శ్రీ జయదేవ్ బాబుకి కృతజ్ఞతలతో.

Thursday, 16 September 2010

చేతిలో రహస్యం


మనం ఏదైనా రాయాలన్నా, ఏ పనైనా చెయ్యాలన్నా చెయ్యి
వుండల్సిందే. అందుకనేనేమో ఇదిగో ఈ పని "చెయ్యి" అని
చెబుతుంటారు. పని చెయ్యాలంటే చెయ్యి కావాలి కాబట్టి
"చెయ్యి" అనే పదం అందునుంచే పుట్టిందనుకుంటాను. చాలా
ఏళ్ళనుంచి మన దేశాన్ని పాలిస్తున్న ఒక రాజకీయ పార్టీ
గుర్తు చెయ్యే! మొదట "కాడెద్దులు", "ఆవూ దూడా" గా
మారి ఇప్పుడేమో ""హస్తం గా అవతారం ఎత్తి "హస్తం"గా మిగిలి
పోయింది. అసలు ఈ చేతికి ఎన్ని విశేషాలో! భగవంతుడు
చూపించేది అభయ హస్తం. ఆయనకున్న నాలుగు చేతుల్లో
ఒక చెతితో మనకు రక్షను చూపిస్తాడు. ఇక ఎడాపెడా జీతంతో
బాటు అన్ని మార్గాలా సంపాదించే వాడిని,"వాడికేం, రెండు
చేతులా సంపాదిస్తున్నాడు" అంటారు ఎవరైనా మనను దగా
చేస్తే, చూసావా,వాడు చెయ్యిచ్చాడు అంటాము.(అందుకేనేమో
కొదరంటారు ఆ పార్టీ తమ గుర్తుకు "చేతి" ని ఏర్పాటు చేసు
కుందని).దొంగ తనం చేసిన వాడిని "చేతి వాటం" చూపించాడు
అని అంటారు. మనకు కొత్త వ్యక్తులు పరిచయమయినప్పుడు
షేక్ హాండ్ ( కరచాలనం) ఇచ్చుకుంటాము.అలానే మితృలు
కలసినప్పుడు, ఏదైనా ఘనకార్యం సాధించినప్పుడు షేక్ హాండ్
ఇస్తాము. ఈ షేక్ హాండే ఓ ఉద్యోగి పదవిని ముందే వదలు
కొన్నప్పుడు ప్రతిఫలం భారిగా ముట్టజెప్పి సాగనంపినప్పుడు
దాన్ని "గోల్డెన్ షేక్ హాండ్" గాపిలుస్తారు. ఓ ప్రతిభగల ఉద్యోగి
సంస్ఠ విడిచి వెడతానంటే ,అతన్ని చేజారి పోనికు అని సలహా
యజమానికీ ఇస్తుంటారు. ఇక చేతి మీద, అదే కాగితం మీదే
అనుకోండి,మన సినీ రచయితలు హిట్ పాటలూ వ్రాసారు.
"ఇల్లరికం" చిత్రంలోని చేతులుకలిసిన చప్పట్లు,మనసులు
కలసిన ముచ్చట్లు, "దసరాబుల్లోడు" సినిమాలో చేతిలో చెయ్యేసి
చెప్పు బావా అన్నపాట ఇందుకు ఉదాహరణ. సభల్లో మంచి
ప్రసంగం చేసినా చప్పట్లు కొడతారు. అదే బోరు కొట్టినా ఇక
చాలని చెప్పటానికి చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లకు రెండు
చేతులూ అవసరమవుతాయి. మన చెయ్యి భవిష్యత్తుని చెబు
తుందంటారు. మన హస్త రేఖలు చుసి చెప్పే శాస్త్రం ఇదే కదా!
ఆ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళు! ఆయన హస్తవాసి మంచిదని
సలహా ఇస్తుంటాము. ఇంకో గమ్మత్తు చూశారా! కొందరు తమ
చేతిలో స్వర్గం చూపించే వాళ్ళుంటారు.ఇలా చేతి కబుర్లు చెప్పా
లంటే చెయ్యి నొప్పీట్టేదాకా వ్రాయచ్చు.! మరీ మీకు బోరు కొట్టితే
చెయ్యి చేసుకో గలరు. ఐనా నేను మీ చేతికి అందనంత దూరంలో
ఉన్నా! అదే నా ధైర్యం!!

Wednesday, 15 September 2010




శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు సినిమావాళ్ళ
పాత్రలకు అందమైన డై "లాగు"లు తొడిగారు. బాపు
రమణలు 1950 లో ఆంధ్ర పత్రికలలో వ్రాసిన,
సినిమా సమీక్షలు, గీసిన బొమ్మలతో "బాపూ
రమణీయం" పేరిట ఓ అందమైన పుస్తకం 1990
ఏప్రియల్ లో వచ్చింది. ఆ పుస్తకంలో వచ్చిన
రమణ గారి డైలాగుల మచ్చు తునకలు మీ కోసం.
దాగుడుమూతలు
అమ్మడు (శారద) పాపాయి(పద్మనాభం) కలిసి
ధర్మామీటరుతో సూరమ్మ (సుర్యకాంతం) జరం
కొలుస్తుంటారు.
అమ్మడు: అమ్మబాబోయ్! బెజవాడంత వచ్చేసింది.
సూరమ్మ: బెజవాడేమిటే !
అమ్మడు: అవునత్తయ్యా 118 డిగ్రీలు వుంది.
సూరమ్మ: అమ్మో! అయిసు బాబో అయిసు. అయినా
118 డిగ్రీలుంటే మనుషులు బతుకుతారుటే ?
అమ్మడు: ఆ ! బెజవాడలో మనుషులు బతకటం లేదా?
***************
ముత్యాలముగ్గు
కంట్రాక్టరు(రావు గోపాలరావు) హలంతో :
ఏంటి పిల్లా, ఆయన మీద పడ్డావ్. కళ్ళు మసకేశాయేటి.
హలం: కాదు,ఆయనే మన పాసెంజరనుకున్నాను.
కంట్రాక్టరు: ఒళ్ళు కరుసయిపోతుంది జాగర్తమరి.సోమరాజు
గాడికీ ఆడి బావగారికీ నీకు డిఫరెన్సు తెల్డం లేదు.
హలం: సోమరాజో కావరాజో, ఎంతమందిని గుర్తు పెట్టు
కోను. ఒక్క చోట నాలుగు రోజులు డూటీ ఎయ్యవు.
*****************
మనవూరి పాండవులు
దొర(రావు గోపాలరావు): మనూరికి ఫాక్టరీ వచ్చిందంటే-
సింతసెట్టు కెన్నాకులో అన్ని లక్షల రూపాయలు కురుస్తాయి.
నీ బిడ్డ కొండంత సదువులు సదివేసి అమెరికా ఎల్లిపోతాడు.
మీ సాదరుకి సాలుకి పదేల డాల్డాలు అంపిస్తాడు.
పాల్(సారధి): డాడీ! డాలర్స్ అనాలి.డాల్డాలు కాదు.
దొర: డాలరంటే తేలిపోద్దిరా. డాల్డా అంటె మాటకి బరువుంటది.
(జనం వైపు తిరిగి) డాల్డా అనగా సీమరూపాయలు. మన
రూపాయలకన్నా మందంగా వుంటాయి.చాలా అందంగా
వుంటాయి.
*****************
గోరంత దీపం
పెళ్లయి అత్తరింటి కెడుతున్న కూతురు(వాణిశ్రీ)తో తండ్రి (కాంతా
రావు):"నీ అందం ఆరోగ్యం, నీచదువు సంస్కారం--యివే నిజమైన
నగలు. నీ వినయం వందనం, నీ నిదానం నిగ్రహం -యివే నిన్ను
కాపాడే ఆయుధాలు...కాల్లో ముల్లు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చు
కోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచో కూడదు...నువ్వు హాయిగా
సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్ళను తల్చుకో----చూడ్డానికి రా-
ఓడిపోతున్నాప్పుడూ,కష్టపడుతున్నాప్పుడూ--నాకు చెప్పకు.నువ్వు
తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి...ప్రతి గుండెలో గోరంతదీపం
వుంటుంది.కటిక చీకటిలా కష్టాలు చుట్టు ముట్టినప్పుడు ఆ దీపమే
కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని
పేరే గెలవగలనన్న ఆశ
(నవ్వించి కవ్వించే డైలాగులు వ్రాసే రమణ గారు ఇలాటి సీరియస్
మాటలు సృష్టించగలరనటానికి ఈ పై మాటలే తార్కాణం)
*****************
ముత్యాలముగ్గు
కంట్రాక్టరు (రావు గోపాల్రావు) హలాన్ని ఎగాదిగా చూస్తున్న
ముక్కామలతో:
అయ బాబో అలా చూసేశారేటండీ.ఆవిడెవరనునుకుంటున్నారు.
పెద్ద ఆఫీసరుగారి భార్య.ఇద్దరు పిల్లలు.
ముక్కామల: అలాగా, ఏదో డాన్సురకంగ వుంటేనూ !
కం: బావుందండోయ్.దాన్సిగదరగా. ఆఫీసరు పెళ్ళాలు డాన్సు
చెయ్యగూడదేటండి! కలాపోసన.మడిసన్నాక కసింత కలాపోస
నుండాలి.పొద్దత్తమానం తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా
ఏటుంటది !
ఈ సినేమాలోదే మరో డయి"లాగు" తొడుక్కోండి సారీ చదువుకోండి:
సోమరాజు: ఇక్కడికెందుకొచ్చావయ్య,ఎవరన్నా జూస్తే కొంప
ములుగుతుంది.
కంట్రాక్టరు: కొంప ముంచడమే కదండీ మన కాంట్రాక్టూ!
*****************
అందాలరాముడు
అప్పారావు(రాజుబాబు): రాణీ!
సూశీల(కాంచన జూ"): రావ్!
అప్పా: మొన్న నిన్ను చూసిన దగ్గరనించి నామనసులో
ఏదో ఒక ఆశ--ఏదో కోరిక బయటికొచ్చేశాయి.ధైర్యం
చాలక లోపలికి నొక్కాను.
సు: అడుగు రావ్-ఏం కావాలి అడుగు?
అప్పా: నన్నపార్ధం చేసుకోక!
సు: (ప్రేమతో) ప్లీజ్! అడుగు రావ్! ఏం కావాలన్నా ఇస్తాను.
అప్పా: ఒక్క ఫైవుంటే అప్పివ్వు.
ఇవండీ!కొన్ని రమణగారి శాంపిలు డైలాగులు !

Tuesday, 14 September 2010


దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ గాయనీ గాయకులు
ఒకే చోట కనిపించే అరుదయిన ఈ అద్భుతమైన ఫొటో "హాసం"
హాస్యసంగీత పక్ష పత్రిక ( 16-31 ,ఆగష్టు 2002) సంచికలోనిది.
ఇందులో టి.జి.కమలాదేవి, పి.సుశీల, కె.రాణి, పి.లీల, జిక్కీ,ఎ.పి.
కోమల,ఎ.యమ్.రాజా,జె.వి.రాఘవులు,ఘంటసాల,మాధవపెద్ది
సత్యం,తిరుచ్చి లోకనాధన్,టి.యం.సౌందర్ రాజన్, పిఠాపురం
నాగేస్వరరావు, కృష్ణణ్ లు ఉన్నారు.
"హాసం" లాంటి మంచి పత్రికను బ్రతికించుకొనలేక పోయిన
తప్పిదం మన తెలుగు పాఠకులదే!

Monday, 13 September 2010

రోజులు మారాయి




దున్నేవాడిదేభూమి అనే నినాదంతో సారధీ వారు నిర్మించిన
"రోజులు మారాయి" చిత్రం 14 ఏప్రియల్ 1955 తేదీన
విడుదలయి అఖండ విజయం సాధించింది. ఈ సినిమా
తోనె వహీదా రెహ్మాన్ పరిచయమై హిందీ చిత్రసీమలో
హీరోయిన్ గా స్థిర పడింది. ఈ చిత్రంలో ఆమె ఓ నృత్య
సన్నివేశంలో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో జిక్కీ
గానం చేసిన ఏరువాక సాగారో రన్నా-చిన్నన్నపాటకు నృత్యం
చేసింది. అక్కినేని నాగేశ్వరరావు, జానకి,సియస్సార్,
రేలంగి,పెరుమాళ్ళు, అమ్మాజీ ముఖ్య తారాగణం.
సంగీత దర్శకుడు వేణు వివిధ రకాల వాయిద్యాలను
వాయించడంలో ప్రావీణ్యం గలవారు. హార్మోనియం,పియానో,
సితార్,గిటార్,దిల్రుబా,మాండోలిన్,ఎకార్డియన్,ఫ్లూట్,సెల్లో,
వుడోఫోన్,జలతరంగిణి,హెమండ్ ఆర్గన్ వంటి పదిహేను
రకాల వాయిద్యాలను వాయించగలిగేవారట. ఆయన స్వర
పరచిన ఐదు పాటలు, "ఇదియే హాయి కలుపుము చేయి",
"రండయ్య పోదాము మనము,లేచి రండయ్య పోదాము
మనము" ఈ పాటను ఘంటసాల బృందం పాడగా,అక్కినేని,
జానకి, సీతారాం మొ"అభినయించారు, "కల్లాకపటం కానని
వాడా లోకం పోకడ తెలియనివాడ ఏరువాక సాగారో రన్న
చిన్నన్న" .జానపద గీతాలను సినిమాలలో ప్రవేశపెట్టాక
"రోజులు మారాయి" సినిమాను ఉదహరించకుండా వుండ
లేము..ఇక మరో పాట, "ఎల్లిపోతుందెల్లి పోతుంది జోడెడ్ల
బండి ఎల్లిపోతుందెల్లి పోతుంది పెళ్ళోరి బండి" ఈ పాటను
మాధవిపెద్ది సత్యం గానం చేయగా వల్లం నరసింహారావు పై
చిత్రీకరించారు. ఈ సారి "రోజులు మారాయి" చిత్రం చూసి
వుండక పోతే తప్పక సీడీ కొనుక్కోని చూడండి. ఇంట్లో
సీడీ లైబ్రరిలో తప్పక పదిల పర్చుకోవలసిన మంచి సినిమా.
ఈ సినిమా దర్శకుడు తాపీ చాణుక్య, మాటలు వ్రాసింది
కొండేపూడి లక్ష్మీనారాయణ,పాటలు తాపీ ధర్మారావు,
కొసరాజు.మంచి సంగీతం,కధ,అభినయనం కలిగిన సినిమా
రోజులు మారాయి.
,
  • Blogger news

  • Blogroll

  • About