RSS
Facebook
Twitter

Monday, 6 September 2010




హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1922 నాటి నుండి
రాజమండ్రి వీరేశలింగమ్ హైస్కూలులో గణితాధ్యాపకులుగాను,
ఆ పాఠశాల ప్రధానోపాధ్యాలుగాను పనిచేసి 1953 లో పదవీ విరమణ
చేశారు.హాస్యప్రధానమైన నాటకాలు, నాటికలు వ్రాశారు. 1950 లో
జయపూర్ మహారాజా శ్రీ విక్రమదేవవర్మ కామేశ్వరరావు గారిని
"హాస్యబ్రహ్మ" బిరుదుతో సత్కరించారు. ఆంధ్రనాటక పద్యపఠనం,
త్యాగరాజు ఆత్మవిచారం మొదలైన పరిశోధనాత్మకమైన రచనలు
చేశారు.ప్రఖ్యాత సినీ,నాటక రచయిత కీ"శే"భమిడిపాటి రాధాకృష్ణ
వీరి కుమారులు. శ్రీ కామేశ్వరరావు 1958 ఆగష్టు 28న రాజమండ్రి
లో పరమందించారు. కాలక్షేపం పేరిట ఆయన వ్రాసిన జోకులను,
నిన్ననే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం కనుక మేష్టార్లమీద
ఆయన చెప్పిన కొన్ని జోకులు !!
****************
ఎనభై మంది పిల్లలుగల ఒకానొక క్లాసులో నలుగురు ముగ్గురు
తప్ప తక్కిన అంతా హాజరై ఉన్నట్ట్లు తోచగా, ఆ సహస్ర నామాలు
లాంటివి పిలుస్తూ కూచోడం కాలయాపనం అనుకొని,
మేష్టరు : ఆబ్సెంటు అయిన నలుగురు ముగ్గురూ ఠంగున నుంచోండి.
చట్టున రాసుగుంటానూ.
*****************
అయ్యవారు: చిట్టిగా, ఇప్పుడు దేనిమీద పాఠం?
చిట్టి : చర్మం గురించండి
అయ్యవారు: చర్మం అంటే ఏమిటి?
చిట్టి: గేదెలూ అవీ తొడుక్కునే కోటండి.
అయ్యవారు: ఓరి పశువా "కోటు" అయితే గుండీలేవిరా?
చిట్టి: లోపల వేపు నుంటాయండి.కనిపించవు.
*****************
అవధాని: ఏమండీ యల్టీమేష్టరుగారూ! మా వాడికి ప్రేవేటు
చెపుతున్నారు గందా,లెక్కల్లో ఈ కుంక ఎల్లా
వున్నట్లూ!
మేష్టారు: లెక్కల్లో మీ వాడు "గుడ్" అనివాళ్ళ క్లాసు
మేష్టారు ఈ వేళ పొద్దున్నే అన్నారండి.
అవధాని: లెక్కల్లో గుడ్డయితే నువ్వు చెప్పి చచ్చిందేమిటయ్య మరీ !
*****************
ఆయ్యవారు: నీకు కాళ్ళెందుకురా, గురవా?
గురవ: ముల్లువిరిగితేనమ్డీ, తీసుకోడానికండీ !
అయ్యవారు: చీ! నువ్వురా వెంకన్న!
వెంకన్న: బూజుసులు (బూట్లు) తొడుక్కొనేందుకండీ!
అయ్యవారు: ఏడిసినట్టుఉంది. నువ్వురా, పాపిగా!
పాపిగాడు: ఏదేనా తొక్కితేనండీ, కడుక్కోడానికండీ!
అయ్యవారు: ఓరి అప్రాచ్చపు వెధవల్లారా! ఎరక్కపోయి అడిగాను.
*****************
శరీర శాస్త్రం చెప్పుతూ
ఉపాధ్యాయుడు: హృదయము నాలుగు భాగములు. కుడి
వెంట్రికలు,ఎడమ వెంట్రికలు.......
పరధ్యానంగా వింటున్న ఓ స్టూడెంట్
"అదేమిటి మాష్టారూ హృదయంలో వెంట్రుకలుంటాయండీ?!
*****************
పంతులు: "వర్షాలు" దీనికి ఇంగ్లీషేమిటి?
విద్యార్ధి : రెయిన్సండి.
పంతులు: "అకాలపు వర్షాలు" దీనికి ?
విద్యార్ధి: అకాలీరెయిన్సండీ !
......కామేశ్వరరావుగారి కాలక్షేపం నుంచి**

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About