శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు సినిమావాళ్ళ
పాత్రలకు అందమైన డై "లాగు"లు తొడిగారు. బాపు
రమణలు 1950 లో ఆంధ్ర పత్రికలలో వ్రాసిన,
సినిమా సమీక్షలు, గీసిన బొమ్మలతో "బాపూ
రమణీయం" పేరిట ఓ అందమైన పుస్తకం 1990
ఏప్రియల్ లో వచ్చింది. ఆ పుస్తకంలో వచ్చిన
రమణ గారి డైలాగుల మచ్చు తునకలు మీ కోసం.
దాగుడుమూతలు
అమ్మడు (శారద) పాపాయి(పద్మనాభం) కలిసి
ధర్మామీటరుతో సూరమ్మ (సుర్యకాంతం) జరం
కొలుస్తుంటారు.
అమ్మడు: అమ్మబాబోయ్! బెజవాడంత వచ్చేసింది.
సూరమ్మ: బెజవాడేమిటే !
అమ్మడు: అవునత్తయ్యా 118 డిగ్రీలు వుంది.
సూరమ్మ: అమ్మో! అయిసు బాబో అయిసు. అయినా
118 డిగ్రీలుంటే మనుషులు బతుకుతారుటే ?
అమ్మడు: ఆ ! బెజవాడలో మనుషులు బతకటం లేదా?
***************
ముత్యాలముగ్గు
కంట్రాక్టరు(రావు గోపాలరావు) హలంతో :
ఏంటి పిల్లా, ఆయన మీద పడ్డావ్. కళ్ళు మసకేశాయేటి.
హలం: కాదు,ఆయనే మన పాసెంజరనుకున్నాను.
కంట్రాక్టరు: ఒళ్ళు కరుసయిపోతుంది జాగర్తమరి.సోమరాజు
గాడికీ ఆడి బావగారికీ నీకు డిఫరెన్సు తెల్డం లేదు.
హలం: సోమరాజో కావరాజో, ఎంతమందిని గుర్తు పెట్టు
కోను. ఒక్క చోట నాలుగు రోజులు డూటీ ఎయ్యవు.
*****************
మనవూరి పాండవులు
దొర(రావు గోపాలరావు): మనూరికి ఫాక్టరీ వచ్చిందంటే-
సింతసెట్టు కెన్నాకులో అన్ని లక్షల రూపాయలు కురుస్తాయి.
నీ బిడ్డ కొండంత సదువులు సదివేసి అమెరికా ఎల్లిపోతాడు.
మీ సాదరుకి సాలుకి పదేల డాల్డాలు అంపిస్తాడు.
పాల్(సారధి): డాడీ! డాలర్స్ అనాలి.డాల్డాలు కాదు.
దొర: డాలరంటే తేలిపోద్దిరా. డాల్డా అంటె మాటకి బరువుంటది.
(జనం వైపు తిరిగి) డాల్డా అనగా సీమరూపాయలు. మన
రూపాయలకన్నా మందంగా వుంటాయి.చాలా అందంగా
వుంటాయి.
*****************
గోరంత దీపం
పెళ్లయి అత్తరింటి కెడుతున్న కూతురు(వాణిశ్రీ)తో తండ్రి (కాంతా
రావు):"నీ అందం ఆరోగ్యం, నీచదువు సంస్కారం--యివే నిజమైన
నగలు. నీ వినయం వందనం, నీ నిదానం నిగ్రహం -యివే నిన్ను
కాపాడే ఆయుధాలు...కాల్లో ముల్లు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చు
కోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచో కూడదు...నువ్వు హాయిగా
సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్ళను తల్చుకో----చూడ్డానికి రా-
ఓడిపోతున్నాప్పుడూ,కష్టపడుతున్నాప్పుడూ--నాకు చెప్పకు.నువ్వు
తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి...ప్రతి గుండెలో గోరంతదీపం
వుంటుంది.కటిక చీకటిలా కష్టాలు చుట్టు ముట్టినప్పుడు ఆ దీపమే
కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని
పేరే గెలవగలనన్న ఆశ
(నవ్వించి కవ్వించే డైలాగులు వ్రాసే రమణ గారు ఇలాటి సీరియస్
మాటలు సృష్టించగలరనటానికి ఈ పై మాటలే తార్కాణం)
*****************
ముత్యాలముగ్గు
కంట్రాక్టరు (రావు గోపాల్రావు) హలాన్ని ఎగాదిగా చూస్తున్న
ముక్కామలతో:
అయ బాబో అలా చూసేశారేటండీ.ఆవిడెవరనునుకుంటున్నారు.
పెద్ద ఆఫీసరుగారి భార్య.ఇద్దరు పిల్లలు.
ముక్కామల: అలాగా, ఏదో డాన్సురకంగ వుంటేనూ !
కం: బావుందండోయ్.దాన్సిగదరగా. ఆఫీసరు పెళ్ళాలు డాన్సు
చెయ్యగూడదేటండి! కలాపోసన.మడిసన్నాక కసింత కలాపోస
నుండాలి.పొద్దత్తమానం తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా
ఏటుంటది !
ఈ సినేమాలోదే మరో డయి"లాగు" తొడుక్కోండి సారీ చదువుకోండి:
సోమరాజు: ఇక్కడికెందుకొచ్చావయ్య,ఎవరన్నా జూస్తే కొంప
ములుగుతుంది.
కంట్రాక్టరు: కొంప ముంచడమే కదండీ మన కాంట్రాక్టూ!
*****************
అందాలరాముడు
అప్పారావు(రాజుబాబు): రాణీ!
సూశీల(కాంచన జూ"): రావ్!
అప్పా: మొన్న నిన్ను చూసిన దగ్గరనించి నామనసులో
ఏదో ఒక ఆశ--ఏదో కోరిక బయటికొచ్చేశాయి.ధైర్యం
చాలక లోపలికి నొక్కాను.
సు: అడుగు రావ్-ఏం కావాలి అడుగు?
అప్పా: నన్నపార్ధం చేసుకోక!
సు: (ప్రేమతో) ప్లీజ్! అడుగు రావ్! ఏం కావాలన్నా ఇస్తాను.
అప్పా: ఒక్క ఫైవుంటే అప్పివ్వు.
ఇవండీ!కొన్ని రమణగారి శాంపిలు డైలాగులు !
నీ అందం ఆరోగ్యం, నీచదువు సంస్కారం--యివే నిజమైన
ReplyDeleteనగలు. నీ వినయం వందనం, నీ నిదానం నిగ్రహం -యివే నిన్ను
కాపాడే ఆయుధాలు...కాల్లో ముల్లు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చు
కోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూచో కూడదు...నువ్వు హాయిగా
సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్ళను తల్చుకో----చూడ్డానికి రా-
ఓడిపోతున్నాప్పుడూ,కష్టపడుతున్నాప్పుడూ--నాకు చెప్పకు.నువ్వు
తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి...ప్రతి గుండెలో గోరంతదీపం
వుంటుంది.కటిక చీకటిలా కష్టాలు చుట్టు ముట్టినప్పుడు ఆ దీపమే
కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని
పేరే గెలవగలనన్న ఆశ. "This is best quotable dialog" in these post.