RSS
Facebook
Twitter

Thursday, 9 September 2010

పుస్తకాల కబుర్లు


పుస్తకాల కబుర్లు

మనకు ఎన్నెన్నో పండుగలున్నాయి. అలానే
పుస్తకాలకు పండుగలు జరుగుతాయి.ముఖ్యం
గా విజయవాడలో కొత్త సంవత్సరం మొదటి
తారీఖు వచ్చిందంటే పుస్తక ప్రియులకు సంక్రాంతి
కంటే పెద్ద పండుగ వస్తుంది. జనవరి ఒకటో తేదీ
నుంచి పదకుండో తేదీ వరకు విజయవాడ బుక్
ఎగ్జిబిషన్ సొసైటీ పుస్తకాల పండుగను ఏర్పాటు
చేస్తుంది. పుస్తకాలు అమ్ముకొని లాభాలను పంచు
కోవాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజల్లో పఠనాశక్తిని
పెంచాల్నే సదుద్దేశంతో పుస్తక ప్రచురణకర్తలు,
ప్రింటింగ్ విభాగం వారు కలసి 1989లో సొసైటీగా
అవతరించి ఈ నాడు దాదాపు 280 స్టాల్లకు పైగా
ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. పెంగ్విన్,టాటా
మెక్ గ్రావెల్, పియర్సన్,టైలర్ అండ్ ఫ్రాన్సిస్ వంటి
అంతర్జాతీయ సంస్దలూ పాల్గొంటున్నాయి. పుస్తకాలను
అమ్మటమే కాదు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం,
కొత్త పుస్తకాలను విడుదలచేయటం లాటి కార్యక్రమాలు
జరుగుతాయి.
చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం
కొనటం మానుకోకు అన్న సూక్తి విన్నారుగా. పుస్తకాల
గురించి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు తమ
గిరీశం లెక్చర్లలో గిరీశం చేత ఇలా అనిపిస్తారు. "వ్వాట్ !
బయింగ్ బుక్స్ ! మై గాడ్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్......
పిల్లనమ్ముకోడం కన్నా నికృష్టం. దిస్ మై డియర్
షేక్సిపియర్,ఈజ్ బార్బేరియస్.....పుస్తకాలు కొండమా?
డబ్బు పెట్టా? నువ్వు స్టోన్ ఏజ్ మానవుడిలా ఉన్నా
వోయ్! ఇది ఆంధ్రదేశమనిన్నీ, నువ్వు టెలుగూస్ జాతి
వాడివనిన్నీ, ఇది ఫలానా యుగవనిన్నీ మర్చిపోయావా?
............" మన తెలుగువాళ్ళకు పుస్తకాలు కొని చదవడం
అలవాటులేదని, మరి కొందరికి తీసు"కొని" చదవటమే
అలవాటని సరదాగా చెప్పారు. చివరగా ముళ్ళపూడి
"పాఠకులు నా మాటలు నాకు అప్పగించేరు సుమా.
నా పుస్తకాలు మట్టుకు తప్పక కొనండి.అన్ని శాస్త్ర
నియమా లకూ అపవాదులంటూ ఉంటాయి కదూ మరి!"
అంటారు. పుస్తకాలు నిజమైన నేస్తాలు. ఒంటరిగా వున్న
ప్పుడు కాలాన్ని ఇట్టె గడిచిపోయేటట్లు చేస్తాయి.
వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ఎన్నో ఏళ్ళ
నుంచి అధ్యాత్మిక పుస్తకాలను ,మద్రాసు నుంచి ప్రచు
రిస్తున్నది. ఆ సంస్ద ప్రచురించిన 1923 నాటి శ్రీ లలితా
సహస్ర నామ స్తోత్రమ్ 87 ఏళ్ళ పుస్తకం నా దగ్గరవుంది.
ఆ పుస్తకం ఆఖరి పేజీల్లో వారి ప్రచురణల వివరాలు
వాటి ధరలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఉదాహరణకు
బాలరామాయణము, సటీక ప్రతి 1-కి 0-3-0
అధ్యాత్మక రామాయణము 1-4-0
సుందరకాండము ఆంధ్ర తాత్పరిత
సహితము 2-0-0
శ్రీ మద్రామాయణము మూలము 6-0-0
అప్పటి రోజుల్లో (1923) ఆరు రూపాయలంటే చాలా
ఖరీదన్నమాట.! రాజమండ్రిలో కొండపల్లి వీరవెంకయ్య
అండ్ సన్సు వారు భమిడిపాటి రచనలు , వివిధ సాహిత్య
పుస్తకాలను ప్రచురించే వారు. అలానే సరస్వతీ పవర్ ప్రెస్
వారు కూడా శ్రిపాద సుబ్ర హ్మణ్య శాస్త్రి గారి పుస్తకాలను
ప్రచురించేవారు, కవికొండల వెంకట్రావు గారి రచనలను
కూడా పై సంస్ధల ద్వారా ప్రచురించబడ్డాయి. ఇప్పుడు
రాజమండ్రిలో ఆ పుస్తక ప్రచురణ సంస్ధలు లేవు. సాహిత్య
కేంద్రంగా పేరుబడ్ద ఈ నగరంలో కొత్తగా విడుదలయిన
పుస్తకం కావాలంటే లోకల్ పుస్తకాల షాపు వాళ్ళకు చెప్పి
తెప్పించుకోవలసిందే. ఇక్కడ ఇప్పుడు దొరికే పుస్తకాలన్నీ
ఎక్కువ భక్తికి సంభందించినవే వుంటుంటాయి.
టీవీ ప్రాచుర్యం పెరిగినా పుస్తక ప్రచురుణ, పాఠకులు
తగ్గక పోవటం సంతోషించవలసిన పరిణామమే. ఈ ఆధునిక
యుగంలో ఆ-పుస్తకాలు రాను రాను తగ్గి ఈ-పుస్తకాలు
రావటం ప్రారంభమయింది. ఇక్కడ మీరు ఫొటొలో చూస్తున్న
BOOK OF KNOWLEDGE ఎనిమిది వాల్యూముల
పుస్తకాలు 1963 లో నేను శ్రికాకుళం SBI లో క్యాష్యర్ గా
చేరినప్పుడు కొన్నవి. ఖరీదు 425/-రూపాయలు. మొదటి
సారి STANDARD LITARATURE Co.CALACUTTA
ప్రతినిధికి రూ.15/- కట్టి తరువాత 28 నెలసరి వాయిదాలు
రూ.15/- నా సాలరీలొ డిడక్ట్ అయ్యెది. అప్పుడు నా జీతం
Rs.125/-!!
పుస్తకాలమీద ఓ జోకు!
మీ ఇంట్లో ఇన్ని పుస్తకాలున్నాయి కదా? మీకు ఏ పుస్తకం
అంటే ఇష్టం?
మా ఆయన చెక్కు పుస్తకం !!
************
పుస్తకాల పై నా కవిత ! అదేంటి ! అలా పారిపోతున్నారు!
ఆగండి ! మీరు వినాల్సిందే! నేనూరుకోను!! ఆ మీరు మంచి
వారు, చదువుతారు!!
కొందరు ప్రేమిస్తారు మొక్కలను!
మరి కొందరికి పెంచడం ఇష్టం కుక్కలను!!
నేను మాత్రం అమితంగా ప్రేమిస్తా బుక్కులను!!!
కదలకుండా కూర్చొని చూసే టెలివిజన్
కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది "తెలివి"జన్ !!!

3 comments:

  1. మీ పుస్తకాల కబుర్లు, మీ చిన్ని గ్రంధాలయమూ బాగున్నాయి.

    ReplyDelete
  2. బాగుంది.
    బొమ్మలో చూపెట్టిన గ్రంధాలయం మీదేనా? చాలా చక్కగా అమర్చుకున్నారు.

    ReplyDelete
  3. బాగా చెప్పారు...చాలా మంది పుస్తకాలు చదవడం అంటే అదేదో పని-పాటా లేని వాళ్ళు చేసే పనిలాగా చూస్తారు. ఈ టీ.వీ. ,ఇంటెర్నెట్ ఎక్కువయ్యి పుస్తకాల విలువ తెలియట్లేదు కానీ మంచి పుస్తకం మంచి మిత్రుడు లాంటిది అన్నది అక్షరాలా నిజం. :)

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About