ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావు గోపాలరావు
అన్న డయలాగు గుర్తొచ్చింది కదూ! ఇప్పుడు మనం నిజం గా
సినిమా కధలే చెప్పుకుందాం. ఇప్పట్లా సినిమాలు రాక ముందు
జనానికి నాటకాలు, హరి కధలూ ,తోలుబొమ్మలాటలు కాలక్షేపం.
సినిమాలొచ్చి వాటన్నిటినీ వెనక్కు తోసేశాయి.ఆ సినిమాలకు
పోటీగా టివీలొచ్చాయి. మన దేశంలో కంటే విదేశాల్లో ఇంకా
ముందరే వచ్చేసి సినిమాలకు పోటీగా నిలిచాయి. ఆ పోటీని
తట్టుకోవడానికి రంగులు, సినిమా స్కోపు, సెవెన్టీ ఎమ్మెమ్ము,
అంతకు ముందే 3D సినిమాలు వచ్చాయి. నే కాలేజీలో చదివే
రొజుల్లో విజయవాడ వెళ్ళి "మెకన్నాస్ గోల్డ్" సినిమాను 70 MM
లో చూశాను. 3D సినిమా, మా రాజమండ్రిలో రామాటాకీస్ లో
స్కూళ్ళో చదివే రోజుల్లో మానాన్న గారితో "హౌస్ ఆఫ్ వాక్స్"
చూశాను. కళ్లజోడు పెట్టుకొని చూస్తుంటే ఆ సినిమాలో ఓ సీన్లో
కుర్చీలు విసురుతుంటే తెర బయటకు వచ్చి హల్ సీలింగ్ మీద
ఎగిరి పడుతున్నట్లు చూడటం అదో ధ్రిల్లు! తరువాత వాసన వచ్చేవి
(స్మెల్లీస్), తెర మీద కాఫీ కప్పు కనబడగానే కాఫీ వాసన, పూల
తోట ఐతే పూల వాసన వచ్చేటట్లు కనుక్కున్నారట గాని ఆ
ప్రయోగం సఫలమైనట్లు అగుపించలే. ఈ వార్త విన్నఒకాయన
మన సినిమాలు కొన్ని ఎప్పటినుంచో కంపు కొట్టడం ప్రారంభించాయి
కదా అని చమత్కరించారట. ఇప్పుడు ధియేటర్లు మారిపోయాయి.
పూర్వం చిన్న ఊర్లలో టూరింగ్ టాకీసులుండేవి. ఇప్పుడేమో చిన్న
ఊర్లలో కూడా DTS ధియేటర్లు వచ్చాయి. ప్రతి సినిమా ఇప్పుడు
రంగుల్లోనే తీస్తున్నారు. మొదట మన తెలుగు సినిమాలు (తమిళ,
హిందీ సినిమాలు రంగుల్లో రావటం మొదలయ్యక కూడా) తెలుపు
నలుపుల్లోనె వచ్చేవి. తమిళ సినిమాలకు శ్రీలంక, మలేసియా మొii
దేశాల్లో మార్కెట్ వుండటం చేత కలర్ ఫిల్మ్ దిగుమతికి అనుమతి
దొరకటమే అందుకు కారణం. మా చిన్నప్పుడు సినిమాలలో కొన్ని సీన్లకు
హండ్ కలరు వేసి విడుదలచేసేవారు. అటు తరువాత కొన్ని పాటల
దృశ్యాలను కలరులో చిత్రీకరించడం మొదలయింది. ఆ సినిమాల
టైటిల్ క్రింద partly color అని వ్రాసేవారు. పూర్తి రంగుల్లో స్కోప్
లో తీస్తున్న కొత్తలో SCOPE & COLOR అని వేయడం మీరు
గమనించే వుంటారు ఇక పేర్లలో కూడా అప్పటికి ఇప్పటికి పెను
మార్పులొచ్చాయి ఒక నాడు మంచివాడు,కలసి వుంటే కలదు
సుఖం,మంచిమనిషి,మంచిమనసులు,బంగారుబాబు లాటిపేర్లు
వుంటే ఈనాడు, బద్మాష్,కేడీ, రాస్కేల్,లాంటి పేర్లు వుంటున్నాయి.
ఆ రోజుల్లోను శ్రీలక్ష్మమ్మ లాంటి చిత్రాల్లో కస్తూరి శివరావు చేత
అప్పడాలకర్ర అనే అసభ్య పాటను పాడించినా ఆ తరువాత తొల
గించారు.ఇటీవలి చిత్రాల్లోని హాస్యంఅంతకంటే వెగటు పుట్టిస్తున్నది.
అన్నట్లు గురుదత్ నిర్మించిన "కాగజ్ కా ఫూల్" బ్లాక్ అండ్
వైట్ లో తీసిన మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం. చివరిగా ఓ
సినిమా జోకు..... " సినిమా కధ"
ఒక నిర్మాత కధల కోసం ప్రకటన చేశాడు. ఒక రచయిత
కధ యిచ్చాడు.
"అద్భుతంగా ఉంది.కొత్తగా ఉంది.ఉషారుగా ఉంది." అన్నాడు
నిర్మాత అది చదివి.
"అయితే మీ పిక్చరుకి దీన్ని తీసుకుంటారా?"
"అబ్బే వొద్దండి.ఇంతవరకూ ఇలాటి కధ ఎక్కడా రాలేదు.
ఎవరూ పిక్చరు తియ్యలేదు !"
( ముళ్లపూడి వారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో)
1960 సంII వరకు రాజమండ్రిలో హిందీ సినిమాలకు హాల్లో
ఓ మనిషి డైలాగులకు తన స్వంత కవిత్వం జోడించి తెలుగులో
చెప్పేవాడు. మైకు లేకుండా గట్టిగా ఎలా మాట్లాడే వాడో అదో
చిత్రం ఆ రోజుల్లో! అటుతరువాత ఈ అనువాదం పద్ధతి తీసేసారు.
అటు తరువాత పరభాషా చిత్రాలను తెలుగులో డబ్ చేయడం
మొదలయింది. రాజ్ కపూర్ నిర్మించిన "ఆహ్" చిత్రాన్ని "ప్రేమ
లేఖలు" పేరిట తెలుగులో డబ్ చేశారు. మాతృకలో విషాదాంతం
అయిన ఈ కధను తెలుగులో సుఖాంతం చేశారు. తెలుగు
సంభాషణలనుపాటలను ఆరుద్ర వ్రాశారు. పాటలను ఎయమ్.
రాజా ,జిక్కీ పాడారు. పందిట్లో పెళ్ళవుతుంది, ఘల్లుఘల్లు
గజ్జెల సంగీతం, పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ
ముఛ్ఛటలోయి పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
0 comments:
Post a Comment