RSS
Facebook
Twitter

Sunday, 31 October 2010

నిజ జీవితంలో హాస్యం!!



హాస్యం ఎక్కడినుంచో పుట్టదు. మనం రోజూ చూస్తున్న మన
చుట్టూ వున్న జనం నుంచే పుడుతుంది. మేం బాంకులో
పని చేసే రోజుల్లో బాంకవగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మితృ
లంతా పుష్కర్ ఘాట్ దగ్గర వున్న "పంచవటి" హోటల్లో
కాసేపు గడిపేవాళ్ళం ప్రొప్రయిటర్ విశ్వేశ్వరరావు కూడా
మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పే వారు. అప్పట్లో రాజమండ్రి
పరిసారార్లో ఏ సినిమా షూటింగ్ జరిగినా హిందీ తారలు,
తెలుగు తారలు అక్కడే దిగేవారు. ఒక సారి ఓమితృడు
విశ్వేశ్వరరావుని "ఏమండీ, మీ కస్టమర్లని వాష్ బేసిన్
కడగమని మరీ బోర్డు పెట్టడం ఏం బాగుంది?" అంటూ
అడిగాడు. అలా ఎక్కడ పెట్టామండీ? అన్నాడాయన.
"ఇదుగో చూడండి! ఇక్కడ ఏం బోర్డుందో! "వాష్ బేసిన్"
అంటే కడగమనే కదా, అర్ధం" అనగానే ఆయన విరగబడి
నవ్వాడు. మరో సారి టిఫిన్ చేసి హోటల్ పోర్టికోలో
నిలబడ్డాం. ఎస్సెస్వీ.సుబ్బారావనే మా కొలీగ్ ఫోల్డింగ్
చెయిర్ కొని వెంట తెచ్చుకున్నాడు. కష్టమర్లు తిరుగు
తుండే ఆ బిజీ పోర్టికోలో మధ్యగా దారికి అడ్డంగా తన
కొత్త కుర్చీ వేసుకొని కాలిమీదకాలు వేసుకూర్చున్నాడు.
నేను " అదేమిటి, సుబ్బారావు ,దారిలో కూర్చున్నావు.?
ఎవరైనా చూస్తే బాగుండదు కదా?" అన్నాను. "ఎందుకు
బాగోదు? నా కొత్త కుర్చీ, నా ఇష్టం" అన్నాడు. "ఐతే ఎదురుగా
వున్న ఆ రోడ్డు మీద ఇలా కూర్చోగలవా?" అనగానే "ఎంత
పందెం?" అని కుర్చీ తీసుకొని రోడ్డుకు సెంటర్లో వేసుకొని
కూర్చొని ,కుర్చీ తీసుకు వచ్చి మళ్ళీ వచ్చి పోర్టికోలో
కూర్చున్నాడు ఆ రోడ్డు కూడలి. అటు కోటగుమ్మం వైపు
నుంచి, గోదావరి బండ్ నుంచి పెద్దఆంజనేయస్వామి గుడి
వైపుగా వచ్చే బిజీ దారి. ఇలా ప్రాక్టికల్ జోకులు వేసుకొనే
వాళ్ళం. నేను ఆఫీసర్ అని వాళ్ళు ఎవార్డు స్టాఫ్ అనె తేడా
వుండేది కాదు. ఆ రోజులు అలా హాపీగా బ్యాంకులో గడిచాయి.
అసలు సిసలైన ఓ ప్రాక్టికల్ జోకుతో ముగిస్తా. నన్ను బ్రాంచి
మేనేజర్ గా ప్రొమోట్ చేసి కోనసీమలోని ఓ బ్రాంచికి వేశారు.
బ్రాంచి ఎలా వుంటుందో చూద్దాము రండి అంటూ మా కొలీగ్
కేయస్.వెంకటేశ్వర రావు నన్నో రోజు ఉదయాన్నే స్కూటర్
మీద ఆ ఊరికి తీసుకు వెళ్ళాడు. బ్రాంచికి వెళ్ళి బియమ్
రెసిడెన్స్ బ్రాంచి మీదే కదా అని ఇద్దరం వెళ్ళాము. బియమ్
అబ్బాయి వచ్చి" మీరెవరండీ?"అని అడిగాడు. మా కేయస్
"ఇన్నీస్పేట(రాజమండ్రి లో ఓ బ్రాంచి) నుంచి వచ్చాము "అని
చెప్పమన్నాడు. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి ఏం చెప్పాడో
కాని, వెంటనే మాకు రాచమర్యాదలు ప్రారంభమయ్యాయి.
ఇంట్లోవాళ్ళంతా కంగారుపడటం మాకు తెలుస్తూనే వుంది.
కొద్ది సేపట్లొనే వేడి వేడి టిఫినీలు, కాపీలు వచ్చాయి. తరువాత
ఆ బ్రాంచి మేనేజరుగారు నీట్ గా తయారయి బయటకు వచ్చి
మమ్మల్ని చూసి ఆశ్చర్యపడి, వెంటనే లేచి సర్దుకొని,"మరి మా
అబ్బాయితో అలా చెప్పారేం?" అన్నాడు. "ఏం చెప్పాడండి,మీ
అబ్బాయి" అని ఒకే సారి అడిగాం. " మీరు బాంకు ఇన్సెపెక్టర్సు
అని చెప్పారటగా?" అన్నాడు. అప్పుడు మాకు అర్ధమయింది !
రాచమర్యాదలు అన్నీ ఎందుకు చేశాడో! మేమన్నాం"మీ వాడు
సరిగా విని వుండడు.మేం ఇన్నీస్పేట నుంచి వచ్చాం" అని చెప్పా
మన్నాము.ఆయన మరో సారి ఆశ్చర్యపడ్డాడు!. తరువాత ఆయన
వాళ్ళ అబ్బాయికీ మర్యాద బాగా చేసి వుంటాడని అనుకున్నాం.
ఇది 1983 సంవత్సరం లో జరిగింది.ఇన్నేళ్ళు గడిచినా ఆ
నాటి విషయాన్ని తలచుకొని నేనూ, మా కేయస్ తెగ నవ్వు
కుంటాం!! ఇప్పుడా "పంచవటి"హోటల్ లేదు.ఐనా అటువేపు
వెళ్ళినప్పుడల్లా ఆనాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి.!

Saturday, 30 October 2010

సుందరకాండ సుభాషితాలు







ఒక్కసారిగా సినిమాలనుంచి ఆధ్యాత్మిక విషయాలలోకి
దూకానని అనుకోకండి. రామాయణం ,ముఖ్యంగా సుందర
కాండ చదువుతుంటే ఈ నాటి యువతీయువకులు
తెలుసుకోవలిసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు
ఎన్నో ఎదురుపడతాయి! మా నాన్నగారి చిన్ననాటి
మితృలు శ్రీ శ్రినివాస శిరోమణి గారు రామాయణాన్ని
తేట తెలుగులోకి అనువదించారు. ఆంధ్రపత్రిక దిన
పత్రిక ఆదివారం అనుబంధమ్ లో వారం వారం ధారా
వాహికగా వెలువడేది.తరువాత పుస్తక రూపంలో
అనేక సార్లు ప్రచురించబడింది. నాకు నచ్చిన కొన్ని
సుందరకాండలోని మంచి మాటలను మీ ముందు
వుంచుతున్నాను
<<<<<<<<<<<<<<<<<<<<<


* ఏ పని చేయవలసిన పని, ఆ సమయంలో ఆ పని
చేయకపోయినట్లయితే సత్పురుషులకు కోపం
వస్తుంది.
* ఉపకారికి ప్రత్యుపకారం చేయడము సనాతన ధర్మము.
* ధర్మజ్ఞులకు, ధర్మజిజ్ఞాసువులకు అతిధి ప్రాకృతుడు
అయినప్పిటికిన్నీ పూజార్హుడు.
* హనుమంతునికి ఉన్నట్లు ధైర్యమూ, దూరదృష్ఠి,
మేధస్సూ,కార్యసాధన, సామర్ధ్యమూ ఎవడికి
ఉంటవో, వాడి పనులు ఏవీ చెడవు.
* ఆలోచనలేని దూతలు దేశకాల విరుద్ధముగా
ప్రవర్తిస్తే సూర్యోదయవేళ చీకట్లు పటాపంచలు
అయినట్లు, కాబోతున్న పనులు కూడా నాశనము
అయిపోతవి.
* శుభాశుభ స్థితులలో ఇంద్రియాల ప్రవర్తనకు మనస్సే
కారణము. మనస్సును బట్టే దేహేంద్రియాలు ప్రవర్తిస్తూ
వుంటవి.
* ఉత్సాహమే సర్వశుభాలకూ ఆధారము. ఉత్సాహమే
సర్వకార్యాలకు సాధనము. ఉత్సాహమువల్లే ఏ పని
అయినా సమకూరుతుంది.
* చనిపోవడం వలన (ఆత్మహత్య) అనేక దోషాలు వస్తవి.
జీవించి వుంటే ఎప్పటికైనా శుభాలు సంప్రాప్తము
అవుతవి.
* స్త్రీలకు ఆభరణాలకన్నా ఆభరణమైన వాడు భర్త.
* ప్రవాహములో కొట్టుకుపోయిన నీళ్ళు తిరిగి రావు.
అట్లాగే గడిచిపోయిన యౌవ్వనము తిరిగి రాదు.
*కృతఘ్నులు మాత్రమే స్నేహాన్ని విస్మరిస్తారు.
* బ్రతికి వుంటే నూరు సంవత్సరాలు అయిపోయిన
తరువాతను అయినా సంతోషము అనుభవించ వచ్చును.
* జఠరాగ్ని దీపనము ఎంత వున్నపటికినీ విషము
కలిపిన అన్నము తిని, జీర్ణము చేసుకొని జీవించి
వుండటము అశక్యము.
* కోపము రేగినప్పుడు నిప్పును నీళ్ళతోవలె కోపాన్ని
తన బుద్ధిబలముతో చల్లార్చుకోవలయును.
ఈ రోజు శనివారం.హనుమంతునికి ఎంతో ప్రీతి
పాత్రమైన రోజు. హనుమానుని వేషంలో వున్న
ఈ చిన్న వాడు మా దౌహితృడు చిరంజీవి కౌస్తుభ్
(ముంబాయి).బాపు గారు గీసిన హనుమంతుని బొమ్మలు
Inter Culture Asociates,Thompson,Connecticut,
U.S.A వారి కోసం సంస్కృతి ఇంటర్నేషనల్ ,మద్రాసు
వారు ఇంగ్లీషు,ఫ్రెంచి,శ్పానిష్ భాషలలో ప్రచురించిన
రామాయణం పుస్తకం సౌజన్యంతో. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణ గారు ఈ రామాయణాన్ని తెలుగులో
వ్రాశారు.శ్రీ బాపు అసలు సిసలు తెలుగు చిత్రకళ అయిన
కలంకారీ రీతుల్లో బొమ్మలు వేశారు.


Friday, 29 October 2010




ఒక సారి శ్రీ బాపూగారిని కలిసినప్పుడు మీ కార్టూన్
ఐడియాలు చాలా బాగుంటాయి అని నే నంటే ,"మన
చుట్టూ వున్న జనాల్ని బాగా పరిశీలిస్తే మీకూ ఐడియాలు
అవే వస్తాయి" అన్నారు.
మా ఇంటికి ఎదురుగా డాక్టర్.రాఘవమూర్తిగారి హాస్పటల్
వుంది. గత 35 ఏళ్ళ పైగాఆయన మా కుటుంబ ఆప్త మితృలు.
ఆయన అబ్బాయి డా.కృష్ణ మంచి పీడియాట్రిస్ట్. మాపిల్లలు
ఆయన పిల్లలు స్నేహితులే! డాక్టర్ గారు పేషేంట్లతో
ఎంత బిజీగా వున్నా ఆయన రూమ్ లోకి స్టాఫ్ నన్నువెంటనే
పంపిస్తారు. రకరకాల పేషెంట్లు, వాళ్ళు డాక్టర్ తో మాట్లాడే
తీరు భలే తమాషాగా వుంటుంది! ఇక డాక్టర్ గారు కూడా
వాళ్ళతో జోకులేస్తూ మాట్లాడుతుంటారు. ఇక నాకు ఐడియాలకు
లోటెక్కడ చెప్పండి. ఈ పై కార్టూన్లన్నీ కన్సల్టింగ్ రూమ్ లోంచి
పుట్టినవే!! కొందరు తమ కంప్లైన్ట్స్ ను విచిత్రం గా చెబుతుంటారు.
తలనొప్పి వస్తున్నది అని చెప్పటానికి డాక్టరుగారూ "విపరీతమైన
హెడ్ అటాక్ అండీ"అంటాడు ఒకడు. హార్ట్ పెయిన్ని అటాక్ అంటారు
కాబట్టి తల నొప్పికి కూడా "హెడ్ అటాక్" అని కొత్త మాటను
సృష్టించాడన్న మాట! ఇంకో పేషెంట్ " కుడి వైపు కిడ్నీ వాచిందండీ"
అన్నాడు. స్కాన్ తీయించుకొన్నావా? ఎలా తెలిసింది? అని ఆయన
అడిగితే ఎందుకండీ, బైటకు కనిపిస్తున్నది కదా అని జవాబు.
ఇలా ఎన్నెన్నో! స్కిన్ ఎలర్జీ కీ ఆయింట్మెంట్ రాస్తాననగానే
చొక్కా ఎత్తేసే ఆయనొకడు. వెంటనే"ఆగాగు నే వ్రాస్తానన్నది చీటీ
మీద కొనుక్కొని ఇంటి దగ్గర రాసుకో" అని డాక్టర్ గారు చొక్కా
దింపించేశారు.
మరో మాట మా డాక్టరు గారికి సినిమాలన్నా, పుస్తకాలన్నా
చాలా ఇష్టం. పాత సినిమాల గురించి ఏదడిగినా వాటి వివరాలు
కరెక్ట్ గా చెప్పెస్తారు. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటికి
వచ్చి పజిల్స్, సినిమాల విషయాలు చెబుతూ నాతో గడుపుతారు.
పిల్లంతా దూరంగా వున్నా మేం ఇంత ధైర్యంగా వుండ గలుగు
తున్నామంటె ఆయన స్నేహమే! ఒంట్లో నలతగా వున్నా ఉదయాన్నే
ఆయన్ని చూడగానే మామూలైఫొతాము. మా పిల్లలు కూడా వాళ్ళ
పిల్లలను అక్కడి డాక్టర్ల దగ్గరకు తీసుకొని వెళ్ళినా " అంకుల్" అంటూ
ఫోన్ చేస్తారు. ఆయనకు ఫోన్ చేస్తే త్వరగా తగ్గుతుందని వాళ్ళకో సెంటిమెంట్!
ఆయననవ్వుతూ అంటుంటారు." పూర్వం ,పాముల నర్శయ్య గారని వుండే
వాడు. ఫాము కరిస్తే ఆయనకు ఫోన్ చేస్తే తగ్గిపోయేదట! అలా వుంది
వీళ్ళ నమ్మకం" అని. ఇవండీ ఈ రోజు సరదా డాక్టర్ కార్టూన్ కబుర్లు..

Thursday, 28 October 2010



గతంలో సినిమా విడుదలకాగానే ఆ సినిమా పాటలపుస్తకాలు
ఇంటర్వల్లో హాల్లో అమ్మేవారు.అందులో సినిమా పాటలు, ముందు
పేజీలో కధ వేసేవారు. కధ చివర మిగిలిన కధ మా వెండితెరపై
చూడండి అని వ్రాసేవారు. ఇప్పుడు ఆ సినిమా ఫాటల పుస్తకాలు
రావటం చాలా ఏళ్ళ నుంచే ఆగిపోయింది. బహుశ: వేయటానికి
ఇప్పటి సినిమాల్లో కధ, వేయ తగ్గ పాటల సాహిత్యం లేదని కావొచ్చు.
పాటల్లో అర్ధవంతమైన మాటలేవి? మొట్టమొదటి సారిగా అన్నపూర్ణా
వారి "తోడికోడళ్ళు" చిత్రానికి వెండితెర నవలవెలువడింది. అటు
తరువాత అన్నఫూర్ణా చిత్రాలతో బాటు కొన్ని చిత్రాలకు వెండితెర
నవలలు ప్రచురించడం మొదలయింది. శ్రీ ముళ్లపూడి వెంకట
రమణ "వెలుగు నీడలు", "ఇద్దరు మితృలు" చిత్రాలను నవలీక
రించారు. శ్రీ బాపు చిత్రించిన సినిమా దృశ్యాలు వాటికి మరింత
ఆకర్షణగా నిలిచాయి. "ఇద్దరు మితృలు" నవల పుస్తకం పేజీల
పై భాగాన ఇద్దరు నాగేశ్వరరావులు కరచాలనం చేసుకుంటున్న
ఫొటోలు ఒక్కొక్క ఫ్రేమును వరుసగా ముద్రించారు.పుస్తకం
చేతిలో పట్టుకొని పేజీలు గబగబా వదులుతుంటే ఇద్దరు షేక్
హాండ్ చేసుకుంటూ కదిలేవి! దురదృష్ట వశాత్తూ ఆపుస్తకాలు
నా దగ్గరనుంచి చేజారి మళ్ళీ నాకు చేరలే! హాసం బుక్స్ వారు
"ఇద్దరుమితృలు" పుస్తకాన్ని పున ర్ముద్రించారు కాని కదిలే
బొమ్మలు లేవు.ఇటీవలే జూనియర్ యన్టీఆర్ నటించిన "యమ
దొంగ" పాటల సీడీ తో బాటు కదిలే బొమ్మల స్టిల్స్ తో ఓ పుస్తకం
ఉచితంగా ఇచ్చారు. ఈ ప్రయత్నం చాలా బావుంది.
ఆంగ్ల చిత్రాలకు కూడా వాటి ఫొటో స్టిల్స్ తో బొమ్మలకధల
రూపంలో పుస్తకాలు వెలువాడ్డాయి. STAR TREK II,The
wrath of Khan photo story, CLOSE ENCOUNTERS
of the third kind, photo novel గా వచ్చాయి. ఇందులో
చిత్రాల్లోని స్టిల్స్ వరుసగా వేసి బొమ్మల కధ రూపంలో(కామిక్స్)
వచ్చాయి. అలానే James Bond "A VIEW to KILL",
"STAR TREK IV ,the voyage home, మాగజైన్స్ రూపంలో
విడుదలయ్యాయి. "మగధీర" చిత్రం లోని స్టిల్స్ తో ఇలా ఓ ఫొటో
నవల తెలుగులో వేస్తే బాగుంటుంది. ఇదివరలో చిరంజీవి సినిమాలు
విడుదలయినప్పుడు ఇలా ప్రత్యెకంగా మాగజైన్స్ రూపంలో వేసినట్లు
గుర్తు. 2000,2007లలో మల్లీశ్వరి,మాయాబజార్ చిత్రాల నవలలు
విడుదలయ్యాయి.

Wednesday, 27 October 2010

ఈ శీర్షికను చదివి కొందరు తెలుగు వాళ్ళు నాపై
కోపగించుకోవచ్చు.వీడికి ఇదేమి తెగులని,తెలుగు వాళ్ళని
ఇలా అవమానిస్తాడా అనీ అనుకోవచ్చు. కానీ మన (వి)
నాయకులు మన రాజధానిలోని "తెలుగు లలిత కళాతోరణం"
లోని తెలుగు అన్న పదాన్ని తొలగించి దానికి "రాజీవ్ లలిత
కళాతోరణం" అని నామకరణం చేయాలని నిర్ణయించి
నప్పుడు ,కనీసం మనసులోనైనా బాధ పడ్డ తెలుగువాళ్ళు
ఎంతోమంది వుంటారు! "గాయం" సినిమాలో సిరివెన్నెల
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని" అన్న పాట వ్రాసారు.
కానీ అయన "జనాల్ని" అన్న పదం ముందు "తెలుగు" అన్న
పదాన్ని చేరిస్తే బాగుండేది. ఏమంటే జనాలు అనగానే
దేశం లోని అన్ని రాష్ట్రప్రజలూ వస్తారు. భాష పేరును
తొలగించే సాహసం మరో ఏ రాష్ట్రంలోనైనా చేస్తారా!! మన
పిల్లలకే తెలుగు పూర్తిగా రాదు. ఇక వాళ్ళ పిల్లలకు తెలుగేం
తెలుసు, తెలుగంటె వాళ్ళకు అలుసు తప్ప!. కొన్ని స్కూళ్ళల్లో
తెలుగు మాట్లాడారని పిల్లల్ని శిక్షిస్తే మన చానళ్ళు హడావిడీ
చేశాయి. మనకుఅలవాటే. మనం,ఆ చానల్లు ఆ విషయాన్ని,
తరువాత ఏం జరిగిందో అప్పుడే మర్చే పోయాం తెలుగుదేశం
హయాం లో ఎన్టీఆర్ తెలుగు పేర్లు పెడితే "తెలుగుతెగులు"
అని మనవాళ్ళే గేళి చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా
వుండగా కోనసీమ ప్రాంతంలోని అక్విడెక్ట్ కు డోక్కా సీతమ్మ
గారి పేరు పెట్టారు. నెహ్రూ ప్రారంభించిన నాగార్జున డామ్
అదే పెరుతోవుంది. ఏమో డామ్ పేరునూ మార్చినా ఆశ్చర్య
పోనవసరం లేదు. ఇప్పటికే పనులు పూర్తిగా ప్రారంభించని
పోలవరం ప్రాజెక్ట్ ను ఇందిరా సాగర్ అని పిలవడం మొదలయింది.
ఓ డామ్ పేరు వింటే అది ఏ ప్రాంతంలో వుందో తెలియవలిసిన
అవసరం లేదా? గోదావరిపై రాజమండ్రి లో నిర్మిస్తున్న మూడవ
వంతెనకు రాజీవ్ పేరు తగిలించారు. అంతదాకా ఎందుకు, రాజమండ్రి
ని "రాజీవమండ్రి" అని పేరు మార్చితే ఓ పనైపోతుంది.!! తెలుగుప్రజలందరం
ఏకమై ఇకనైనా మేలుకొని తెలుగు భాషను కాపాడుకొందాం!లేకుంటే
"తెలుగుజాతి మనదీ నిండుగ వెలుగు జాతి మనదీ"అని కనీసం
పాడుకోడానికైనా "తెలుగు" మిగిలి వుండదేమో,మన తెలుగు వాళ్ళకు!!

Tuesday, 26 October 2010

స్వరరాజేశ్వరం



శ్రీ ఎస్.రాజేశ్వరరావు 1936 లో నటుడిగా గాయకుడిగా
చిత్ర సీమలోకి ప్రవేశించారు ఆయన చిత్రరంగంలో చివరి
వరకూ అగ్ర సంగీత దర్శకుడిగానే వెలొగొందారు.జెమినీ
నిర్మించిన "చంద్రలేఖ" చిత్రం ఆయన్ని ఏ రకమైన సంగీత
మైనా అందించగల సంగీత దర్శకుడిగా భారతదేశమంతటా
పేరు సంపాదించిపెట్టింది. లలితగీతాల గాయకుడిగా రాజేశ్వర
రావు ఆలపించిన"తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని
చెప్పవే నామాట రాచిలుక తోడ", "పాట పాడుమా కృష్ణా"పాటలు
బహుళ ప్రాచూర్యాన్ని పొందాయి. "పాటపాడుమా కృష్ణా"
అనే పాట మీద శ్రీ బాపు రాజేశ్వరరావుగారిపై అద్భుతమైన
కార్టూన్ వేశారు. ఆయన 1940 లో నెలకు ఆరువందల
రూపాయలజీతంతో ,19 ఏళ్ళ వయసులో జెమినీలో చేరారు.
జెమినీ నిర్మించిన "చంద్రలేఖ" లోని డ్రమ్స్ డాన్స్ కు సంగీతం
కూర్చడానికి దాదాపు ఒక ఏడాది పట్టిందట. ఆ చిత్ర నిర్మాణ
సమయానికి రాజేశ్వరరావు జీతం రూ1500/-.జెమినీలో
"జీవన్ ముక్తి" , "బాలనాగమ్మ","మంగమ్మ శబదం"," చంద్ర
లేఖ" చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. జెమినీలో
ఆయన చేసిన ఆఖరి సినిమా"అపూర్వ సహోదరగళ్"
బి.యన్.రెడ్డి గారి "మళ్ళీశ్వరి" సినిమాతో రాజేశ్వరరావుగారు
ఎదురులేని సంగీత దర్శకులుగా నిలిచారు. "నందనార్",
"కణ్ణామ్మా ఎన్ కాదలి", "దాసి అపరంజి","విక్రమాదిత్యన్",
"ప్రేమపాశం","పానై పిడిదవిల్ బాగ్యశాలి""అవళ్ యార్"
మొదలైన తమిళ చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం
వహించారు. హేమంత్ కుమార్ సంగీత దర్శకత్వంలో
ఏ.వి.యం వారు "మిస్ మేరీ" హిందీలో(మిస్సమ్మ) నిర్మించినప్పుడు,
రాజేశ్వరరావు అనుమతితో "బృందావనం అందరిదీ" పాట
ట్యూన్ ను ఉపయోగించారు. రాజేశ్వరరావు అన్నపూర్ణా వారి
చాలా చిత్రాలకు సంగీత సారధ్యం వహించారు. "అమాయకురాలు"
సినిమాలో శ్రీ రావి కొండలరావు సంగీతం మస్టారుగా నటించినప్పుడు
రాజేశ్వరరావు ఆయనకు గాత్ర దానం చేశారు!! రాజేశ్వరరావు
శాస్త్రీయ సంగీతంతో బాటు విదేశీ సంగీతాన్నికూడా అద్బుతంగా
మెలొడీగా చేయగల ప్రతిభాశాలి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోటి,
వాసూరావు ఆయన పుత్రులు. ఈ నాడు ఆ మహామహుడి
వర్ధంతి (26,అక్టోబరు) సందర్భంగా అశేష సంగీతాభిమానులందరి
తరఫున ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాను.

Monday, 25 October 2010

తీపి కబుర్లు



" ఏ దైనా స్వీట్ చేయొచ్చు కదా?" అన్నాను శ్రీమతితో.
"ఎలా చేస్తానండీ, షుగరు లేదు కదా" అంది వెంటనే.
" అందుకే కదా స్వీట్ చెయ్యమన్నది" అని అనగానే,
"చూడబొతే మీకు రాను రాను చాదస్తం ఎక్కువవు
తున్నట్టుంది, షుగరు లేకుండా స్వీట్ ఎలా చేస్తారండీ"
అంది.
"షుగరులేదు కదా" అన్న నాభావం మన ఒంట్లో లేదు
కదా అని. ఆవిడ చెబుతున్నది ఇంట్లో షుగరు అయి
పోయిందనిట!!
ఎన్ని సార్లు చెప్పినా మా శ్రీమతి వంటింట్లో ఏ సరుకైనా
ఆఖరి చెంచా వరకూ చెప్పదు. మా పిల్లలు ఓ బుల్లి
స్క్రిబిలింగ్ పాడ్ ,ఓ బాలు పెన్నూ కిచెన్లో వుంచి ఏదనా
ఐపోగానె నోట్ చేసుకోమని చెప్పారు. కానీ షరా మామూలే.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
కొన్నిట్లో షుగరు, (ఇక నుండి తెలుగులో పంచదార అనే
అందాం.కొంతమంది చక్కెర అని కూడా అంటారు.) వెయ్యక
పోయినా బాగుంటుంది. ముఖ్యంగా కాఫీ లో పంచదార
ఎంత తక్కువ వుంటె అంత రుచిగా వుంటుంది. అదే టీ
అనుకోండి, చేదుగా బాగుండదు. పంచదార,బెల్లం ఒకే
చెరకు నుండి తయారయినా వాటి రుచి తీపే ఐనా పంచదారకే
ప్రాముఖ్యం ఇస్తారు. బెల్లం తో చేసిన లడ్డు అంటే అదేమిటో
చిన్నచూపు. కాని కొన్నింటిని బెల్లంతో చేస్తేనే రుచి.ముఖ్యంగా
మినపసున్ని. పంచదారతో కన్నా బెల్లం కోరిచేసిన రుచే వేరు,
అలానే కొబ్బరికోరు,బెల్లం కలిపి చేసే కొబ్బరి లౌజు పేరు
వింటేనే నోరూరిపోతుంది.మా చిన్ననాటి రోజుల్లో మిఠాయి
కొట్లలో పంచదార చిలకలు అమ్మే వారు. ఇప్పుడయితే స్వీట్
షాపులుకూడా మోడరన్గా మారిపోయాయి. అక్కడా ఈ మధ్య
పంచదార బొమ్మలు అగుపిస్తున్నాయి. రకరకాల బొమ్మలు
వివిధ సైజుల్లో దొరుకుతున్నాయి. పంచదారపాకం అచ్చుల్లో
పోసి వీటిని తయారుచేస్తారు. వేడుకల్లో వీటిని పంచుతుంటారు.
ఏదైనా తీపి కబురు చెబితే అది విన్న వారు ఆనందంతో చెప్పిన
వారి నోట్లో పంచదారపోసి నోరు తీపి చేయటం ఆనవాయితీ!
ఆనవాయితీగా ఓ సరికొత్త పాత జోకు>>>>>>
మీ హోటల్లో స్వీట్లు సరే ,ఎలాగో చల్లగా వుంటాయి.
మరి హాట్ గా ఏముండవా?
ఎందుకుండవు సార్! పొయ్యిలో నిప్పులున్నాయ్!
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
సంగీతం కూడా తియ్యనిదే! అందుకే కాబోలు తియ్యగా తియ్యగా
రాగం అన్నారు!!
మన తెలుగు భాషకూడా ఎంతో తియ్యని భాషైనా మన (వి)నాయకులు
మన తెలుగు కళాతోరణం నుంచి "తెలుగు" ని "తియ్య" కుండా వుండ
లేక పోతున్నారు.
ఇక తియ్యని కొన్ని తెలుగు సామెతలు చిత్తగించండి
పానకంలో (పంచదార/బెల్లం) పుడకలాగ.
చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు
చెరకు రసముకన్న చెలిమాట తీపిరా
బెల్లమున్న చోటే ఈగలు ముసిరేది
పెళ్ళాం బెల్లం తల్లేమో అల్లం!!
<<<<<<<<<<<<<<<<<<<<
యోగి వేమన ఈ మధురమైన పద్యం చెప్పారు
అనగనగారాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తీపినుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
మన సినీ కవులుకూడా మధురమైన పాటలు
ఎన్నో వ్రాసారు. శ్రీ కృష్ణసత్య చిత్రం లో పెండ్యాల సంగీత
దర్శకత్వంలో ఘంటసాల,జానకి పాడిన ఈ మధురమైన
పాటను శ్రీ సి.నారాయణరెడ్డి వ్రాసారు.ఆ పాటలో కొంత:
ప్రియా ప్రియా మధురం
పిల్లన గ్రోవి-పిల్లవాయువూ బలే బలే మధురం
అంతకుమించి ప్రియుని కౌగిలి
ఎంతో ఎంతో మధురం
ఇన్నీ వున్నా సరసిజలోచన సరసనవుంటేనే మధురం
మనసిచ్చిన ఆ అలివేణి అధరం మరీ మరీ మధురం
అవండీ నా తీపి కబుర్లు!!

Sunday, 24 October 2010

యశస్వీ.రంగారావు



విస్వనట చక్రవర్తి యస్వీ రంగారావు గురించి చెప్పటమంటే
అది సాహసమే. మాంత్రికుడిగా ఆయన "పాతాళభైరవి"లో
చేసిన అభినయనం , " సాహసం చేయరా ఢింభకా" అన్న
ఆ గంభీర స్వరం ఈ నాటికీ తెలుగు ప్రేక్షకుడి చెవిలో అలా
ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. తెలుగులోనే కాదు, తమిళ చిత్ర
సీమలో కూడా అయన కంఠస్వరం, ఉచ్చారణ తమిళులు
పలికినంత సహజంగా వుంటుంది. ఇలా తమిళాన్నిఅనర్గలంగా
మాట్లాడగలిగే నటిమణుల్లొ శ్రీమతి కన్నాంబ, శ్రీమతి సావిత్రి
పేర్లను చెప్పుకుంటారు. శ్రీ బాపు గారు తన కార్ట్యూన్లలో
ఇలా అంటారు.
క్లిష్ట పాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంక రంగారావు
హాయి గొలిపే టింగురంగారావు.....
ఇంత అందంగా సాగిపోతుంది ఇంకా వ్రాస్తూ చివరగా ఇలా
ముగిస్తారు!
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారావు.
ఆయన మొదటి చిత్రం బి.వి.రామానందం దర్శకత్వంలో వచ్చిన
"వరూధిని" ఆ సినిమా బాక్సా ఫీసు దగ్గర భంగపడింది.తరువాత
ఎస్వీయార్ చేసిన ప్రతి పాత్ర అపురూపమే. "మాయాబజార్" చిత్రం
లో అయన పోషించిన ఘటోత్గజుడి పాత్ర ప్రేక్షకుల విశేషఆదరణ
పొందింది. యముడి పాత్రలో ఆయన్ని చూసిన అప్పటి చైనా
ప్రధాని చౌ యన్ లై అబినందించారట. భక్తప్రహ్లాద లో హిరణ్య
కశిపుడు, కీచకుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు జీవంపోసారు.
పాండవ వనవాసం చిత్రం లో భీమ పాత్రధారి పద్యం, డైలాగు
చెప్పిన తరువాత దుర్యోధన పాత్ర ధరించిన యస్వీయార్,
"హ్! బానిసలు! బానిసలకింత అహంకారామా" అన్న ఒక్క
వాక్యంతో తన ప్రతిభను తెలుగు ప్రజలకు చూపించి కరతాళ
ధ్వనులందుకొన్నారు. ఇక సాంఘిక చిత్రాలలో ఆయన నటన
చిరకాలం తెలుగు సినిమాలోకం లో నిలిచి వుంటుంది.
కత్తుల రత్తయ్య మొదలైన చిత్రాలలో ఆయన వాడిన "గూట్లే",
"డోంగ్రే","బేవకూఫ్" లాంటి పదాలు ఆ రోజుల్లో బహుళ ప్రాచూర్యం
పొందాయి.నర్తనశాలచిత్రం లో ఆయన నటనకు తాష్కెంట్
చిత్రోత్సవంలో ఉత్తమ నటుడి బహుమానం అందుకోవడం
ప్రతి తెలుగు వాడికి గర్వకారణం.1974 జూలై 18న
ఆయన కీర్తీశేషులయ్యారు. తెలుగు జాతి గుండెల్లో ఆయన
చిరంజీవి.
ఈతరం హీరోలు బ్రాండ్ ఎంబాసిడరులుగా వివిధ సంస్థలకు
పనిచేస్తుంటే ఆ రోజుల్లోనే శ్రీ రంగారావు బర్కలీ సిగరెట్ కంపెనీ
ప్రకటనలలో తన ఆటోగ్రాఫుతో అగుపించేవారు!. అప్పటి సిగరెట్
కంపెనీ ప్రకటన మీరు పై బొమ్మలో చూడవచ్చు!!
* రేఖా చిత్రం బాపూగారి సౌజన్యంతో*

Saturday, 23 October 2010

శ్రీ శంకర్ గారి హాస రేఖలు!!




ఈ పెన్సిల్ పోట్రయిట్స్ చూసారుగా! వీటిని ఇంత అద్భుతంగా
గీసింది శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు. సత్తిరాజా, ఈ ఇంటి
పేరెక్కడో విన్నట్టుంది కదూ! నిజమే నండి.! ఆ ఇంటి పెరు గల
ఆంధ్రుల అబిమాన చిత్రకారుడు శ్రీ బాపు అనే సత్తిరాజు లక్ష్మీ
నారాయన. ఆయన తమ్ముడే ఈ శంకరనారాయణ గారు.
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక
ఆయన పోట్రైట్ చిత్ర రచనకు మరింత పదును పెట్టారు. ఆయన
ప్రముఖుల ముఖచిత్రాలను జీవకళ ఉట్టిపడేటట్లు చిత్రించారు.
అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్ నుండి జానీలీవర్ దాకా,
బాలసరస్వతి నుంచి బాలూ దాకా, బర్మన్ నుండి రెహ్మాన్ దాకా
ఎంతో మంది రేఖా చిత్రాలను శ్రీ శంకరనారాయణ వేశారు వాటిల్లో
కొన్ని మీరిక్కడ చూడొచ్చు. శ్రీ శంకరనారాయణ ముళ్లపూడి
వెంకట రమణ గారి వియ్యంకులు కూడా!! శ్రీ శంకర్ గీసిన బొమ్మలను
బాపు బొమ్మ.కామ్,తెలుగునిధి .కామ్, టోటల్ టాలీవుడ్.కామ్ లలో
చూడొచ్చు." హాసం బుక్స్" వారు "హాసరేఖలు" పేరిట దాదాపు
80 బొమ్మలతో ( హాస్య-సంగీత కళాకారులు) శ్రీ యస్వీ.రామారావు,
యమ్బీయస్.ప్రసాద్ పరిచయాలతో ప్రచురించారు
,

Friday, 22 October 2010

పొట్ట మీద పొట్టి కధ


మితృడు హనుమంతరావు తన హాస్యవల్లరి లో తన
పొట్టగురించి మన పొట్ట చెక్కలయేటట్లు వ్రాసింది చదివిన
తరువాత నాకూ పొట్ట గురించి కొన్ని కబుర్లు మీతో
చెప్పాలనిపించింది. ఐనా పొట్టగురించి ఎంతైనా వ్రాయ
వచ్చు. పెద్ద పొట్టగలవారికి ఏదైనా చిరుతిండ్లు తినాలంటే
వాళ్ళ పొట్టే ఓ చిన్నరకం టేబుల్లా ఉపయోగపడుతుందని
హనుమంతరావు చెప్పారు.నేను మాత్రం ఆయన అలా
తనపొట్టను టేబుల్ గా ఉపయోగించడం చూడలేదు కానీ
అప్పుడప్పుడూ ఆయన తన కళ్ళజోడును తీసి తన బొజ్జ
(పొట్టకు ముద్దు పేరు) మీద వుంచుకోవడం మాత్రం
చూశాను. లావుగా వున్న వాళ్ళందరికీ పెద్ద పొట్ట వుండటం
ఏమీ వింత కాదు. ఒక డాక్టరుగారు లావాటి పేషెంటును
లావు తగ్గడానికి వాకింగ్ చేయమంటే ,ఇంత ఒంటి బరువుతో
నడవలేను, వళ్ళు తగ్గాక నడవటం మొదలు పెడతానన్నాడట.
ఐనా లావుగా వున్నంత మాత్రాన అందం గా వుండరా? మహా
నటి సావిత్రి అద్భుతనటన ముందు ఆమె లావుగా వుందన్న
విషయాన్నిఎవ్వరూ పట్టించుకోలేదు. అలనాటి హాస్యజంట
లారెల్, హార్డీలలో హార్డీకీపెద్ద పొట్ట లేదా? పూర్వకాలంనాటి తెలుగు
సినిమాల్లో బొడ్దపాటి లాంటి బొద్దుగా వుండే హాస్యనటులుండే
వారు. "కీలుగుర్రం" సినిమాలో అనుకుంటాను అతనిచేత "నా
వళ్ళు బరువుకూ నే ఏడ్వవలెగాని పరులెందుకేడ్తురోరన్నా"
పాటా పాడించారు. ఇప్పుడు లావుగా పెద్దబొజ్జతో నున్నకృష్ణుడు
హీరోగా సినిమాలు వచ్చాయి. ఇక పొట్ట పొడిస్తే వాడికి
అక్షరం ముక్క రాదని చదువులో వెనకబడిన వాడిని అంటారు.
అలానే ఉద్యోగం లేని వాళ్లని పొట్టచేతబట్టుకు వచ్చాడంటారు.
ఇక తప్పుచేసిన వాళ్ళని వాడి పొట్టకొట్టడం ఎందుకని ఊరుకున్నా
అంటారు. శ్రీ జనార్ధనమహర్షి తన వెన్నముద్దలు పుస్తకంలో పొట్ట
పైఇలా చమత్కరించారు:
మార్నింగ్ వాక్ లు
తక్కువై అతనికి
ఈవినింగ్ వాక్ లు
ఎక్కువై ఆమెకి
.......
*కడుపొచ్చింది.!!
మరో చోట ఇలా అంటారు..
ఆవిడ అదోరకం
అన్నీ *కడుపులోనే
దాచుకుంటుంది
పిల్లాడికి ప్లేస్ లేక
గొడ్రాలు అయ్యింది.
అంటె పొట్ట (*కడుపు) మీద అందమైన కవిత్వాలు చెప్పొచ్చన్నమాట.
మనం చేసే ఉద్యోగమైనా, సినిమాల్లో తారలు,తారడులూ, స్టంట్ చేసే
వాళ్ళు అందరూ పొట్ట కూటి కోసమే కదా! పొట్టలు పెంచని రాజకీయ
నాయకులూ, పోలీసు వాళ్ళు (దొంగలు ఈజీగా తప్పించు
కోడానికి వాళ్ళ పొట్టలే ఎంతో మేలు చేస్తున్నాయి! ,అమెరికా పోలీసులూ
తక్కువ తిన లేదు!పెద్దపొట్టలే వుంటాయి) మనకి ఎక్కడా కనిపించరుకదా?!
సర్జనులు కూడా పేషెంట్ల పొట్టలు కోసి(వాళ్ళ రోగం కుదర్చడానికే) తమను,
వారి హాస్పటలు ఉద్యొగుల పొట్టలను పోషించుకుంటారు. ఎదుటి వాడు
పైకొస్తుంటే కొందరికి కడుపు మంటగా వుంటుంది. ఒంట్లో గాస్ ట్రబులున్నా
పొట్ట మండుతుంది. ఇంట్లో,వంటింట్లో గాస్ట్రబుల్ వచ్చినా ఆకలితో పొట్ట నక
నక లాడుతుంది కదా. ఇక తల్లులకు పిల్లలు ఎలాటి వాళ్ళయినా కడుపు
తీపి తప్పక వుంటుంది. పాపాయికి బువ్వ పెట్టి అమ్మ అనురాగంతో పొట్ట
నిమిరి " చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష " అని దీవెనలు అందిస్తుంది. పొట్టమీద
పొట్టి కధను ప్రారంభించిన నా చేత పెద్ద పొట్ట కధ రాయించిన నా ప్రియ
మితృడు మా హాసం హనుమంతరావుకు శుభాభినందనలతో.
.

Thursday, 21 October 2010

ఇ.వి.వి. కొంటె సమాధానాలు !
!

దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణగారిని మీదే దేశం అని అడిగితే
"నవ్విస్తాన్" అంటారేమో!! ఆయన హాస్యం కాస్త మోటుగా వుండొచ్చేమో
గాని ఆయన తీసిన హాస్య చిత్రాలంటే మోజు పడే వారే ఎక్కువ.ఇంతకు
ముందు నా బ్లాగులో పరిచయం చేసిన "వెన్నముద్దల" జనార్దనమహర్షి
గారు "హాసం" పత్రిక కోసం ఇ.వి.వి.ని ఇంటర్వ్యూ చేస్తూ కొన్నిప్రశ్నలు
అడిగితే ఆయన ఇచ్చిన తుంటరి సమాధానాలు, మీకోసం
.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
? మీ పుట్టిన రోజు?
* జూన్ పది
? ఏ సంవత్సరం?
* ప్రతి సంవత్సరం
? ఎందుకు పుట్టారు?
*మా ఆవిడ్ని కట్టుకుందామని...మంచి సినిమాలు తీసి పదిమందినీ
ఆ కట్టుకుందామని.
? ఏం చదివారు?
* ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి
? సినిమా ఫీల్డ్ కు ఎందుకు వచ్చారు?
* ’ఫీల్డే’ కదా దున్నేద్దామని.
? పెళ్ళెందుకు చేసుకున్నారు?
* ఆర్యన్ ని, నరేష్ ని కందామని
? వాళ్ళనెందుకు హీరోలను చేసారు?
* చేతిలో ఎప్పుడూ ఇద్దరు హీరోలుంటారని
? మీ తొలి చిత్రానికి "చెవిలో పువ్వు" అని ఎందుకు పెట్టారు?
* నాకు పెడతారని తెలీక...
? మీ రెండో చిత్రానికి "ప్రేమ ఖైదీ" అని ఎందుకు పెట్టారు?
* ప్రేక్షకుల గుండెల్లో ప్రేమఖైదీ అవ్వాలని.
? మీరు ప్రతిసినిమాకి ఫారిన్ ఎందుకెళతారు?
* పగలు షూటింగ్,నైట్ షాపింగ్స్..చేసుకుందామని.
? మీరెవరైనా హీరోయిన్ని గిల్లారా?
* రెండు మూడు సార్లు టైటానిక్ హీరోయిన్ని గిల్లాను (కలలో)
? కలలో సరే, మరి ’లోకల్’లో?
* ఆ ఒక్కటీ అడక్కు
? "ఏవండీ..ఆవిడొచ్చింది" అని ఎవరి గురించైనా మీతో మీవాళ్ళన్నారా?
* ప్రతి రోజూ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటూనే ఊంటారు-హీరోయిన్స్
వచ్చినప్పుడు.
? మీకెలాంటి కధలంటె ఇష్టం?
* మా ఆవిడకి చెప్పే కట్టు కధలు.
? మీకు ఎలాటి సినిమాలంటే ఇష్టం?
* వందరోజుల సినిమాలంటే
? ఖాళీ టైములో ఏం చేస్తుంటారు?
* ’ఖాళీ’గా ఉంటాను.
? మీరు చాలా సినిమాల్లో "తాళి"ని తెంచారు..కామెంట్?
* పదికాలాలపాటు తీసినోడి,కొన్నోడి భార్యమెడలో "తాళి" పవిత్రంగా
ఉండాలని.
? మీరు నిర్మాత ఎందుకయ్యారు?
* ఇ.వి.వి ని డైరెక్టరుగా పెట్టుకుందామని.
? మీకు నచ్చిన నిర్మాత?
* నా ’రామానాయుడు’ గారు.
? మీకు నచ్చిన హాస్యనటుడు?
* మా "అప్పుల అప్పారావు"
? మీకు నచ్చని వాళ్ళు?
* బ్రేక్ టములో వచ్చి నిద్ర పోనివ్వని వాళ్ళు.
? మీకు నచ్చేవాళ్ళు?
* రికార్డు బ్రేక్ చేసే సినిమాలు తీసి నిద్రపోనివ్వని వాళ్ళు.
? మీ కిస్టమైన ప్లేస్?
* స్పేస్
? మీ కిస్టమైన పండు?
* చింతపండు
? మీకిస్టమైన దేముడు?
* నాతో సిన్మాతీసే ప్రతి ప్రొడ్యూసర్ దేముడే
? మగాడికి పెళ్ళి అవసరమా?
* ఒక సారి అయ్యాక...అనవసరం
? మగాడికి డబ్బు అవసరమా?
* ఆరేడు తరాలకి సరిపడే సంపాదించాక..అనవసరం
? ఈ ప్రపంచంలో అందమైనది?
* మా అమ్మ...
?బిన్ లాడెన్ వచ్చి సినిమా తియ్యమంటే తీస్తారా?
* వందకోట్లు ఖర్చు పెట్టించి సూపర్ ఫ్లాప్ తీస్తా
? మీరు ఒక్క రోజు సి.యం. అయితే?
* నారా చంద్రబాబునాయుడ్ని పర్మనెంట్ సి.యం.గా చేస్తా
? యూత్ కి మీరెచ్చే సలహా?
* వెధవ వేషాలు వెయ్యొద్దు.
? చివరగా ఏమైనా రెండు ముక్కలు చెప్పండి?
* బై...బై..
>>>>>>>>>>>>>>>>>>>>>>>>
సరదాగాసాగిన ఈ తుంటర్వ్యూ "హాసం" హాస్య-సంగీత పక్ష పత్రిక
1-15 జూన్ 2003 సంచిక సౌజన్యంతో...

*

Wednesday, 20 October 2010

సరసి నవ్వుల బొమ్మలు



తెలుగు పత్రికలు, ముఖ్యంగా "నవ్య"వారపత్రిక పాఠకులకు
సరసిగారి కారూన్లు పరిచయమే. ప్రతి కార్టూనూ మనల్ని
పలకరించి పులకరింపజేసి నవ్వుల్తో ముంచెత్తుతాయి.
చక్కని నేటివిటీతోశ్రీ బాపూ, డా"జయదేవ్ సరసన నిలిచే
కార్టూనిస్ట్ సరసి గారే ! సరస్వతుల రామ నరసింహం అనే
సరసి 1956 జూలై 7న జన్మించారు. ఎం.ఏ.(ఫిలాసఫీ),ఎల్.ఎల్బీ
చదివి ఆంధ్రప్రదేశ్ శాసన సభ,హైద్రాబాదులో రిపోర్టర్ గా పని
చేస్తున్నారు. శ్రీ సరసి కార్టూనిస్టే కాదు, మంచి కధకుడు, వేణు
గాణ లోలుడు. చాలా అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో గుర్తింపు
పొందారు. వివిధ పత్రికలు జరిపిన పోటీల్లో కధలకు,కార్టూన్లకు
బహుమతులు అందుకొన్నారు. "సరసి కార్టూన్లు" పేరిట రెండు
పుస్తకాలు వెలువడ్డాయి. మొదటి భాగానికి శ్రీ బాపు ఈ నరసీంహం
గారి బొమ్మను ముఖచిత్రంగా అద్భుతంగా వేశారు.
బాపు గారు సరసి కార్టూన్లు చూసి ఆ పత్రిక సంపాదకులకు ఇలా
ఉత్తరం వ్రాసారు.
" మీ పత్రికలోసరసి అన్నతను ( or ఆమె )
వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన
వానిని ఇంత వరకూ చూడలేదు"
బాపు 16.12.98
ఇంత కన్నా బంగారు పతకం ఏం కావాలి చెప్పండి, మచ్చుకి
ఇక్కడ ఆయన కార్టూన్ రుచి చూపిస్తున్నాను. ఇక మీరు ఆ
పుస్తకాలు తీసు"కొని" నవ్వుకోవడమే తరువాయి. మొదటి
పేజీ నుంచి చివరి పేజీ దాకా నవ్విస్తాయి! బుక్ నంబరు టూలో
ఆఖరి పేజీలో తన పైనే వేసుకొన్న కార్టూన్ అద్భుతం! తనేసిన
కార్టూన్లను ఓ పెద్దాయనకు చూపిస్తుంటే ఆయన, "ఇక చాలు
వెళ్ళిరా నాయనా ! వీలు చూసుకొని నేన్నవ్వుతాగా!"అంటాడు.
ఆ బొమ్మలో!
చట్టబద్ధమైన హెచ్చరిక: మీ పొట్టలకు నా భాధ్యత లేదు సుమా!..

Tuesday, 19 October 2010



"నవ్వించడం ఒక యోగం
నవ్వడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల.
అసలు సిసలు తెలుగు హాస్యానికి నిర్వచనం
చెప్పిన జంధ్యాల మనల్ని వదలి దేముళ్ళను
నవ్వించడానికి మనల్ని ఏడిపిస్తూ స్వర్గానికి
వెళ్ళిపోయారు. తెలుగు తెర మీద సకుటుంబంగా
నవ్వుల హస్యం ఆయనతోబాటే మనకూ దూరమై
పోయింది. ఆయన చిత్రాలలోని కొన్ని నవ్వుల
మాటల ముత్యాలను ప్రోగుచేసి ఏరుకుందాం!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"చూపులు కలిసిన శుభవేళ" చిత్రంలో శ్రీకోట
గ్రాంధికంలో మాట్లాడతారు.
"మోహన్ నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము.
తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగు భాషయందు
మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియునా..తెలుగు
భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ యాబది
ఆరు అక్షరములు సఖ్యతతో, స్నేహశిలతతో కలిసి
యున్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాషవలె
తాత,తండ్రి,బిడ్డ,మనుమలు,మునిమనువలు అందరూ
కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన వుండవలెనని
నా ఉద్దేశ్యము" కొన్ని ఇంగ్లీషు పదాలకు ఆయన
చెప్పిన తెలుగు పదాలు !!
బస్టాండ్ : చతుశ్చక్రశకట నివాసస్ఠానము
కాఫీ : నిశివరోస్తూతకం
పోస్ట్ మాన్ : ఉత్తర కుమారుడు
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
"వివాహ భోజనంబు" లో సుత్తి వీరభద్రరావు పాత్ర
సంభాషణలు మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి.
"తెర లేవంగానే హీరో ఓ కాఫీ హోటల్ కెలతాడు.
సర్వర్ రాగానే హీరో ఏమున్నాయ్ అని అడిగాడు.
అప్పుడు సర్వర్ ఇడ్లీ,రవ్వడ్లీ,గారె,మసాలాగారె,ఉప్మా,
కిచిడీ,పెసరట్టు,మినపట్టు,రవ్వట్టు,మసాలా అట్టు,
బాతు,టమాటోబాతు,బొండా,బజ్జీ,మైసూర్ బజ్జీ,
మిరపకాయ బజ్జీ,అరటికాయ బజ్జీ,తమలపాకు బజ్జీ,
లడ్డు, బందరు లడ్డు, రవ్వలడ్డు,మిఠాయి,పీచు మిఠాయి,
బందరు మిఠాయి,బొంబాయి మిఠాయి,కలకత్తా మిఠాయి,
జాంగ్రీ,పాలకోవా,హల్వా,మైసూర్ పాకు,అమలాపురం
కాజా,భీమవరం బాజా,పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు.
అప్పుడు హీరో అట్టు తెమ్మంటాడు. అప్పుడు సర్వర్ ఏ అట్టూ..
పెసరట్టా,మినపట్టా,రవ్వట్టా,మసాలాఅట్టా,సెవెంటీఎమ్మేమ్ము
అట్టా, ఎంఎల్.ఏ.అట్టా,నూనేసి కాల్చాలా,నెయ్యేసి కాల్చాలా
నీళ్ళొసి కాల్చాలా,పెట్రోలుపోసి కాల్చాలా,కిరసనాయిలుపోసి
కాల్చాలా,డీజిలేసికాల్చాలా,అసలు కాల్చాలా వద్దా అని
అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు,
కాఫీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు..ఏ కాఫీ..మామూలు
కాఫీయా,స్పెషలు కాఫీయా,బుర్రూకాఫీయా, నెస్సు కాఫీయా,
బ్లాక్ కాఫియా,వైటు కాఫియా,హాటు కాఫియా,కోల్డ్ కాఫియా,
నురగ కావాలా, వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు కావాలి అని
అడిగాడు.అప్పుడు హీరో మామూలు కాఫి తెమ్మన్నాడు.
అప్పుడు సర్వరు నీలగిరి కాఫీయా,హిమగిరి కాఫీయా,సిమలా
కాఫియా..." అని ఇలా వీరభద్రరావు అనర్గలంగా చెబుతుంటే
బ్రహ్మానందం ":ఆపండి మహాప్రభో..ఆపండి.తమలో ఇంత
ఊహా శక్తి ఉందని ఊహించలేకపోయాను.ఈ కధే సినిమా
తీసుకోండి పదివేల రోజులాడుతుంది "అంటాడు.
మరో సారి ఊర్ల పేరు చెబుతూ, " హైదరాబాదు,అదిలాబాదు,
సికిందరాబాదు,అహ్మదాబాదు,ఫకీరాబాదు,అలహాబాదు,
ఫరీదాబాదు,ఔరంగాబాదు,దన్ బాదు,సింధ్ బాదు,ముస్తాబాబాదు,
పైసలాబాదు,ఘజియాబాదు,అబ్దుల్లాబాదు,చపాలాబాదు,హుస్సేను
బాదు అంటుంటే, బ్రహ్మానందం,"నా బొందబాదు, శ్రార్ధం బాదు..
నా పిండాకూడుబాదు అంటాడు.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
"రెందు రెళ్ళు ఆరు" సినిమాలో వీరభద్రరావుగారి ఈ డైలాగులు
మరోసారి గుర్తు చేసుకోండి.
"నేను ఇంట్లో వంట చేస్తానని చెప్పిన ఆ శుంఠ ఎవడు?"
"మీ ఏరియా ముష్ఠివాడు సార్"
"ఎవరూ..మా ఏరియా ముష్ఠివాడా..వాడి మాటలు నమ్మి
మీ గైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫొటో వేసుకుంటావా..
ఇలా నాతో మాట్లాడటానికి ఎన్ని గుండెలురా రాస్కేల్..
ఇంకోసారి ఇటు వచ్చి కనబడు..నిన్ను రోట్లోవేసి రుబ్బుతా
గైండర్ వెధవా"
వీరభద్రరావు భార్య శ్రీలక్ష్మి తో "ఇవాళ నేను నీకున్నాను.
వండి పెడుతున్నాను. రేపు అటో ఇటో అయితే నీకు తిండి
ఎలా చెప్పు?"
" నా అదృష్టం ఇంతే అనుకొని హోటల్ నుంచి క్యారియర్
తెప్పించుకొంటాను" అని తాపీగా జవాబిస్తుంది శ్రీలక్ష్మి.
ఇలా జంధ్యాల నవ్వుల మాటలు ఆయన సినిమాల్లో కోకొల్లలు.
జంధ్యాల వ్రాసిన మంచి జోకులు రెండు వాల్యుములుగా
ఎమెస్కో వారు ప్రచురించారు. ఒక్కో వాల్యూమ్ పాతిక
రూపాయలే! కడుపారా తృప్తిగా పదేపదే నవ్వుకోవచ్చు.
  • Blogger news

  • Blogroll

  • About