RSS
Facebook
Twitter

Wednesday, 20 October 2010

సరసి నవ్వుల బొమ్మలు



తెలుగు పత్రికలు, ముఖ్యంగా "నవ్య"వారపత్రిక పాఠకులకు
సరసిగారి కారూన్లు పరిచయమే. ప్రతి కార్టూనూ మనల్ని
పలకరించి పులకరింపజేసి నవ్వుల్తో ముంచెత్తుతాయి.
చక్కని నేటివిటీతోశ్రీ బాపూ, డా"జయదేవ్ సరసన నిలిచే
కార్టూనిస్ట్ సరసి గారే ! సరస్వతుల రామ నరసింహం అనే
సరసి 1956 జూలై 7న జన్మించారు. ఎం.ఏ.(ఫిలాసఫీ),ఎల్.ఎల్బీ
చదివి ఆంధ్రప్రదేశ్ శాసన సభ,హైద్రాబాదులో రిపోర్టర్ గా పని
చేస్తున్నారు. శ్రీ సరసి కార్టూనిస్టే కాదు, మంచి కధకుడు, వేణు
గాణ లోలుడు. చాలా అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో గుర్తింపు
పొందారు. వివిధ పత్రికలు జరిపిన పోటీల్లో కధలకు,కార్టూన్లకు
బహుమతులు అందుకొన్నారు. "సరసి కార్టూన్లు" పేరిట రెండు
పుస్తకాలు వెలువడ్డాయి. మొదటి భాగానికి శ్రీ బాపు ఈ నరసీంహం
గారి బొమ్మను ముఖచిత్రంగా అద్భుతంగా వేశారు.
బాపు గారు సరసి కార్టూన్లు చూసి ఆ పత్రిక సంపాదకులకు ఇలా
ఉత్తరం వ్రాసారు.
" మీ పత్రికలోసరసి అన్నతను ( or ఆమె )
వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన
వానిని ఇంత వరకూ చూడలేదు"
బాపు 16.12.98
ఇంత కన్నా బంగారు పతకం ఏం కావాలి చెప్పండి, మచ్చుకి
ఇక్కడ ఆయన కార్టూన్ రుచి చూపిస్తున్నాను. ఇక మీరు ఆ
పుస్తకాలు తీసు"కొని" నవ్వుకోవడమే తరువాయి. మొదటి
పేజీ నుంచి చివరి పేజీ దాకా నవ్విస్తాయి! బుక్ నంబరు టూలో
ఆఖరి పేజీలో తన పైనే వేసుకొన్న కార్టూన్ అద్భుతం! తనేసిన
కార్టూన్లను ఓ పెద్దాయనకు చూపిస్తుంటే ఆయన, "ఇక చాలు
వెళ్ళిరా నాయనా ! వీలు చూసుకొని నేన్నవ్వుతాగా!"అంటాడు.
ఆ బొమ్మలో!
చట్టబద్ధమైన హెచ్చరిక: మీ పొట్టలకు నా భాధ్యత లేదు సుమా!..

1 comment:

  1. సరసి గారు నాకు ఆత్మీయ మిత్రులు. వారి గురించిన టపా నన్ను ఆనందంతో ఉక్కిబిక్కిరి చేసింది.
    మనకున్న మంచి కార్టూనిష్టులలో సరసి నిశ్చయంగా ఒకరు. వారి గీతలు, రాతలు కూడా చక్కని నేటివిటీతో అలరారుతూ ఉంటాయి.

    సరసి గారి అమ్మాయి వివాహ మండపంలో వారు వేసిన కార్ట్యూనులు పెద్ద సైజులో అతికించేరు. పెళ్ళి మండపం నవ్వులతో గుబాళించి పోయింది.

    అందులో ఒక దానిని గురించి:
    వధూవరులు తలంబ్రాల వేళ నెత్తి మీద బియ్యానికి బదులు కంది పప్పు పోసుకుంటూ ఉంటారు.
    వధువు తండ్రి ఇలా గొప్పలు పోతాడు:తలంబ్రాల తంతు కొంచెం రిచ్ గా
    ఉంటుందనీ, బియ్యానికి బదులుగా కంది పప్పు వాడుతున్నాం....

    ఆకాశాన్ని అంటిన కంది పప్పు ధర గురించి వేసిన ఈ కార్ట్యూను ఏలిన
    వారికి చురక వేస్తూనే, కడుపు పగిలేలా నవ్విస్తుంది.

    సరసి గారికి, ఇంత చక్కని టపా పెట్టిన మీకు నా ధన్యవాదాలు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About