RSS
Facebook
Twitter

Thursday, 28 October 2010



గతంలో సినిమా విడుదలకాగానే ఆ సినిమా పాటలపుస్తకాలు
ఇంటర్వల్లో హాల్లో అమ్మేవారు.అందులో సినిమా పాటలు, ముందు
పేజీలో కధ వేసేవారు. కధ చివర మిగిలిన కధ మా వెండితెరపై
చూడండి అని వ్రాసేవారు. ఇప్పుడు ఆ సినిమా ఫాటల పుస్తకాలు
రావటం చాలా ఏళ్ళ నుంచే ఆగిపోయింది. బహుశ: వేయటానికి
ఇప్పటి సినిమాల్లో కధ, వేయ తగ్గ పాటల సాహిత్యం లేదని కావొచ్చు.
పాటల్లో అర్ధవంతమైన మాటలేవి? మొట్టమొదటి సారిగా అన్నపూర్ణా
వారి "తోడికోడళ్ళు" చిత్రానికి వెండితెర నవలవెలువడింది. అటు
తరువాత అన్నఫూర్ణా చిత్రాలతో బాటు కొన్ని చిత్రాలకు వెండితెర
నవలలు ప్రచురించడం మొదలయింది. శ్రీ ముళ్లపూడి వెంకట
రమణ "వెలుగు నీడలు", "ఇద్దరు మితృలు" చిత్రాలను నవలీక
రించారు. శ్రీ బాపు చిత్రించిన సినిమా దృశ్యాలు వాటికి మరింత
ఆకర్షణగా నిలిచాయి. "ఇద్దరు మితృలు" నవల పుస్తకం పేజీల
పై భాగాన ఇద్దరు నాగేశ్వరరావులు కరచాలనం చేసుకుంటున్న
ఫొటోలు ఒక్కొక్క ఫ్రేమును వరుసగా ముద్రించారు.పుస్తకం
చేతిలో పట్టుకొని పేజీలు గబగబా వదులుతుంటే ఇద్దరు షేక్
హాండ్ చేసుకుంటూ కదిలేవి! దురదృష్ట వశాత్తూ ఆపుస్తకాలు
నా దగ్గరనుంచి చేజారి మళ్ళీ నాకు చేరలే! హాసం బుక్స్ వారు
"ఇద్దరుమితృలు" పుస్తకాన్ని పున ర్ముద్రించారు కాని కదిలే
బొమ్మలు లేవు.ఇటీవలే జూనియర్ యన్టీఆర్ నటించిన "యమ
దొంగ" పాటల సీడీ తో బాటు కదిలే బొమ్మల స్టిల్స్ తో ఓ పుస్తకం
ఉచితంగా ఇచ్చారు. ఈ ప్రయత్నం చాలా బావుంది.
ఆంగ్ల చిత్రాలకు కూడా వాటి ఫొటో స్టిల్స్ తో బొమ్మలకధల
రూపంలో పుస్తకాలు వెలువాడ్డాయి. STAR TREK II,The
wrath of Khan photo story, CLOSE ENCOUNTERS
of the third kind, photo novel గా వచ్చాయి. ఇందులో
చిత్రాల్లోని స్టిల్స్ వరుసగా వేసి బొమ్మల కధ రూపంలో(కామిక్స్)
వచ్చాయి. అలానే James Bond "A VIEW to KILL",
"STAR TREK IV ,the voyage home, మాగజైన్స్ రూపంలో
విడుదలయ్యాయి. "మగధీర" చిత్రం లోని స్టిల్స్ తో ఇలా ఓ ఫొటో
నవల తెలుగులో వేస్తే బాగుంటుంది. ఇదివరలో చిరంజీవి సినిమాలు
విడుదలయినప్పుడు ఇలా ప్రత్యెకంగా మాగజైన్స్ రూపంలో వేసినట్లు
గుర్తు. 2000,2007లలో మల్లీశ్వరి,మాయాబజార్ చిత్రాల నవలలు
విడుదలయ్యాయి.

2 comments:

  1. మా ఇంట్లో కూడా మా తల్లిదండ్రులు కొన్న పాటల పుస్తకాలు ఎన్నో ఉండేవి (మీరు అంతకు ముందు రాసిన బూరెల మూకుడు-రాజయోగం-కొంటె కిష్టయ్యది కూడా). చాలామటుకు చదలు పట్టి పాడైపోయేయి. వీలైతే మీ దగ్గరున్నవి scan చేసి బ్లాగుల ద్వారా అందరూ చదువుకునే వీలు కల్పించండి.

    ReplyDelete
  2. శ్రీ అ.రావుగారూ, మీ బ్లాగులను చూస్తూ వుంటే అన్నీ సేకరించినా
    యెందుకు దాచుకోలేదో కదా అనిపిస్తుంది. కాని అలా చేసేంకాబట్టే
    మీ బ్లాగుని ఇంట్రెస్ట్ గా చూస్తున్నాము కదా అని కూడా అన్పిస్తుంది.
    నేను పలాసాలో వున్నప్పుడు 'బంగారు పిచిక' సినీమా వచ్చింది.
    అప్పుడు పాటలపుస్తకం చాలా చిన్నసైజ్ (పిచిక సైజ్) వేసారు.
    కొన్నాకూడా. కాని పిచికకదా యెప్పుడో యెగిరిపోయింది. ఆ సినిమా
    చూసి వచ్చిన జనం అనుకోవడం....బాపూ గొప్పోడురా బాబూ
    బొమ్మలేసి పరుగెత్తించేసాడు.... మీ ఎఫర్ట్స్ కు అభినందనలు...దినవహి

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About